.
అప్పటికి కృష్ణంరాజు, విజయశాంతి, సుమన్… అందరికీ క్రేజ్ ఉంది… పైగా కృష్ణంరాజు హిట్ సినిమాలైన కటకటాల రుద్రయ్య బాపతు కుంతీపుత్రుడి కథను కాస్త, భక్త కన్నప్ప ట్రీట్‌మెంట్ కాస్త రంగరించి, ఏదో కమర్షియల్ సినిమా చుట్టేశారు… కానీ పెద్దగా జనానికి ఎక్కలేదు…
అసలు కృష్ణంరాజు, విజయశాంతి జంటే నప్పలేదు… కథ కూడా ఎటెటో పోతుంది… వెరసి జనం వద్దనేశారు… ఆ సినిమా పేరు రారాజు… (తరువాత గోపీచంద్ హీరోగా కూడా ఇదే టైటిల్‌తో ఓ సినిమా వచ్చింది…)
Ads
ప్రసిద్ధ సినిమా విశ్లేషకులు Subramanyam Dogiparthi ఏమంటారంటే…
టైటిల్ రారాజు ; కధ కుంతీపుత్రుడిది . విజయమాధవి పిక్చర్స్ బేనరుపై వడ్డె వారు నిర్మాతలుగా జి వి రామమోహనరావు దర్శకత్వంలో 1984 లో వచ్చిన ఈ సినిమాలో కృష్ణంరాజు , విజయశాంతిలు హీరోహీరోయిన్లు .
కుంతి శారద పెళ్ళికి ముందే కాబోయే భర్తతో బిడ్డను కంటుంది . ఆ సమయంలో కట్టుకోపోయే వాడు చదువుల కోసం దూరంలో ఉంటాడు . లేనిపోని అనుమానాలు వస్తాయనే భయంతో కుంతి తండ్రి పుట్టిన బిడ్డను రోడ్డు పక్కన వదిలేస్తాడు .
ఆ బిడ్డ అక్కడక్కడ తిరిగి అడవిలో ఉండే గూడెం ప్రజల వద్దకు చేరి ఛత్రపతిలో ప్రభాస్ ఛత్రపతి అయినట్లు గూడెం జనానికి రారాజు అవుతాడు . ఆ పేరు కూడా గూడెం జనమే పెడతారు . ఆ అడవిలో ఉండే పలు గూడెంలకు రక్షకుడు అవుతాడు .
అటవీ సంపదను పుష్ప లాంటి విలన్లయిన సత్యనారాయణ , గిరిబాబుల నుండి రక్షిస్తూ ఉంటాడు . రారాజుని కేసుల్లో ఇరికించి విలన్లు ఇబ్బంది పెడుతుంటారు . విలన్ల నుండి తనను తాను రక్షించుకుంటూ , తన తల్లిదండ్రులను రక్షించుకుంటూ , దుష్టశిక్షణ చేయడంతో సినిమా ముగుస్తుంది .
తల్లిదండ్రులుగా శారద , జగ్గయ్య , ప్రియురాలిగా విజయశాంతి , తమ్ముడుగా శివకృష్ణ , చెల్లెలుగా ముచ్చెర్ల అరుణ నటించారు . ఇతర ప్రధాన పాత్రల్లో సుమన్ , ప్రభాకరరెడ్డి , జయంతి , నూతన్ ప్రసాద్ , పి జె శర్మ , ప్రభృతులు నటించారు . కుక్కల్ని , పొటేళ్ళను , మేకల్ని పెంపుడు జంతువులుగా పెంచుకుంటూ ఉంటారు . అడవిలో పెరిగిన రారాజుకి పులి పెంపుడు జంతువు . అదీ బాగానే నటిస్తుంది .
వడ్డె రమేష్ కధను నేయగా పరుచూరి బ్రదర్స్ డైలాగులను వ్రాసారు . జె వి రాఘవులు సంగీత దర్శకత్వంలో పాటలు థియేటర్లో బాగానే ఉంటాయి . రెండు గ్రూప్ డాన్సులు ఆకర్షణీయంగా ఉంటాయి సినిమాలో . ఏవరేజుగా ఆడిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . రాజు గారి అభిమానులు ఇంతకుముందు చూసి ఉండకపోతే చూడవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
Share this Article