ఎస్… ఖచ్చితంగా ఒక టీకా తయారీ ఖర్చు చాలా చాలా తక్కువ… అందుకే భారత్ బయోటెక్ సీఎండీ ఎల్లా కృష్ణ తనే స్వయంగా ఒక మాటన్నాడు… కేటీయార్ సమక్షంలోనే… ఇది మన హైదరాబాదీ కంపెనీ… ఒక మంచినీళ్ల సీసాకన్నా తక్కువ ధరకు నాణ్యమైన వేక్సిన్ అందిస్తాను అన్నాడు ఆయన… వేక్సిన్ల తయారీలో ఏళ్ల అనుభవం ఉంది, కరోనాకు ఓ స్వదేశీ వేక్సిన్ వస్తుంది కదాని అందరూ ఆనందపడ్డారు… తీరా ఏమైంది..? వాటర్ బాటిల్ ధర కాదు, ఫుల్ బాటిల్ మద్యం ధర ఖరారైంది… నిజం… మొదట్లో 150 రూపాయల ధరకు ఇచ్చింది… కోట్ల డోసులను కేంద్రం ఎక్కడెక్కడి దేశాలకో పంపించింది… ఫ్రంట్ లైన్ వారియర్లకు ఉచితంగా ఇచ్చింది… తరువాత 45 ఏళ్లుపైబడిన వాళ్లకు ఉచితంగా ఇవ్వసాగింది… వారెవ్వా, మోడీ ప్లానింగ్, కంపెనీలపై అదుపు సూపర్ అనుకున్నారు అందరూ… చప్పట్లు కొట్టారు… మరిప్పుడు ఏమైంది..?
ఇదే భారత్ బయోటెక్ వాళ్ల కోవాగ్జిన్ వేక్సిన్ గానీ, సీరం వాడు తయారు చేసే కోవిషీల్డ్ గానీ కేంద్రానికి 150 రూపాయలు, రాష్ట్రాలకు అమ్మితే 400, ప్రైవేటులో అమ్మితే 600 అని ధరలు ఖరారు చేశారు… తీరా ఇప్పుడు మళ్లీ అడ్డగోలుగా పెంచేసి, రాష్ట్రాలకు 600, ప్రైవేటులో హాస్పిటల్స్‌కు 1200 ధరలు నిర్ణయించారు… (బహుశా కోవిషీల్డ్ కూడా ఇవే ధరల్ని ప్రకటిస్తుందేమో…)… హాస్పిటల్ వాడు సర్వీస్ చార్జి, మన్నూమశానం అని పేర్లు చెప్పి 1500 వసూలు చేస్తాడు… అంటే రెండు డోస్‌లకు 3000… ఏపీ, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు మొత్తం వేక్సిన్ భారాన్ని భరించడానికి, ప్రజలకు ఉచితంగా వేక్సిన్ వేయించడానికి ముందుకొచ్చాయి… మరి మిగతా రాష్ట్రాల్లో ప్రజలు ఏమైపోవాలి..? కథ ఇంకా ఉంది…
Ads
అసలు వేక్సిన్ల ధరల్ని ఖరారు చేస్తున్నది ఎవరు..? కంపెనీల ఇష్టమేనా..? అదీ రెండుమూడు రోజుల్లోనే మారిపోతుందా..? ఒక ప్రైసింగ్ పాలసీ ఏమీ లేదా..? లేక కేంద్ర ప్రభుత్వమే ఏదో బయటకు చెప్పలేని ‘భారీ ఫేవర్‌ల’ను, గిరాకీని కంపెనీలకు సమకూరుస్తున్నదా..? అయితే ఎందుకు..? దేశదేశాలకు పంపించడానికి, ఫ్రంట్ లైన్ వారియర్లకు ఇవ్వడానికి, ఇప్పుడు 45 ఏళ్లపైబడిన వాళ్లకు వేక్సిన్ వేయడానికి తక్కువ ధరకు వేక్సిన్ సప్లయ్ చేస్తున్నాయి కాబట్టి… ఇక రాష్ట్రాలకు ఎక్కువ ధరలకు అమ్ముకో, ఇష్టారాజ్యం రేట్లను కుమ్ముకో అంటూ తను భారం తప్పించుకుని, రాష్ట్రాల నెత్తిన బండలు మోపుతోందా..? ఇదెక్కడి చోద్యం..? విపత్తు వేళ్లలో రాష్ట్రాలు వేరు, కేంద్రం వేరా..? మోడీ ప్రభుత్వ వ్యవహార ధోరణిలోనే ఏదో భారీ తేడా కొడుతోంది… కేటీయార్ అడిగిన ప్రశ్న నిజానికి విలువైంది… ‘‘వన్ నేషన్- వన్ రేట్ వర్తించదు ఎందుకు..?’’ అనడిగాడు… సహజంగానే కేంద్రం సమాధానం ఇవ్వలేదు, ఇవ్వదు… తనకు 150 రేటట, రాష్ట్రాలకు 600 అట…
ఇక కోవాగ్జిన్ విషయానికే వద్దాం… మన రాష్ట్రంలో కంపెనీ, మన వనరులు… కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐసీఎంఆర్, ఎన్ఐవీ కోవాగ్జిన్ రీసెర్చుకు సహకరించాయి, అందులో భాగస్వామ్యం ఉంది వాటికి కూడా… డబ్బులిచ్చింది ప్రభుత్వం, లైసెన్సులిచ్చింది… మూడో దశ ప్రయోగాలు అయిపోక ముందే ‘తక్షణ అవసరం’ పేరిట మార్కెట్లోకి రావడానికి తోడ్పడింది… భారీ గిరాకీ తనదే… (సీరం వాడికీ డబ్బులిచ్చింది, బిల్ గేట్స్ వాళ్లూ డబ్బులిచ్చారు…) ఐనా సరే, చౌకగా తయారయ్యే వేక్సిన్‌కు ఇంత భారీ ధరలను భారత్ బయోటెక్ ఎలా ప్రకటిస్తోంది ఏకపక్షంగా..?!
