.
ఈరోజు పత్రికల్లో ఓ ఫోటో వార్త కనిపించింది… వేరే వివరాలు ఏమీ లేవు… అదేమిటంటే..? ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని, రుద్రప్రయాగ్ జిల్లాలో మధ్యమహేశ్వర్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి…
చూడబోతే అచ్చంగా కేదారనాథ్ గుడిలా ఉంది వాస్తుశిల్పం…. పూలతో అలంకరించారు… కానీ అదేమిటి మరి..? మధ్యమహేశ్వర్ ఆలయం అంటున్నారు…. కేదారనాథ్‌కే మరో పేరు ఉందా ఏమిటనే సందేహమూ తలెత్తింది…
Ads
తీరా వివరాల కోసం, సందేహ నివృత్తి కోసం సెర్చితే కొత్త విషయాలు తెలిసొచ్చాయి… (నాకు తెలియకపోవడం ఇన్నాళ్లూ…) మనకు ఉత్తర భారతం అనగానే గుర్తొచ్చే ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలు ఏమిటి..?
చార్ ధామ్ (కేదారనాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి), వైష్ణోదేవి, ఉజ్జయిని, వారణాశి, ద్వారక, అయోధ్య, బృందావనం, పూరి, బుద్ధగయ, అమరనాథ్… ఇంకాస్త ముందుకెళ్తే మానససరోవరం, కైలాస పర్వత యాత్ర… ఇవే కదా ముఖ్యమైనవి…
చార్ ధామ్‌లో ఒక గుడి పేరు కేదారనాథ్… అందరికీ తెలుసు… ఇదే కేదారనాథ్‌కు అనుబంధంగా, అంటే అదే కారిడార్‌లో మరో నాలుగు శివాలయాలున్నాయి… అవి తుంగనాథ్, మధ్యమహేశ్వర్, కల్పేశ్వర్, రుద్రనాథ్… వీటినే పంచ కేదార్ అంటారు… ఇదుగో ఈ ఫోటో మధ్యమహేశ్వర్ ఆలయం… సేమ్, కేదారనాథ్…
మొన్న కేదారనాథ్ గుడి తలుపులు తెరిచారు కదా… సేమ్, ఈ మధ్యమహేశ్వర్ గుడి తలుపులు కూడా తెరుచుకున్నాయి… పంచపాండవుల పాపపరిహార యాత్రతో లింక్ పెట్టి ఓ స్థలపురాణం చెబుతుంటారు… సతీదేవి శరీరభాగాలు పడిన క్షేత్రాలను శక్తిపీఠాలు అంటాం కదా… అలాగే శివుడి అవయవాలను బట్టి ఈ పంచ కేదార గుళ్లను చెబుతుంటారు…
ఇది కేదారనాథ్… ఇక్కడ శివుడు సాధారణంగా కనిపించే లింగం తరహాలో గాకుండా త్రిభుజం… శివుడి కుంభస్థలం అట… సముద్ర మట్టానికి 3,583 మీటర్ల ఎత్తులో ఉంటుంది… తరువాత తుంగనాథ్… 3680 మీటర్ల ఎత్తులో ఉంటుంది… శివుడి భుజాలకు సంబంధించిన గుడి… 3680 మీటర్ల ఎత్తులో (సముద్ర మట్టానికి) ఉండే ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన శివాలయం ఇది… (చమోలీ జిల్లా)…
ఇదీ తుంగనాథ్ గుడి… తరువాత మధ్యమహేశ్వర్ గుడి… తరువాత మధ్యమహేశ్వర్ గుడి… ఇదీ రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంటుంది… 3497 మీటర్ల ఎత్తు… శివుడి నాభిగా చెబుతారు… ఇదుగో ఆ గుడి…
తరువాత గుడి రుద్రనాథ్… ఇది శివుడి ముఖం… చమోలీ జిల్లాలో 3600 మీటర్ల ఎత్తులో ఉంటుంది… ఈ గుడి పితృదేవతల పిండ ప్రదానాలకు ప్రసిద్ధి… చిన్న గుడి… ఇదుగో దాని ఫోటో…
చివరగా కల్పేశ్వర్… శివుడి జటాజూటం ఇది… ఉర్గం లోయలో 2200 మీటర్ల ఎత్తు… పంచ కేదార ఆలయాల్లో ఏడాది పొడవునా తెరిచి ఉండే గుడి ఇదొక్కటే… మిగతా నాలుగు గుళ్లను హిమపాతం దృష్ట్యా కొంతకాలం మూసేస్తారు… ఇదుగో కల్పేశ్వర్ గుడి ఫోటో… గుహలో ఉండే చిన్న గుడి…
ఎక్కడికి వెళ్లాలన్నా ట్రెక్కింగ్ ఉంటుంది… దానికి తగిన ఏర్పాట్లు, జాగ్రత్తలతోనే వెళ్లాలి… ఈ కారిడార్‌కు ఉత్తరాఖండ్ టూరిజం శాఖ బాగా ప్రచారం కల్పిస్తోంది… దేశం నలుమూలల నుంచీ ఈ అయిదు గుళ్లకు ప్రత్యేకంగా టూర్ ఆపరేటర్లు విభిన్న ప్యాకేజీల్లో టూర్స్ కండక్ట్ చేస్తున్నారు…
వసతి ప్రధానంగా చిన్న చిన్న హోటళ్లు, గెస్ట్ హౌజులు, టెంట్లు… వ్యయప్రయాసలకు ఓర్చయినా సరే వెళ్లాలనుకునే తీర్థయాత్రికులకు మంచి టూర్… మొత్తం ప్రకృతిలోనే ప్రయాణం, ఆధ్యాత్మిక భావనలతో శివసాక్షాత్కారం… వై వోన్లీ చార్ ధామ్, వై నాట్ పంచ కేదార్…!!
Share this Article