Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Iam Not a Chor… కలకలం రేపుతున్న విజయ్ మాల్యా పాడ్ కాస్ట్..!!

June 13, 2025 by M S R

.

[[  రమణ కొంటికర్ల  ]]     …….. అది 2016, మార్చ్ 2… యూనైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ చైర్మన్.. అప్పటివరకూ రాజ్యసభ సభ్యుడు.. ఎరువులు, రియల్ ఎస్టేట్, విమానయానం వంటి వ్యాపారాలతో పాటు.. ఈసారి 2025 ఐపీఎల్ కప్ గెల్చిన బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ యజమాని.. కింగ్ ఫిషర్ బీర్ల తయారీతో దేశంలో కింగ్ మేకర్ లా తయారైన విజయ్ మాల్యా ఇండియాను వదిలివెళ్లిన రోజు.

అప్పట్నుంచీ వేల కోట్ల రూపాయలు భారతీయ బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన వ్యక్తిగా విజయ్ మాల్యా చాలాకాలం ప్రధాన మీడియా స్రవంతిలో పతాకశీర్షికలై, వార్తాకథనాలై ప్రజల మెదళ్లలో నొటోరియస్ క్రిమినల్ గా ముద్రపడిపోయాడు. ఓ నీరవ్ మోడీ ప్రస్తావనొచ్చినా, ఇంకో లలిత్ మోడీ చర్చ జరిగినా.. ఆర్థిక నేరాలకు పాల్పడ్డ ఎవ్వరి ముచ్చట వచ్చినా కూడా వారితోపాటే విజయమాల్యా కూడా ఆ కబుర్లలోకొచ్చేంతగా దిగజారిపోయింది ఆయన ట్రాక్ రికార్డ్.

Ads

ఆయన ఇండియా వదిలి లండన్ పారిపోయి అక్కడే సెటిలైపోయాడు. ఆయనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసినా భారత ప్రభుత్వం ఆయన్నుఇప్పటివరకూ ఇండియాకు తీసుకురాలేకపోవడమూ ఇక్కడి ప్రభుత్వాలపై విమర్శలకు తావిచ్చింది. 2016 అంటే సుమారు 9 ఏళ్లు దాటింది మాల్యా భారత్ వదిలి లండన్ వెళ్లిపోయి. ఆయన పాస్ పోర్ట్ ను కూడా భారత ప్రభుత్వం రద్దు చేసింది.

అయితే, ఇదంతా ఎందుకంటే సుమారు 9 ఏళ్ల తర్వాత విజయ్ మాల్యా మళ్లీ తన మౌనం వీడి మీడియా ముందుకొచ్చాడు. అదీ సుదీర్ఘమైన నాల్గు గంటల ఇంటర్వ్యూతో. ఇప్పుడా ఇంటర్వ్యూ కూడా భిన్నరకాల చర్చలకు అవకాశమిస్తోంది.

రాజ్ షమానీ అనే ఓ యూట్యూబర్ చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు కోట్లల్లో వ్యూస్ సంపాదించుకుని వైరల్ గా మారింది. సహజంగానే ఎంతోకాలం చర్చ జరిగి.. అడపదడపా ఆర్థిక నేరాల చర్చలు వచ్చినప్పుడల్లా గుర్తుకొచ్చే పేర్లలో ఒకడైన విజయ్ మాల్యా ఇంటర్వ్యూ అంటే క్యూరియాసిటీ ఉండటం సర్వసాధారణం.

దాన్ని రాజు షమానీ ఎన్ క్యాష్ చేసుకునేందుకు ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడా.. లేక, షమానీ వంటి ఓ య్యూట్యూబ్ జర్నలిస్టుతో విజయ్ మాల్యానే ఇంటర్వ్యూ ప్లాన్ చేయించాడా అనేది మరో చర్చ.

విజయ్ మాల్యా ఆర్థిక నేరాలకు సంబంధించి మీడియా కోడై కూసింది. సహజంగానే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అదిగో పులి అంటే ఇదిగో తోక అంటూ గొర్రెధాటిలో కొట్టుకుపోతూ.. అందులోనే సంచలనాలను వెతుక్కుంటున్న రోజుల్లో సెకండ్ యాంగిల్ కు చోటు లేకుండా పోతోంది. ఆ క్రమంలో మాల్యాకు సంబంధించిన వ్యవహారంలోనూ ఆయన్ను దోషిగా చిత్రీకరించే పనే తప్ప.. ఆయన వైపు నుంచి ఒక ఇంటర్వ్యూగానీ.. ఆయన వివరణలుగానీ పెద్దగా కనిపించలేదు.

అయితే ఇక్కడ, విజయ్ మాల్యానేదో సమర్థించేందుకు చెబుతున్న మాటేం కాదిది. కానీ, ఆయనవైపు వెర్షన్ కూడా వింటే ఒక సారవంతమైన అభిప్రాయానికి వచ్చేందుకు ఎక్కువ అవకాశాలుండేవి. కానీ, దురదృష్టవశాత్తూ చాలా వార్తా కథనాల్లోలాగే.. తీర్పరి పాత్ర పోషించిన మెయిన్ స్ట్రీమ్ మీడియా దెబ్బకు విజయ్ మాల్యా కూడా ఇప్పుడు ఇండియాలో ఓ ఆర్థిక నేరాల విలన్.

ఇంతకాలం మౌనంగా ఉన్న విజయ్ మాల్యా ఇప్పుడు రాజ్ షమానీ అనే యూట్యూబర్ కు ఇన్నాళ్ల తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వడం.. అది సోషల్ మీడియాలో భిన్న చర్చలకు తావివ్వడంతో ఆ గేమ్ ప్లాన్ ఏంటన్నదే ఇప్పుడు మరో ప్రశ్న..?

ఇంతకాలం విజయ్ మాల్యా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించినదాని ప్రకారం ఆయనో విలన్. కానీ, ఆయన్ను ఓ హీరోగా చిత్రించేలా రాజ్ షమానీ ఇంటర్వ్యూ సాగడం ఇక్కడ గమనార్హం. సూటిగా గుచ్చిగుచ్చి ప్రశ్నలడుగుతున్నట్టుగా కనిపించినా.. అదంతా ప్రీ ప్లాన్డ్ అన్నట్టుగా ఆ ఇంటర్వ్యూను బాగా గమనిస్తే అర్థం చేసుకోవచ్చు.

దాంతో రాజ్ షమానీ చేసింది ఇంటర్వ్యూనా… లేక తనకు తాను సచ్ఛీలుణ్నని మాల్యా చెప్పుకునే ఓ క్యాంపెయినింగా అనే ఒక కాంట్రాస్ట్ డిస్కషన్ కు తెరలేచింది.

రాజ్ షమానీ అడిగిన ప్రశ్నలను ఓసారి పరిశీలిస్తే కూడా… మీపై ఆర్థిక నేరాలు మోపాక మీ పరిస్థితేంటి.. మీరు బాధపడ్డారా… మీ కుటుంబం ఆ సవాళ్లను ఎలా ఎదుర్కొంది… మీకు ఇప్పుడెందుకు నిజం చెప్పాలనిపించింది వంటివెన్నో ఇంటర్వ్యూ పూర్తి పాఠం నాల్గు గంటలు కాకపోయినా.. జస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ విన్నా.. పసలేని ప్రశ్నలనేది అర్థమైపోతుంది.

అయితే షమానీ అడగాల్సిన ప్రశ్నల్లో.. మీరు భారతీయ బ్యాంకులకు ఎంత రుణం చెల్లించాల్సి ఉంది.. వాటిలో ఇప్పటివరకూ ఎంత చెల్లించారు.. అసలేమైనా చెల్లించారా.. పాస్ పోర్ట్ రద్దు తర్వాత అంటే సరేసరి.. కానీ,. మీరు 2016 నుంచి భారత్ కు ఎందుకు రాలేదు… ఇలాంటి భారతీయ జనంలో ఏ అంశాల పట్లైతే విజయ్ మాల్యా పట్ల అనుమానాలున్నాయో వాటి ప్రస్తావనే లేకుండా ప్రశ్నావళి కనిపిస్తుంది.

దీంతో విజయ్ మాల్యాను రాజ్ షమానీ చేసిన ఇంటర్వ్యూ ఓ స్క్రిప్టెడ్ న్యారెటివ్ అనే చర్చ బలపడుతోంది.

ముఖ్యంగా రాజ్ షమానీ సుదీర్ఘ ఇంటర్వ్యూలో మాల్యా తనను తాను భారతదేశం అన్యాయం చేసిన ముద్దుబిడ్డగా అభివర్ణించుకోవడం మరో విషాదం. పైగా తానేమీ తప్పు చేయలేదని, బ్యాంకులకు తిరిగి చెల్లించానని, భారతీయులే తనను అర్థం చేసుకోవడంలేదన్నట్టుగా మాల్యా ఇంటర్వ్యూ సారాంశం కనిపిస్తుంది.

ఓ యూట్యూబర్ ద్వారా ఇంతకాలానికి తన ఆవేదనను చెప్పుకునే యత్నం చేసిన మాల్యా వాదనలో పస ఉందా అనేదీ మరో ప్రశ్న..? మాల్యా అంత సచ్చీలుడైతే భారత న్యాయవ్యవస్థను ఎందుకు ఎదుర్కోలేదన్నదీ మరో సవాల్..? ప్రజల్లో ఏ అంశం పట్ల అయినా షార్ట్ టర్మ్ మెమరీనే కనిపించే రోజుల్లో.. వారి మైండ్ సెట్ మార్చే ఒక ఇంటర్వ్యూగా కూడా Pod cast ను చూడాలేమో బహుశా!

డిజిటల్ మీడియా తెచ్చిన విప్లవం.. సోషల్ మీడియా కల్పిస్తున్న అవకాశాలతో కొత్త కొత్తగా పుట్టుకొస్తున్న యూట్యూబర్స్, పాడ్ క్యాస్ట్ జర్నలిస్టులతో విలన్లుగా ముద్రపడ్డ వారు కొంతకాలం వేచి చూసి ఆ తర్వాత ఆ ముద్రను పోగొట్టుకునే యత్నంలో భాగంగా.. అలాగే, అంతకుమించి తమ వివరణలతో హీరోగా ప్రజల మన్ననలను పొందగల్గే ఎత్తుగడగా కూడా ఇప్పుడు మాల్యా ఇంటర్వ్యూపై చర్చ జరుగుతోంది.

ఆల్రెడీ న్యారెట్ చేసిన స్క్రిప్ట్ ప్రకారం రాజ్ షమానీ ఇంటర్వ్యూ చేస్తాడు.. మాల్యా సమాధానాలిస్తాడు. అంతే! అంతకుమించి అదేం ఆప్ కీ అదాలత్ లాంటి కనీసం ఓ నల్గురు కూర్చున్న ప్రోగ్రాం కూడా కాదు. కాబట్టి రాజ్ ఏదడిగితే.. దానికి మాల్యా ఏం సమాధానం చెబితే దాన్ని మౌనంగా చూడటం మినహా.. భారత ప్రజానీకం తరపున నిలదీసే అవకాశమెక్కడిది..?

బ్యాంకుల్లో ఎందరో డిపాజిట్ దారుల సొమ్ము దారి మళ్లి మాల్యాపాలైన సొమ్మేమైందని అడిగే ఛాన్స్ ఎక్కడిది..? మరి భారతదేశంలో ప్రజలకు తానేంటో.. తన సచ్చీలతేంటో చూపించుకోవాలనుకున్న మాల్యా.. ఓ పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూ విడుదల చేసినంత మాత్రాన.. ఇక్కడి జనం గుండెల్లో రగులుతున్న ప్రశ్నలకు బదులెవరిస్తారు..?

ఏ ఒక్క నిజం బయటకు రాని రాజ్ షమానీ ఇంటర్వ్యూలకు వ్యూస్ రావడం గొప్పేమోగానీ.. ఏ ఒక్క నిజమైతే బయటకు వచ్చిన దాఖలాలైతే కనిపించలేదు. అదే సమయంలో వ్యూహాత్మకంగా బిగ్ షాట్స్ ప్లాన్ చేసే మీడియా స్టోరీస్ ఎలా ఉంటాయో కూడా తాజా విజయ్ మాల్యా పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూ పాఠం మనకు చెబుతోంది……..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
  • డిస్టర్బింగ్ సీసీటీవీ ఫుటేజీ… కొన్ని జవాబులు దొరకని ప్రశ్నలు కూడా…
  • ‘‘నీ ఏడుపేదో నువ్వేడువు… నాకన్నా ఎక్కువ ఏడువు… నేనేమైనా వద్దన్నానా..?’’
  • అమ్మతనం అంటే అన్నీ సహించడం కాదు… కొన్ని వదిలించుకోవడం కూడా..!!
  • ఆ ఉగ్రవాది కసబ్‌ను కోర్టులో గుర్తించిన ఓ చిన్న పాప మీకు గుర్తుందా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions