.
మన సొసైటీలో ఏవేవో చర్చకు వస్తున్నాయి… నిష్ప్రయోజన విషయాలపై టీవీల్లో, మీడియాలో బోలెడు చర్చలు… కంపుకొట్టే పొలిటికల్ గొడవలపైనా భారీ డిబేట్లు… కానీ నిజంగా సొసైటీ కన్సర్న్‌డ్, రైట్స్ కన్సర్న్‌డ్, లైఫ్ కన్సర్న్‌డ్ అంశాలపై కదలిక ఉందా అసలు..?
నిన్నటి, మొన్నటి ఒక వార్త మన వ్యవస్థ డొల్లతనానికి ఓ పెద్ద ఉదాహరణ… చదువుతుంటేనే బాధనిపించింది… ముందుగా ఆ వార్త చదవండి…
Ads
ఉత్తరప్రదేశ్… కౌశాంబి జిల్లా… గౌరాయే గ్రామం… 1977… అంటే 47, 48 ఏళ్ల క్రితం… ఊళ్లో ఓ ఘర్షణ జరిగింది… ప్రభు సరోజ్ అనే వ్యక్తి ఆ గొడవల్లో ప్రాణాలు కోల్పోయాడు… ఇలాంటి ఘర్షణలు, దొమ్మీలు రోజూ దేశమంతటా ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉంటాయి…
లఖన్ అనే వ్యక్తితోపాటు మరో ముగ్గురిని నిందితులుగా పోలీసులు కేసు కట్టారు… విచారణ జరిగింది… 1982లో… అంటే 43 ఏళ్ల క్రితం ప్రయాగరాజ్ జిల్లా సెషన్స్ కోర్టు నలుగురికీ జీవిత ఖైదు విధించింది… జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆ నలుగురూ అలహాబాద్ హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు…
ఆ అప్పీల్ విచారణ సా-గు-తూ-నే ఉంది… ఏళ్లకేళ్లు… ముగ్గురు నిందితులు ప్రాణాలే కోల్పోెయారు… ఎట్టకేలకు ఇన్ని దశాబ్దాలుగా సాగిన విచారణ ఓ కొలిక్కి వచ్చి లఖన్‌ను నిర్దోషిగా ప్రకటించింది కోర్టు… ప్రస్తుతం తన వయస్సు 104 ఏళ్లు… షరీరా అనే ఊళ్లో ఉన్న కూతురి ఇంటికి తనను పంపించేశారు… అయిపోయింది…
1977లో అరెస్ట్ అయినప్పటి నుంచీ తను జైలులోనే ఉన్నాడు… అంటే, నిర్దోషి అయి ఉండీ ఇన్ని దశాబ్దాలపాటు ఆ జైలు గోడల నడుమే బతుకంతా గడిపాడు… ఒకరకంగా తను దోషి గాకపోయినా మన దర్యాప్తు వ్యవస్థ, మన న్యాయవ్యవస్థ తన ఇన్నేళ్ల బతుకును బర్బాద్ చేసినట్టే కదా…
సుఖం లేదు, సంతోషం లేదు, స్వేచ్ఛ లేదు, వేరే బతుకు లేదు… సంసారం లేదు, నిస్సారంగా బతికీ బతికీ ఇప్పుడు జీవచ్ఛవంలా బయటికి వచ్చాడు… ఇన్నాళ్లూ హంతకుడనే నింద… సామాజికంగా చిన్నచూపు… ఒకరకంగా మన వ్యవస్థలు తన మౌలికమైన గౌరవంగా, ప్రశాంతంగా, సుఖంగా జీవించే హక్కును మింగేశాయి…
ఎవరిది తప్పు..? చాలా చాలా హక్కుల గురించి మాట్లాడుతున్నారు గానీ… ఇదుగో కేసుల్లో దశాబ్దాల తరబడీ సాగుతున్న జాప్యంపై మాత్రం దిగువ నుంచి పైదాకా ప్రభుత్వాలు మాట్లాడవు, కోర్టులు మాట్లాడవు… అసలు చర్చ, ప్రక్షాళన, దిద్దుబాటు, సరైన రీతిలో చర్యలు ఈ కోణంలో కదా అవసరం..?
నాలుగు దశాబ్దాలపైచిలుకు తను అనుభవించిన వేదనకు పరిహారం ఏమిటి..? నిజంగా ఎవరిది తప్పు..? దేశం గురించి గొప్పగా భుజాలు చరుచుకోవడం కాదు, ముందుగా ఇలాంటివి దిద్దుకుంటేనే ఆదర్శ సమాజం… దురదృష్టవశాత్తూ మన సొసైటీ పెద్ద తలకాయలకు ఆ స్పహ లేకపోవడం అసలైన విషాదం…
డబ్బు, మంచి లాయర్ దొరికే కేసుల్లో న్యాయం తీరు వేరు… అవేవీ లేని కేసుల్లో న్యాయం తీరు వేరు… ఎలా యువరానర్..? మేం కేసు పెట్టేశాం, ఇక నీ చావు నువ్వు చావు అన్నట్టు లేదా దర్యాప్తు వ్యవస్థల తీరు…
అయితే ఈ కేసుకు సంబంధించి కొన్ని వివరణలు ఆ వార్తల్లో కనిపించలేదు.,. ఒకటీరెండు సందేహాలు అలాగే ఉన్నాయి… మామూలుగా లైఫ్ పడినా సరే రెమిషన్లు పోను ఏ పదీ ఇరవై ఏళ్లలోనో బయటికి వస్తుంటారు కదా… మరి ఈయన 1977 నుంచీ ఇన్నేళ్లు ఎలా ఉన్నాడు..? ఎక్కడో ఏదో భారీ తేడా కొడుతోంది మన సిస్టంలో…!! బతికినన్ని రోజులూ జైలులోనే అనేంత శిక్ష విధించేంత నేరం కూడా కాదు కదా..!!
కానీ ఒక్క విషయంలో మాత్రం ఈ ముసలాయన్ని అభినందించాలి… ఇన్నేళ్లు జైలులో ఉన్నా 104 ఏళ్లపాటు ఆయుష్షును కాపాడుకున్నందుకు… (మన జైళ్ల స్థితిగతులు తెలిసిందే కదా…) మన సమాజంలో పెద్ద పెద్ద అక్రమార్కులకు మాత్రం అరెస్టు, కేసు అనగానే ఎక్కడ లేని రోగాలు వచ్చేస్తాయి, అదేమిటో మరి..!!
Share this Article