Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!

June 8, 2025 by M S R

.

కాళేశ్వరం మీద కాక పెరిగింది… లక్ష కోట్ల ప్రాజెక్టు… దండిగా కమీషన్లు, వాటికోసమే అంచనాల పెంపు అనే విమర్శలు- ఆరోపణలు… కుంగిన ప్రధాన బ్యారేజీ… అక్రమాలపై ఎంక్వయిరీ కమిషన్… కేసీయార్, హరీష్‌లకు పిలుపు……

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ గాయిగత్తర లేపాలని ప్రయత్నం… డ్యామ్ సేఫ్టీ అథారిటీపై ఎన్డీయే ముద్ర వేస్తోంది… కాళేశ్వరం కమిషన్ మీద కాంగ్రెస్ కమిషన్ ముద్ర వేస్తోంది… ఇవిగో నిజాలు అని జనానికి చెప్పేసి, ఇక మీ రిపోర్టులో ఏం రాసుకుంటారో రాసుకొండి అని చెప్పేస్తోంది…

Ads

అప్పటి ఆర్థిక మంత్రి ఈటల తనపైకి ఏ తప్పూ రాకుండా, జాగ్రత్తగా, ఆచితూచి, ప్రస్తుత బీజేపీ వైఖరికి భిన్నంగా తన వివరణ ఇచ్చేసి… మధ్యలోకి తుమ్మలను లాగాడు… కేబినెట్ అప్రూవల్‌తోనే ప్రాజెక్టు అన్నాడు… కేబినెట్ సబ్‌కమిటీ అనుమతితోనే అంచనాల పెంపు అన్నాడు… అంతా హరీష్, కేసీయార్‌లే చూసుకున్నారని చేతులు దులుపుకున్నాడు…

మధ్యలో నన్నెందుకు లాగుతారు… అసలు అది కేబినెట్ ముందుకు వస్తే కదా… సబ్ కమిటీ కూడా కాళేశ్వరం కోసం కాదు అని తుమ్మల స్పష్టీకరణలు, వివరణలు… హరీష్ చెప్పేవన్నీ అబద్ధాలు అంటాడు ఉత్తమ్‌కుమార్… నో, నో, నువ్వే దుష్ప్రచారం చేస్తున్నావు అంటాడు హరీష్…

ఈటెల వాదన ఆయన వ్యక్తిగతం అంటాడు కిషన్ రెడ్డి… అదెలా…? ఇలా బోలెడు వాగ్వాదాలు, రాద్ధాంతాలు…

విచారణ పట్ల బీఆర్ఎస్ పెద్దలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు..? న్యాయపోరాటానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి… ఇదేమీ క్రిమినల్ కేసు కాదు కదా… వెంటనే రేవంత్ రెడ్డి పోలీసులు యాక్షన్‌లోకి దిగడానికి..? సరే, ఇవన్నీ వోకే గానీ…

ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీయేనో కాదో తెలియని కవిత మధ్యలో జొరబడింది… నాన్సెన్స్, మా డాడీకి నోటీసులు ఇస్తే మొత్తం తెలంగాణకే ఇచ్చినట్టు అనే ఓ వితండ, వింత వాదన తీసుకోవడమే కాదు… ఓ గమ్మత్తయిన లెక్క చెప్పింది…

కాళేశ్వరం అంటే జస్ట్ బరాజులు కావు… 21 పంపు హౌజులు, 15 రిజర్వాయర్లు, 200 కి.మీ టన్నెల్, 1500 కిలోమీటర్ల కాలువలు, ఎత్తిపోసిన మట్టితో 300 పిరమిడ్లు కట్టొచ్చు, ఆ స్టీల్‌తో 100 ఈఫిల్ టవర్లు కట్టొచ్చు, ఆ కాంక్రీట్‌తో 50 బుర్జ్ ఖలీఫాలు… అని ఏదేదో లెక్క… నిన్నటి హరీష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కూడా ఈ వివరాల్లో కొన్ని పొందుపరిచాడు…

(ఎన్ని లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, ఎంత స్థిరీకరణ, ఎంత నీటి నిల్వ ఎట్సెట్రా వివరాలు…) నాలుగు రోజులకే కుంగిన బరాజ్‌ను చూసి… నాటి ఘనపొగడ్తల, భుజకీర్తుల ప్రత్యేక భజనకథనాలన్నీ నవ్విపోవడం లేదా..? తనే వరల్డ్ ఫేమస్ ఇంజనీర్‌లాగా డిజైన్లూ, ప్లాన్లూ, పర్యవేక్షణ ఎట్సెట్రా…

నదికి నడకలు నేర్పినవాడు, భగీరథుడికంటే ఘనుడు… అన్నీ సరే, మరి త్రీగార్జెస్ కట్టినోడు ఏం చెప్పుకోవాలి..? ఫాఫం… వాళ్లూ కాంక్రీట్ వాడారు, మట్టి తవ్విపోశారు, కాలువలు కట్టారు, పంపు హౌజులు పెట్టారు, కానీ ఎన్ని పిరమిడ్లో ఎన్ని ఈఫిల్ టవర్లో ఎన్ని బుర్జ్ ఖలీఫాలో చెప్పుకోలేదు… ఏ ప్రాజెక్టుకైనా తవ్వకాలు, నింపడాలు తప్పవు కదా…

ఐనా తవ్వి ఎత్తిపోసిన మట్టి పరిమాణం, కలిపిన కాంక్రీట్ లెక్కలు, వాడిన స్టీల్ బరువా ఓ ప్రాజెక్టు ఘనతను నిర్దారించేది..? ఓ మిత్రుడు ఓ లెక్క చెప్పాడు…

‘‘మనిషి దేహంలో 1.61 లక్షల కిలోమీటర్ల రక్తనాళాలు ఉంటయ్, నాడులు 72 కిలోమీటర్లు… 206 ఎముకలు… మనిషి గుండె రోజూ 2,000 గాలన్ల రక్తాన్ని పంప్ చేస్తుంది… ఇది 8/ 10 అడుగుల ఈత కొలను నింపడానికి సరిపోతుంది… గుండె ప్రతి రోజూ లక్ష సార్లు కొట్టుకుంటుంది… చిన్న పేగు 6.5 మీటర్లు… కిడ్నీలు రోజుకు 1800 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తాయి…’’

కాళేశ్వరం లెక్కల్లాగే అన్నీ నిజాలే… అన్నీ ఘనాంకాలే… కానీ గుండెకు చిల్లు పడ్డట్టు, గుండెకాయ వంటి మేడిపండు మేడిగడ్డ కుంగింది నిజం కాదా..? అదే పనిచేయనప్పుడు మిగతా దేశం ఎంత బలిష్టం అయితేనేం..? కండలు ఎలా ఉంటేనేం..? దేహం ఎంత పొడవుంటేనేం..? సుందిళ్ల, అన్నారం పటిష్టత మీద అందుకే సందేహాలు… ప్రపంచ ప్రఖ్యాత ఇంజినీర్ ఫౌండేషన్ వేస్తే నాలుగు రోజులకే పగుళ్లు ఏమిటి..? అంతకుముందు పంపుహౌజుల ముంపు నిజం కాదా..?

ఎహె, నాలుగు తట్టల కాంక్రీట్ చాలు, వాటి రిపేర్లకు అంటారు… అదే నిజమైతే సదరు ఎల్‌అండ్‌టీ సంస్థ ఎందుకు మొరాయిస్తున్నది..? అడ్డం తిరుగుతోంది దేనికెి..? మార్చాల్సింది ఆ నాలుగు పిల్లర్లేనా..? ఇంకా ఎక్కువ పని ఉందా..? ఏది నిజం..? అది కదా తేలాల్సింది…

నిజంగానే ఉత్తమ్ చెబుతున్నట్టు 30 వేల కోట్లతో ప్రాణహిత- చేవెళ్ల కట్టేస్తే అయిపోయేదానికి కమీషన్ల కోసం కాళేశ్వరం చేపట్టి లక్ష కోట్లు గోదాట్లో పోసినట్టేనా..? అదే ఖర్చుతో మిగతా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయిపోయి… కృష్ణా- గోదావరి బేసిన్లలో అప్పర్ హ్యాండ్ సాధించేవాళ్లం కాదా..? ఇదే కదా తెలంగాణ సమాజం అడిగేది… ఈమాత్రం దానికి పోలవరం కాఫర్ డ్యామ్ లీక్ కాలేదా..? డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోలేదా..? ఎవరెందుకు మాట్లాడరు అని ఎదురుదాడి..?

సుంకిశాల వాల్ కూలలేదా..? ఎస్ఎల్‌బీసీ పైకప్పు కూలలేదా..? అంటారు… అవీ కాళేశ్వరం తప్పులు ఒకేరకమైనవా..? సో, అవి జరిగాయి కాబట్టి కాళేశ్వరం ఖూన్‌ను మాఫ్ ఖాతాలో రాసేయాలా..? కాళేశ్వరం తప్పులు కాంగ్రెస్ హయాంలో జరిగినా నిందార్హాలే… శిక్షార్హాలే… తప్పు ఎవరిదైనా తప్పే కాదా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
  • డిస్టర్బింగ్ సీసీటీవీ ఫుటేజీ… కొన్ని జవాబులు దొరకని ప్రశ్నలు కూడా…
  • ‘‘నీ ఏడుపేదో నువ్వేడువు… నాకన్నా ఎక్కువ ఏడువు… నేనేమైనా వద్దన్నానా..?’’
  • అమ్మతనం అంటే అన్నీ సహించడం కాదు… కొన్ని వదిలించుకోవడం కూడా..!!
  • ఆ ఉగ్రవాది కసబ్‌ను కోర్టులో గుర్తించిన ఓ చిన్న పాప మీకు గుర్తుందా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions