Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఛాలెంజ్..! ‘మెదడుకు మేత’ నవలను సినిమాకరించడం ఛాలెంజే..!!

May 23, 2025 by M S R

.

Subramanyam Dogiparthi… తాడిని (తాటిని) తన్నేవాడుంటే వాడిని తలదన్నే వాడు ఉంటాడు అనే సూత్రం మీద ఆధారపడి ఉన్న ఎత్తులు , ఎత్తుకుపైఎత్తుల కధ ఈ ఛాలెంజ్ సినిమా కధ .

అప్పటికే వీర పాపులరయిన యండమూరి వీరేంద్రనాధ్ గారి డబ్బు టుది పవరాఫ్ డబ్బు నవల ఆధారంగా తీయబడిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయింది . 40 ఏళ్ళ తర్వాత కూడా సినిమా పాతబడలేదు . ఇప్పుడు తీసిన సమకాలీన సినిమాలాగానే ఉంటుంది .

Ads

యండమూరి గారు సృష్టించిన పాత్రలకు ఇంకా ఎక్కువ నగిషీ పెట్టారు స్క్రీన్ ప్లే రైటర్ సొయినాధ్ గారు . సూపర్ ఫాస్ట్ రైలులాగా ఉరకటానికి కోదండరామిరెడ్డి గారి దర్శకత్వం ఎంత కారణమో , అంతే ఘనత సాయినాథ్ గారి స్క్రీన్ ప్లేది కూడా . ఆ తర్వాత సత్యమూర్తి గారి డైలాగ్స్ .

AK 47 నుండి వచ్చే తూటాల్లాగా దూసుకు వస్తాయి . సినిమాలోని ఎత్తుకుపైఎత్తులకు ధీటైన వ్యక్తీకరణ డైలాగులు . ఆ రెండింటినీ సమన్వయం చేయడం కష్టమే . అయినా సత్యమూర్తి గారు చాలా పదునైన డైలాగులను వ్రాసి సక్సెస్ అయ్యారు .

తర్వాత పాటలు . వాటిని వ్రాసిన వేటూరి వారిని , డాన్సులను కంపోజ్ చేసిన తారను , సంగీతాన్ని స్వరపరచిన ఇళయరాజాని అభినందించాలి . బ్రహ్మాండమయిన మ్యూజిక్ ఇళయరాజా గారిది . నాకయితే వీర నచ్చింది చిరంజీవి , సిల్క్ స్మిత పాట , డాన్స్ … ఖైదీ సినిమాలో రగులుతుంది మొగలి పొదే గుర్తుకొస్తుంది … ఆ పాటలో చిరంజీవి గుర్రం మీద ఎంట్రీని కోదండరామిరెడ్డి అద్భుతంగా చిత్రీకరించారు . మనసే మైకం పాట .

మిగిలిన అన్ని డ్యూయెట్లు చిరంజీవి , విజయశాంతి , సుహాసిని అదరగొట్టేసారు . ఇందువదన కుందరదన మందగమన పాటలో ఐ లవ్యూ ఓ హారికా కుర్రాళ్ళు బాగానే పాడేవాళ్ళు . బంపర్ హిట్ ఆ పాట… ఒకరకంగా అప్పట్లో సన్నని మెరుపుతీగలాంటి విజయశాంతి సోయగాలు ఈ సినిమాకు పెద్ద ప్లస్… (అవునూ, కుందరదన అంటే ఏంటో !?)

సాయంకాలం సాగరతీరం , భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికయినా , ఓం శాంతి ఓం శాంతి డ్యూయెట్లు సినిమా ఘన విజయానికి ప్రధాన కారణాలలో ముఖ్యమయినవి . చిరంజీవి నటనతో ధీటుగా రావు గోపాలరావు , విజయశాంతి , సుహాసిని పోటీపడ్డారు . సుహాసిని , విజయశాంతి పాత్రలను చాలా గొప్పగా తీర్చిదిద్దారు .

తర్వాత చెప్పుకోవలసింది గొల్లపూడి మారుతీరావు , సిల్క్ స్మితల జంట . పనిగండం పేరుతో ఏ పని చేయకుండా , ఒకవేళ చేసినా సున్నప్పిడత పనులు చేసే బతుకు . ప్రతి డైలాగుకు ఆఫ్ ఇండియా అనే tag line తగిలిస్తూ మాట్లాడే గొల్లపూడి డైలాగులు , డైలాగ్స్ డెలివరీ సినిమాకు హైలైటే .

మసాలా డాన్సులకే పరిమితమయ్యే సిల్క్ స్మితకు సినిమా అంతా ఉండే మంచి పాత్ర లభించింది . చక్కగా పోషించింది . ఇతర ప్రధాన పాత్రల్లో సాయికుమార్ , రాజేంద్రప్రసాద్ , ప్రభృతులు నటించారు .

సాధారణంగా యండమూరి నవలలు చదరంగం ఆటలాగా ఉంటాయి . యక్ష ప్రశ్నలు , క్విజ్ పోటీల్లాగా ఉంటాయి . ఈ సినిమాలో అలాంటి డైలాగులు పుష్కలం . ఆవేశంలో కూతుర్నే పందెం కాసిన తండ్రితో మహాభారతంలో ధర్మరాజు భార్యను ఎలా పందెం కాసాడో అర్థం అవుతుందనే కూతురి డైలాగ్ ప్రేక్షకులకు గుర్తు ఉండే ఉంటుంది .

వ్యాపారంలో కట్టుకున్న దానిని కూడా నమ్మకూడదనే వ్యాపార సూక్తి . న్యాయబధ్ధత vs చట్టబధ్ధత డిబేట్ . ఆర్ధిక , సామాజిక , రాజకీయ నేరాలు చేయటం అన్యాయం . ప్రాసిక్యూషన్ వైఫల్య సహాయంతో శిక్ష తప్పించుకోవటం చట్టబధ్ధత . ఇదే మన దేశ సమకాలీన సంస్కృతి కదా !

14 సెంటర్లలో వంద రోజులు ఆడటమే కాదు , కనక వర్షం కురిపించింది . సుందర విశాఖపట్టణంలో తీస్తే సినిమాలు సక్సెస్ కావాల్సిందే . నిర్మాత కె యస్ రామారావు , దర్శకుడు కోదండరామిరెడ్డి , చిరంజీవి , యండమూరి కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అయింది ఈ సినిమాతో .

ఈతరంలో కూడా ఈ సినిమా చూడని వారు ఎవరూ ఉండరేమో ! ఎవరయినా ఒకరూ అరా ఉంటే అర్జెంటుగా చూసేయవచ్చు . యూట్యూబులో ఉంది . తలచుకుంటే ఛాలెంజుగా తీసుకుని యువతరం ఏదయినా సాధించగలదనే సందేశాన్ని ఇస్తుంది సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు
.



.

ఇక్కడే మరికొంత యాడ్ చేద్దాం… యండమూరి కేవలం సినిమాల కోసమే రాసిన నవలలూ ఉన్నయ్… కానీ అభిలాష, డబ్బు ది పవర్ ఆఫ్ డబ్బు వంటివి సినిమాల కోసం రాసినవి కావు… నిజానికి అలాంటివి సినిమాలుగా పనికిరావు… అందుకే సినిమాకరించడానికి మరో కొత్త రచయిత అనేక సీన్లు కొత్తగా క్రియేట్ చేశాడు… చేయాల్సి వచ్చింది…
.
సినిమా చూసిన యండమూరికే ఆశ్చర్యం వేసి ఉంటుంది, ఇది నేను రాసిన నవలేనా అని…! ప్రత్యేకించి వెన్నెల్లో ఆడపిల్ల, అభిలాష, డబ్బు ది పవరాఫ్ డబ్బు, ప్రార్థన వంటివి మెదడుకు మేత బాపతు… కమర్షియల్ సినిమా పోకడలు కావు… అంతర్ముఖం అయితే ప్రజెంట్ తెలుగు దర్శకులు ఎవరూ తీయలేరు…
.
సినిమా అనగానే హీరో ఇమేజ్, పాటలు, రొమాన్స్, స్టెప్పులు గట్రా చాలా ఉండాలనేది తెలుగు సినిమా నీతి కదా… అవన్నీ రంగరించారు… ఎలాగైతేనేం సూపర్ హిట్…
.
చివరలో చిల్లర తక్కువ పడితే సాయికుమార్ తీసుకొచ్చి ఇవ్వడం వంటి డ్రామా ఎలా ఉన్నా… నవలలోనే ఓ చిన్న లోపం… సంపాదన వేరు, ఏదైనా ఉత్పత్తికి తీసుకునే డిపాజిట్లు వేరు… హీరో డిపాజిట్ల సొమ్మును కూడా తను సంపాదించినట్టు చూపించేస్తాడు… తొండి…



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • డాడీ కేసీయార్ చుట్టూ ఉన్న ఆ దెయ్యాలు ఎవరు కవితక్కా..?
  • చరిత్ర చెబుతానంటూ, అసలు చరిత్ర మరిచి, ఏదో కొత్త చరిత్ర చెప్పారు…
  • Ace..! ఓ నాన్ సీరియస్ స్టోరీ లైన్‌కు అక్కడక్కడా కాస్త కామెడీ పూత…
  • ‘ఉచిత ప్రలోభాల’ పార్టీలు చదవాల్సిన ‘కర్నాటక సర్వే’ ఫలితాల కథ..!!
  • AI … కొలువులే కాదు, ప్రాణాలూ తీస్తోంది… బహుపరాక్‌‌…
  • ఛాలెంజ్..! ‘మెదడుకు మేత’ నవలను సినిమాకరించడం ఛాలెంజే..!!
  • కూలిపోతున్న మినీ బంగ్లాదేశ్… కానీ ఇలాంటివి దేశంలో కోకొల్లలు..!!
  • నో పవర్, నో నెట్, నో ఫోన్, నో టీవీ… 17 ఏళ్ల ఏకాంతంలో… ఓ వన్యప్రాణిలా…!!
  • ఎస్.., ఓ అవకాశం ఇవ్వాల్సిందే..! ధిక్కార తూటా శాంతిమంత్రం..!!
  • చార్‌ ధామ్ కాదు… ఇది పంచ కేదార్..! వెరీ ఇంట్రస్టింగ్ కారిడార్..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions