Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవార్డు తీసుకో పుష్పా… ఆ జైలు, ఈ అభినందన… వేటికవే…

May 29, 2025 by M S R

.

గద్దర్ అవార్డుల మొదటి జాబితా విడుదలైంది… అప్పుడెప్పుడో నంది అవార్డులు ఉండేవి… రాష్ట్ర విభజన తరువాత ఇక ఎవరూ పట్టించుకోలేదు… తెలంగాణ ప్రభుత్వం కూడా ఏవో సింహ, ఏనుగు అవార్డులని ఆలోచిస్తున్నట్టు వార్తలొచ్చేవి కానీ కేసీయార్ వాటిని పక్కన పడేశాడు…

జగన్‌కు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓరకమైన విముఖత కాబట్టి తనూ పట్టించుకోలేదు… చంద్రబాబు కూడా మళ్లీ అధికారంలోకి వచ్చాక నందుల ఊసు ఎత్తడం లేదు, ఓ హీరో డిప్యూటీ సీఎంగా ఉన్నా సరే… రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డులు ప్రకటించాడు, అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ జాబితాను రేవంత్‌రెడ్డికి సమర్పించింది…

Ads

2014 నుంచి కేవలం ఉత్తమ చిత్రాల ఎంపిక, 2024 సంవత్సరం మాత్రం అన్ని విభాగాల నుంచి ఎంపిక… మంచి నిర్ణయమే… 2014 నుంచీ అన్ని విభాగాల్లో అవార్డుల పరిశీలన, ఎంపిక, ప్రకటన చాలా కష్టం… ఈ జాబితాలో ఫస్ట్ కనిపించిన పేరు అల్లు అర్జున్… ఉత్తమ మేల్ లీడ్ యాక్టర్… పుష్ప-2 సినిమాకు…

కాస్త నవ్వొచ్చింది… మొన్నమొన్ననే కదా సంధ్య థియేటర్‌ తొక్కిసలాట సంఘటనలో ప్రాణాలు బలిగొన్న హీరోను జైలుకు పంపించడం… ఇండస్ట్రీ అంతా తన ఇంటికి క్యూలు కట్టి మరీ పరామర్శించడం… ఇప్పుడు అదే హీరోకు ఉత్తమ నటుడిగా అదే రేవంత్‌రెడ్డి వేదిక మీద అవార్డు ఇచ్చి అభినందిస్తాడు… వావ్… లైఫులో ఉన్నంత మెలోడ్రామా నిజానికి సినిమా కథల్లోనూ ఉండదు కదా…

అఫ్‌కోర్స్, ఓ సంఘటనలో నిందితుడిగా వేరు… ఓ సినిమాలో నటుడిగా వేరు… ఒకటి వృత్తి, మరొకటి తలబిరుసు… దేనికదే అనుభవించాలి… అంతెందుకు, ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చేసిన రేవంత్ రెడ్డి అదే నాగార్జునతో కలిసి మొన్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు విందు ఇచ్చిన సందర్భంగా ఒకే టేబుల్ షేర్ చేసుకున్నాడు… దేనికదే…

మన వ్యవస్థలో ఎవరెంత కృత్రిమ హంగులతో దేవుళ్ల అవతారాలుగా మేఘాల్లో విహరిస్తున్నా సరే, నేల మీదకు తీసుకొచ్చేది రాజకీయ అధికారం మాత్రమే… సరే, ఆ అవార్డుల్లో కొన్ని చెప్పుకుందాం…

ఉత్తమ చిత్రం… కల్కి… (పర్లేదు, మంచి ఎంపికే)… రెండో ఉత్తమ చిత్రం… పొట్టేల్… ఇదీ పర్లేదు… మూడో ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్…

జాతీయ సమగ్రత, మతసామరస్యం, అణగారిన కులాల అభ్యున్నతి చిత్రంగా కమిటీ కుర్రోళ్లు మూవీ… ఉత్తమ చిన్న పిల్లల చిత్రం… 35 చిన్న కథ కాదు… (అసలు వేరే చిన్న పిల్లల చిత్రాలే రాలేదు కదా… పోటీయే లేదు…)

ఉత్తమ చరిత్ర మూవీ… రజాకార్  (ఈ బీజేపీ సినిమాకు కాంగ్రెస్ ప్రభుత్వం అవార్డు, గుడ్… దేనిది దానికే….) ఉత్తమ డెబ్యూ దర్శకుడు… యెదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)…. ఉత్తమ సంపూర్ణ వినోదాత్మక చిత్రం (ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం) ఆయ్ మేం ఫ్రెండ్స్ అండీ… (ఇదొక సినిమా వచ్చిపోయిందా..? గుర్తు చేసినందుకు జయసుధకు థాంక్స్)…

ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్ (కల్కి… ఊహించిందే…)… ఉత్తమ నటి నివేదా థామస్ (35, చిన్న కథ కాదు… నిజంగానే బాగా చేసింది)… ఉత్తమ సహాయనటుడు ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం, సరైన ఎంపిక, హీరోను ఫుల్ డామినేట్ చేశాడు…) ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్ (అంబాజీపేట బ్యాండ్…) ఉత్తమ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో…