ఈ సీరం, ఈ భారత్ బయోటెక్ కంపెనీలకు మేలు చేకూర్చడం కోసమేనా ఢిల్లీ ఇతర వేక్సిన్లకు అడ్డుపడుతున్నది..? ఈ సందేహాలకూ సమాధానాలు దొరకవు… కోవాగ్జిన్, కోవిషీల్డ్ ఎంత తిప్పలు పడ్డా, మన జనాభాకు సరిపడా వేక్సిన్ తయారు చేయాలంటే రెండేళ్లు కావాలి… మరి అప్పటిదాకా ప్రజలకు ఏకైక దిక్కైన వేక్సిన్ ఎలా..? ప్రజలకన్నా ఈ టీకాాల ధరల దందా ప్రధానమా..? ఎవరిదీ అలుసు..? అసలు విదేశాల వేక్సిన్లను ఎందుకు రానివ్వడం లేదు..? ఎవరు బాధ్యులు..? అందరికీ తెలిసి సాగుతున్న యవ్వారమేనా..? ఫైజర్ వాళ్లు వేక్సిన్ తీసుకొస్తామంటే, అత్యవసర అనుమతి కోరితే మన డ్రగ్ కంట్రోల్ అథారిటీ నానా కొర్రీలు పెట్టి తరిమేసింది… ఇక్కడా ప్రయోగాలు చేసి, ఫలితాలు చూపించు అనేది ప్రధానమైన కొర్రీ… దాంతో ఫైజర్ వాడు పారిపోయాడు… అమెరికా, ఇజ్రాయిల్ సహా అనేక దేశాల్లో ఈరోజు ఫైజర్ వేక్సినే దిక్కు… కానీ మనకు మాత్రం పనికిమాలిన వేక్సిన్లా కనిపించింది… మరో కంపెనీ మోడెర్నా కూడా అంతే… రష్యాకు చెందిన స్పుత్నిక్ విషయంలో విపరీతమైన జాప్యం… ఇలా వేరే వేక్సిన్లు రావడం లేదు, రానివ్వడం లేదు, మరోవైపు ఈ కంపెనీలు కుమ్మడం మొదలుపెట్టేశాయి… ఈ రెండు డోస్‌లు పూర్తయితే… రాష్ట్రాల ఖజానాల నుంచి వేలకువేల కోట్లు దండుకుంటే… మళ్లీ ఏ ఆరు నెలలకో బూస్టర్ డోస్ తప్పనిసరి అని కొత్త పాట మొదలు పెడతాయా..? వాటికీ ఇష్టారాజ్యం ధరల్ని అవే ఖరారు చేసుకుంటాయా..? ఢిల్లీ ఎడ్డి మొహం వేసుకుని దిక్కులు చూస్తూ ఉంటుందా..?!
చూశారుగా… కోవిషీల్డ్ కథ కూడా ఇదే… వేరే దేశాల్లో రేట్లకన్నా ఇండియాలో రేట్లు ఎక్కువ… తయారయ్యేది మాత్రం ఇక్కడే… పైగా వేర్వేరు రేట్లు… దీన్ని తయారు చేసే సీరం సంస్థ సీఈవో అదర్ పూనావాలా ఖుల్లంఖుల్లా చెప్పేస్తున్నాడుగా… మరింత బాధ్యతారహితంగా… ‘‘కరోనా చికిత్స రేట్లతో పోలిస్తే మా వేక్సిన్ ధర తక్కువ, ముందుగా ధర తక్కువకు కేంద్రం అడిగినంత ఇచ్చాం, అదే రేటుకు అమ్ముతూ ఉంలేం కదా… ఉత్పత్తి సామర్థ్యం పెంచుతున్నాం…’’ అతి తెలివి, ఎహె, మా ఇష్టం, మేం చెప్పింది వినండి అన్నట్టుగా ఉంది ఇది… లేకపోతే చికిత్స ఖర్చులకూ వేక్సిన్ ఖర్చుకూ లంకె ఏమిటసలు..? కుమ్ముకొండి బ్రదర్స్… భారతీయుల చెవుల్లో ఎవడు ఎలాంటి పూలైనా పెట్టగలడు, దొరక్కపోతే ఖాళీ వేక్సిన్ సీసాలూ పెట్టగలరు…!! చివరగా :: కోవాగ్జిన్ అప్పుడే బూస్టర్ డోస్ ప్రయోగాలు మొదలుపెట్టేసింది… ఇంకెక్కడ..? మన నిమ్స్‌లోనే…!! సో, 6 నెలల ఆగండి, ఇక వాటినీ కుచ్చేస్తారు..!! మరీ చివరగా :: కార్టూనిస్ట్ సుభానీ ఈ యవ్వారంపై పేల్చిన కార్టూన్ చూడండి… సింపుల్, స్ట్రెయిట్, బ్లాస్టింగ్…
Share this Article