బేసిక్‌గా నాయకులందరూ ఒకే టైపు అనుకుంటాం… పార్టీలు వేరు కావచ్చునేమో గానీ… దాదాపు అందరి తత్వాలూ ఒకేరకం, కాస్త అటూఇటూగా అనేదే చాలామందిలో ఉన్న భావన, నమ్మకం… కానీ కొందరు ఉంటారు… అందరు అనబడే ఆ జాబితా నుంచి విడదీసి చూడాలి… విడిగానే చూడాలి… ఎందుకంటే… వాళ్లు కాస్త మెచ్చుకోదగిన కేరక్టర్లు కాబట్టి… వారిలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పేరు కూడా కచ్చితంగా ఉండాలి, ఉంటుంది… తను అసలు పెద్దగా ప్రచార తెర మీద కనిపించడు… టీవీల్లో, పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు, వాటిల్లో ఆయన ఫోటో వేసి, మా ప్రభుత్వం అది పీకింది, ఇది పీకింది అనే స్వోత్కర్షలు కూడా కనిపించవు… కోట్లకుకోట్ల డబ్బును అలా తగలేయడు… ఇప్పుడు తెరమీదకు వచ్చాడు, రావాలి, ఒక ప్రశంస కచ్చితంగా తనకు దక్కాలి… అర్హుడు… అదేమిటంటే… ఈ ఆక్సిజన్ విపత్తులో వందల టన్నుల ఆక్సిజన్‌ను నిశ్శబ్దంగా అన్ని రాష్ట్రాలకు పంపిస్తున్నాడు… కొన్ని వందలు, వేల కరోనా రోగుల పాలిట దేవుడవుతున్నాడు…
మూడునాలుగు రోజుల క్రితమే ప్రధాని, ఆయన నడుమ ఫోన్ సంభాషణ జరిగింది… ఎక్కడెక్కడికి ఎంత ఆక్సిజన్ కావాలో మీరు చెప్పండి, మేం పంపిస్తాం అన్నాడు సీఎం… కొందరు ముఖ్యమత్రులకు కూడా తనే కాల్స్ చేసి చెప్పాడు… అంతే… కేంద్ర స్టీల్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆఫీసుకూ, ఒడిశా కీలకాధికారులను లింక్ చేశారు, ఇక యుద్ధవిమానాల ద్వారా ఆక్సిజన్ రవాణా స్టార్టయింది… ఎక్కడా హడావుడి లేదు, ఆడంబరాలు, అట్టహాసాలు, ఆర్భాటపు ప్రచారాలు లేవు… రూర్కెలా, జైపూర్, దెంకనాల్, అంగుల్ తదితర ప్రాంతాల్లో స్టీల్, ఇతర ఫ్యాక్టరీలు ఎక్కువ… రాష్ట్రంలో ఖనిజసంపద కూడా ఎక్కువే… ఆయా కర్మాగారాల్లోని ఆక్సిజన్‌ను ట్యాంకర్లలో నింపడం… విమానాల దగ్గరకు చేరవేయడం… ఓ కారిడార్‌గా ప్రకటించారు… మార్గమంతా పోలీసు బందోబస్తు… ప్రతి ట్యాంకర్‌నూ జీపీఎస్ ద్వారా ట్రాకింగు… ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా తదితర రాష్ట్రాలకు… ఈ వార్త రాసే సమయానికి (మంగళవారం తెల్లవారుజాము ఒంటి గంట)… ఈ మూడు రోజుల్లోనే 1300 టన్నుల ఆక్సిజన్ పంపించింది ఒడిశా… ఈ మొత్తం రవాణా, ప్లానింగు, కోఆర్డినేషన్ పనుల కోసం అడిషనల్ డీజీ కేడర్ పోలీస్ అధికారి వైకే జెత్వాను నోడల్ అధికారిగా నియమించాడు నవీన్ పట్నాయక్… సాఫీగా సాగిపోతూనే ఉంది ఆపరేషన్… ఇలాంటి పనితీరే ఇప్పుడు కావల్సింది… (కేరళ కూడా ఆక్సిజన్ మిగులు రాష్ట్రం… తన అవసరాలకు మించి ఆక్సిజన్ ఉంది… ఈమధ్య గోవాకు 20 వేల లీటర్లు పంపించింది కూడా… తను ఇంకాస్త లిబరల్గా వ్యవహరించడానికి స్కోప్ ఉంది…)
Ads
నవీన్ పట్నాయక్ గురించి రాయాలంటే అది ఓ పెద్ద పుస్తకం అవుతుంది… తన పార్టీ, తనకు దక్కిన వారసత్వం, తన వారసత్వం, హుందా రాజకీయం, నిరాడంబర పనితీరు గట్రా చాలా అంశాలు… ప్రస్తుతం కరోనా సంబంధమైన పనితీరులో కూడా ఎక్కడా ఏతుల్లేవు, కోతల్లేవు, దాక్కోవడాల్లేవు… సైలెంటుగా పనిచేసుకుంటూ పోవడమే… సందర్భం వచ్చింది, సాయపడే స్థితిలో ఉన్నాడు కాబట్టి ప్రతి రాష్ట్రానికీ సాయం చేస్తున్నాడు… అలాగని టీవీల్లో, మీడియాలో టాంటాంలు, భీకరమైన ప్రచారాలు కూడా లేవు… యథా చీఫు, తథా స్టాఫు… అందుకే తన టీంలోని అధికార్లు కూడా అంతే… ఎవరికి అప్పగించిన పని వాళ్లు చేసుకుంటూ వెళ్లడమే… మీ గురించి మళ్లీ వివరంగా రాస్తుంటాం గానీ ఇప్పుడైతే ఈ ‘‘ప్రాణవాయు’’ ప్రదాతగా అభినందనలు స్వీకరించండి ముఖ్యమంత్రి గారూ… ఈ ఆక్సిజన్ సప్లయ్స్, ట్రాన్స్‌పోర్టు అంశాల్లో రాష్ట్రాలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకుంటూ, తన్నుకుంటుంటే… అందుబాటులో ఉన్న ఆక్సిజన్ ఇవ్వడానికి సతాయిస్తుంటే… వీసమెత్తు అభ్యంతరం లేకుండా… నిజాయితీగా వ్యవహరిస్తున్నందుకు…!!
Share this Article