సెకెండ్ వేవ్ లో…
కొడిగడుతున్న జర్నలిస్టు దీపాలు
——————–
శ్రీకారం రామ్మోహన్ మొదట జర్నలిస్టు. తరువాత ప్రభుత్వ పబ్లిక్ రిలేషన్స్ ఉద్యోగంలోకి వెళ్లారు. మంచి రచయిత. రాసినవి చాలా తక్కువే అయినా- రాసినవన్నీ మంచి రచనలే. 1996 ప్రాంతంలో “శుభం” అని ఒక కథ రాశారు. ఆ కథ ప్రారంభంలో జర్నలిస్టుల జీవితానికి అద్దం పట్టే గొప్ప సత్యాన్ని ఆవిష్కరించారు.
“లోకం నిద్రపోయేవేళ- లోకాన్ని నిద్రలేపడానికి వారు మేల్కొని ఉంటారు. లోకం మేల్కొన్నవేళ వారు నిద్రపోతారు”
Ads
ఆయన రాసిన సందర్భం- నైట్ డ్యూటీ జర్నలిస్టుల కష్టాల మీద. కానీ- ఈమాట తాత్వికంగా ఇప్పుడు మొత్తం జర్నలిస్టులకు వర్తిస్తోంది.
జర్నలిస్టులు లోకానికి వార్తలు చెబుతారు. వాస్తవాలు చెబుతారు. పరిశోధిస్తారు. చదువుతారు. తిరుగుతారు. నేర్చుకుంటారు. నేర్చుకుంటూ రాస్తారు. రాస్తూ నేర్చుకుంటారు. భాషలో మునగాలి. భావంలో తేలాలి. డి టీ పి రావాలి. పేజీలు పెట్టడం తెలియాలి. అనువదించాలి. ప్రాసలే పులకించే హెడ్డింగులు పెట్టాలి. ఇంటర్నెట్ లో టెక్స్ట్, ఫోటోలు, వీడియోలు పంపడం తెలియాలి. ప్రపంచంలో జరిగే ప్రతి విషయం తెలుసుకోవాలి. నాలెడ్జ్ లో అప్ టు డేట్ గా ఉండాలి. చొరవ ఉండాలి. గలగలా మాట్లాడాలి. బిరబిరా పరుగులు పెట్టాలి. టీ వీ మీడియాలో స్క్రీన్ మీద కనపడేవారయితే పదహారేళ్ల దగ్గరే ఆగిపోయి అందంగా ఉండాలి. అందం లేకపోతే మేకప్ మందంతో అందగించాలి. పొమ్మన్న చోటుకు పోవాలి. రాయమన్న వార్త రాయాలి. రాయమన్నట్లే రాయాలి. వ్యక్తిగతమయిన ఇష్టానిష్టాలతో పనిలేకుండా యజమాని ఇష్టమే తన ఇష్టంగా పనిచేయాలి. ఇన్ని చేసినా ఒక దుర్ముహూర్తాన యజమాని కాపలావాడు సెక్యూరిటీలోనే పొమ్మంటే మౌనంగా తలవంచుకుని వెళ్లిపోవాలి. అనువుగాని చోట అధికులమని అనరాదు. తెలిసినా తెలియనట్లే ఉండాలి. మనసు చంపుకుని పనిచేయాలి. ఇంకా ఎన్నో ఎన్నెన్నో చేయాలి. సభా మర్యాద దృష్ట్యా ఇక్కడ అనవసరం.
——————
అలాంటి జర్నలిస్టులు ఇప్పుడు కరోనా సెకెండ్ వేవ్ లో పిట్టల్లా రాలిపోతున్నారు. ఏ జర్నలిస్ట్ వాట్సాప్ గ్రూపులో చూసినా- తోటి ఉద్యోగుల పాజిటివ్ వార్తలు. సహాయం కోసం అభ్యర్థనలు. ఆసుపత్రి ఐ సి యు వార్తలు. త్వరగా కోలుకోవాలని తోటివారి ప్రార్థనలు. మృతికి సంతాప వార్తలు. పోయినవారి గురించి నాలుగు మంచి మాటలు. వారి కుటుంబం భవిష్యత్తు మీద ఆందోళనలు.
ఇందులో చాలా వార్తలు వారు పనిచేసే మీడియాకు వార్తలు కాదు. లోకం కష్టాలను వార్తగా రాసినవారి కష్టాలకు కనీసం వార్తగా చోటు కూడా లేదు. ఉండాలని జర్నలిస్టు కోరుకోడు కూడా. ఉద్యోగం సంగతి దేవుడెరుగు. బతికితే చాలనుకుంటున్నాడు జర్నలిస్టు. కరోనా రాకుండా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో లోకానికి చెప్పి చెప్పి జర్నలిస్టు అలసిపోయాడు. వృత్తిలో భాగంగా కరోనాకు ఎదురు వెళ్లి కరోనాను ఒళ్లో పెట్టుకున్నాడు జర్నలిస్టు. ఇప్పుడు జర్నలిస్టు ఒళ్లో ఉన్న కరోనాను దించి, జర్నలిస్టును రక్షించే పాఠకుడెవరు? జర్నలిస్టు పొతే ఆ కుటుంబానికి అండగా నిలబడే ప్రేక్షకుడెవరు? ఇది ఏ జర్నలిస్టు రాయని విషాదాక్షర సంపాదకీయం. రాసినా అచ్చుకాని మాటలు మూగబోయే మౌన రోదనాభరిత ఎడిట్ అయి, పూర్తిగా డిలిట్ అయిపోయిన సంపాదకీయం…………. —— పమిడికాల్వ మధుసూదన్
Share this Article