ప్రయోగాలు రామోజీరావుకు కొత్తేమీ కాదు… ప్రత్యేకించి మీడియా, వినోదరంగానికి సంబంధించి చాలా ప్రయోగాలు చేసి ఉన్నాడు… వాటి సాఫల్య వైఫల్యాల మాటెలా ఉన్నా ఒకేసారి 12 చానెళ్లను ప్రారంభించడం టీవీ సర్కిళ్లను ఆశ్చర్యపరిచింది… ఇది సరైన స్టెప్పేనా అని ఆశ్చర్యపోయేలా చేసింది… విషయం ఏమిటంటే..? బాలభారత్ పేరిట పలు భాషల్లో బాలల ప్రత్యేక చానెళ్లను ఒకేసారి ఈటీవీ లాంచ్ చేసింది… అది చేయగలదు, దాని సాధన సంపత్తి, ప్లానింగు పక్కాగా ఉంటయ్… గతంలో కూడా ఒకేసారి డజను భాషల్లో న్యూస్ చానెళ్లను లాంచ్ చేసిన అనుభవం కూడా ఈటీవీకి ఉంది… అయితే తెలుగు చానెల్ మినహా అన్నీ నష్టాల్లో కూరుకుపోయాయి… తను ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు రిలయెన్స్ ఇచ్చిన డబ్బుకు ప్రతిగా ఆ చానెళ్లను అంటగట్టి చేతులు దులిపేసుకున్నాడు రామోజీరావు… దక్కిందే మహాభాగ్యం అనుకుని అంబానీ కూడా ఆ చానెళ్లను న్యూస్18 నెట్‌వర్క్‌లో కలిపేసుకున్నాడు… అంటే, వేరే భాషల్లో చానెళ్లు నడపడం అనేది ఓ చాలెంజ్… ఇప్పుడు బాలభారత్ విషయానికొద్దాం…
ఎలాగూ రాను రాను ప్రింట్ మీడియా పనైపోతోంది… ఖర్చు తడిసిమోపెడవుతోంది… ప్రకటనల ఆదాయం తగ్గిపోతోంది… వీక్షకులు, పాఠకులు కూడా డిజిటల్, టీవీ ప్లాట్‌ఫారాల వైపు మళ్లుతున్నారు… అందుకని పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలని అనుకున్నట్టుంది ఈటీవీ… పైగా దేశవ్యాప్త నెట్వర్క్ నిర్మించాలనుకుంది… ఆధ్యాత్మికం, వ్యవసాయం, ఆరోగ్యం, పిల్లలు గట్రా వివిధ అంశాలకు ప్రత్యేకించి 65 చానెళ్లు స్టార్ట్ చేయాలని భావించారు… కొంత బేసిక్ ట వర్క్ జరిగింది… అయితే సినిమాలు, వినోదం, న్యూస్, ఆధ్యాత్మికం మినహా మిగతా అంశాల ప్రత్యేక చానెళ్లు ఏ భాషలోనూ పెద్దగా క్లిక్ కాలేదు… ఐనా రామోజీరావు గ్రూప్ ఈ అడుగులు ఎందుకు వేసిందో తెలియదు… ఇప్పుడు బాలభారత్ మాత్రం స్టార్ట్ చేశారు, మిగతావాటి పని ఆగిపోయింది… ఎందుకు ఆగిపోయింది…? పునరాలోచనలో పడిందా ఈటీవీ… అలాగైతే బాలభారత్ కూడా ఆగి ఉండేది కదా… నిజానికి ఈటీవీ స్థితి ఏమిటో చూద్దాం…
Ads
జనానికి కేవలం ఈటీవీ వినోద చానెల్ చాలు… అందులోనూ సీరియల్స్ పెద్దగా హిట్ కాలేదు… పలు రియాలిటీ షోల కోసం ఈటీవీని చూస్తుంటారు జనం… కాస్త ఈటీవీ ప్లస్ కూడా చూస్తుంటారు… అంతే ఇక… ఆ న్యూస్ చానెళ్లకూ పెద్ద ఆదరణ లేదు… ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్ రేటింగ్స్ చూస్తే, వాటిని అసలు ఎవరూ చూడటం లేదని అర్థం చేసుకోవాలి… ఐనాసరే, వాటన్నింటినీ ఓ బొకేలా అంటగడుతుంది ఈటీవీ… ఇప్పుడు బాలభారత్ 4 రూపాయలు… HD అయితే 6 రూపాయలు… లేదా ఇదీ బొకేలో చేర్పించేసి అంటగడితే సరి… ఇప్పటికే ఈటీవీ వినోద చానెల్ మూడో ప్లేసుకు వెళ్లిపోయింది… స్టార్ మాటీవీతో పోలిస్తే చాలా దూరంలో ఉండిపోయింది… ఇంకా వెనకబడితే ఈటీవీ బొకే కూడా ఎవరూ అడగరేమో… మరి ఈ స్థితిలో ఈ పిల్లల చానెళ్లు క్లిక్కవుతాయా..? సరే, శుభమే కోరుకుందాం… రామోజీ తరం నుంచి ఆయన మనమలు, మనమరాళ్లు బాధ్యతలు తీసుకుంటున్నారు… వాళ్లైనా పిల్లల చానెళ్ల రెవిన్యూ పొటెన్సీ సరిగ్గా స్టడీ చేయలేదా అనిపించింది… లేక ఇతర ప్రత్యేక చానెళ్లకన్నా పిల్లల చానెళ్లే కాస్త బెటర్ రేటింగ్స్ తెచ్చుకుంటున్నాయని ప్రస్తుతానికి ఈ బాల చానెళ్లతోనే ఆపుతున్నారేమో… నిజానికి ఈటీవీ భారత్ పేరిట పలు భాషల్లో స్టార్ట్ చేసిన న్యూస్ యాప్ కూడా పెద్దగా క్లిక్ కాలేదు… అవునేమో… ప్రింట్, డిజిటల్ నడుమ అన్ని మీడియా సంస్థలు ఎదుర్కొంటున్న ఆ సందిగ్ధ స్థితే ఈనాడుది కూడా…!!
Share this Article