కాస్త అసంతృప్తిని కలిగించిన ఎంపిక ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ సిధ్ శ్రీరాం… చిత్రం పేరు ఊరుపేరు భైరవకోన అట, పాట నిజమే నేచెబుతున్నా… తన తెలుగు ఉచ్ఛారణే సరిగ్గా ఉండదు… ఆ పాట, ఆ సినిమా పేర్లు కూడా వినలేదు…

ఉత్తమ ఫిమేల్ సింగర్ శ్రేయో ఘోషాల్… (సూసేటి అగ్గరవ్వ… పుష్ప-2… ఆమెకు తిరుగేముంది..?)… బెస్ట్ కమెడియన్ సంయుక్త అవార్డు సత్య, వెన్నెల కిషోర్ – మత్తు వదలరా-2… (ఉన్నంతలో వాళ్లే కదా)… ఉత్తమ బాలనటులు సంయుక్తంగా…. అరుణ్ దేవ్ పోతుల, బేబీ హారిక (35, చిన్న కథ కాదు… సరైన ఎంపిక)… (వచ్చే ఏడాది బుల్లిరాజుకు ఇస్తారేమో కొంపదీసి)….

ఉత్తమ కథారచన శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి… అంత విశేషముంది అందులో..?) ఉత్తమ స్క్రిప్ట్ రచన వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్, పర్లేదు)… ఉత్తమ గీతరచన చంద్రబోస్… (రాజు యాదవ్, జయసుధకే తెలియాలి ఆ సాహిత్య ప్రతిభ ఏమిటో ఆ పాటలో…)

బెస్ట్ సినిమాటోగ్రాఫర్ విశ్వనాథరెడ్డి (గామి సినిమా) బెస్ట్ ఎడిటర్ నవీన్ నూలి (లక్కీ భాస్కర్)… బెస్ట్ ఆడియోగ్రాఫర్ అరవింద్ మేనన్ (గామి)…. దేవరలో ఆయుధపూజ కొరియోగ్రఫీ చేసిన గణేశ్ ఆచార్య బెస్ట్ కొరియోగ్రాఫర్ (వెగటు స్టెప్పుల శేఖర్ మాస్టర్‌ను ఏ పాటకూ ఎంపిక చేయకపోవడం పట్ల జయసుధకు థాంక్స్…)

కల్కి ఆర్ట్ డైరెక్టర్ జిహానీ చౌదరికి అవార్డు… చంద్రశేఖర్ రాథోడ్‌కు ఉత్తమ స్టంట్ మాస్టర్ అవార్డు (యాక్షన్ కొరియోగ్రఫీ అట… గ్యాంగ్‌స్టర్ సినిమాకు…) ఉత్తమ మేకప్ ఆర్టిస్టు నల్ల శీను (రజాకార్)… ఉత్తమ కాస్ట్యూమ్స్ అర్చనరావు, అజయకుమార్ (కల్కి)….

నాలుగు స్పెషల్ జ్యూరీ అవార్డులు, ఒక జ్యూరీ ప్రత్యేక అవార్డు… 1) దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్) 2) అనన్య నాగళ్ల (పొట్టేల్… నిజానికి నివేదా థామస్‌‌తో కలిపి ఈమెకూ సంయుక్తంగా అవార్డు ఇవ్వాల్సింది ఉత్తమ ఫిమేల్ లీడ్ యాక్ట్రెస్ కేటగిరీలో…) 3) సుజిత్, సాయిసందీప్ (క) 4) ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి (రాజు యాదవ్), మత్తువదలరా-2లో ర్యాప్ సాంగ్‌కు గాను ఫరియా… (అంత బాగుందా..? చెప్పలేం…) మన సినిమా ఫస్ట్ రీల్ పుస్తక రచనకు గాను ఉత్తమ పుస్తక రచయిత అవార్డు రెంటాల జయదేవ…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమిటీ ఈ భూతశుద్ధి..! సమంత- రాజ్ పెళ్లి క్రతువు అసలు విశేషాలు..!!
  • శివోన్..! ఎలన్ మస్క్ భార్యకు హిందూ మూలాలు నిజమే… కానీ..?!
  • హెడ్ (వెయిట్) కోచ్, సెలక్టర్… ఇండియన్ జట్టుకు వీళ్లే అసలు సమస్య..!!
  • సంజన గల్రానీ..! నాగార్జుననూ, బిగ్‌బాస్‌నూ కలిపి ఈడ్చికొట్టింది..!!
  • …. అందుకే రేవంత్ రెడ్డి ఓ డిఫరెంట్ లీడర్… ఎందుకు, ఎలా అంటే…
  • పాద‘రస గాత్రులు’… స్వరభాస్వరులు మాత్రమే రక్తి కట్టించగల ఐటమ్ సాంగ్స్…
  • నాగదుర్గ… పేరుగల్ల పెద్దిరెడ్డి… మరో కొత్త వీడియో వైరల్… బాగుంది…
  • సర్పంచ్..! సొంత ఖర్చులు, అప్పులు… ఐనా ఆ పదవి విలువే వేరు…
  • చిరంజీవి నటచరిత్రలో కలికితురాయి… జనం మాత్రం మెచ్చలేదు…
  • Born Hungry…! తన ‘చెత్తకుండీ’ మూలాలకై ఓ స్టార్ చెఫ్ అన్వేషణ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions