Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శ్రీశ్రీ… ఒక తీరని దాహం… మ హా ప్ర స్థా నం… A CLASSIC AND MASTERPIECE …

June 15, 2025 by M S R

.

శ్రీశ్రీ… ఒక తీరని దాహం….. .. మ హా ప్ర స్థా నం….. A CLASSIC AND MASTERPIECE ….

జలజలపారే గంగా గోదావరీ అనే జీవనదులూ, మబ్బుల్ని తాకే హిమాలయ పర్వతశ్రేణులూ, పున్నమి వెన్నెల్లో తాజ్ మహల్ సౌందర్యమూ, బిస్మిల్లాఖాన్ షెహనాయి రాగాల లాలిత్యమూ… వీటి గురించి మళ్లీమళ్లీ మాట్లాడుకున్నా బావుంటుంది.

Ads

కాటుక కంటినీరు చనుకట్టపయింబడ
యేల ఏడ్చెదో…
బాల రసాలసాల
నవపల్లవ కోమల కావ్య కన్యకున్…
మందార మకరంద మాధుర్యమును గ్రోలు…
వంటి తియ్యని తెలుగు కవిత్వాన్నీ,
సిరులు మించిన పసిమిబంగరు జిలుగు
దుప్పటి జారగా…

……… అంటూ కవ్వించే
జనార్దనాష్టకం పద్యాల నడకలోని తూగునీ
ఎన్నిసార్లు పాడుకున్నా
అదే చెక్కుచెదరని అందం
అంతే తన్మయత్వం!

అటు మహాభారతం, ఇటు కన్యాశుల్కం, ఒక అనాకెరినా, ఒక బ్రదర్స్ కరమజోవ్, ఒక వన్ హండ్రెడ్ యియర్స్ ఆఫ్ సాలిట్యూడ్, చలం
ఓ పువ్వు పూసింది ఎలాగో,
మహాప్రస్థానమూ అంతే.
ఒక సూపర్ క్లాసిక్… మరిచిపోలేని మాస్టర్ పీస్ !

అది తెలుగు సాహిత్యాన్ని యుద్ధరంగంలోకి నడిపించింది. తెలుగు కవిత్వాన్ని అజేయమైన శక్తిగా నిలిపింది. నీలాకాశంలోకి తెలుగు పతాకాన్ని ఎగరేసింది. విశ్వనాథ సత్యనారాయణ లాంటి పండితుడూ, సంప్రదాయవాదీ విస్తుపోయాడంటే, శ్రీశ్రీ ఎగరేసిన జెండాలూ, సంస్కృత సమాసాలకు తల్లకిందులై కాదు, అందులోని స్వచ్ఛమైన, అచ్చమయిన కవిత్వాన్ని చూసి, అలారాయడం మరొకరి వల్లకాదని తెలిసీ!

తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరు? – విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో ఆ నాలుగు లైన్లూ చదివి, దివాకర్ల వెంకటావధాని, రెండుమూడొందల ఏళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో ఇలా అన్నవాడెవడూ లేడని ఒక ఉద్వేగంతో చెప్పారు.

సత్యజిత్ రాయ్ పథేర్ పాంచాలి, సెర్గీ ఐజెన్స్టీన్ బాటిల్షిప్ పొటెంకిన్, చార్లీచాప్లిన్ మోడర్న్ టైమ్స్, గ్రేట్ డిక్టేటర్ సినిమాలు అచ్చూ శ్రీశ్రీ కవిత్వం లాంటివే. స్మృతిపథం నుంచి చెరిగిపోనివే ఎన్నటికీ!

శ్రీశ్రీని పరుసవేది అన్నాడు జ్వాలాముఖి. మోడువారిన చెట్టు చిగురించి మళ్లీ జీవితంలోకి ప్రవేశించడం మనకి నేర్పుతుంది. శ్రీశ్రీ కవిత్వం చదివిన వాళ్ళందరి అనుభవమూ అదే. మనోవాక్కాయకర్మ శుద్ధి పరిపూర్ణంగా గలవాడికి మాత్రమే అలాంటి కవిత్వం సిద్ధిస్తుంది. సరస్వతీదేవి సాక్షాత్కరిస్తుంది.
మహాప్రస్థానానికి 75 ఏళ్లు అంటున్నారు.

తొలిసారి 1950లో అచ్చయింది గనక ఇలా అనొచ్చు. హంగ్రీ థర్టీస్ లోనే 1934- 40 మధ్యనే శ్రీశ్రీ ఈ గీతాలు రాశారు. రాసి తొంభై సంవత్సరాలు అయింది. సెలబ్రేట్ చేసుకోడానికి ఒక అకేషన్ అని తప్పితే, జీవనది లాంటి ఆ కవిత్వం మన సంస్కృతిలో, అనుభూతిలో, మన రక్తంలో ఎప్పటికీ ప్రవహిస్తూనే వుంటుంది.

మహాప్రస్థానంలో మీకు ఏ కవిత ఇష్టం? కొంపెల్ల జనార్ధనరావు కోసమా? ఎచటికి పోతావీరాత్రి ? వ్యత్యాసమా? దారిపక్క చెట్టు కింద కూర్చున్న ముసిల్దా? సంధ్యా సమస్యలా? శైశవగీతా? గంటలా? కవితా ఓ కవితా? ఇలా మనం ఎన్ని పొయెమ్స్ అయినా చెప్పగలం. వాటిని అప్పచెప్పగలం కూడా!

అయితే, తాను రాసిన వాటిల్లో శ్రీశ్రీకి బాగా నచ్చిన కవిత ఏదో తెలుసా? అది మహాప్రస్థానంలో లేదని కూడా తెలుసా? ‘శరశ్చంద్రిక’ నాకు యిష్టం అని ఒక సందర్భంలో చెప్పారు శ్రీశ్రీ. ఆ దీర్ఘ కవిత ‘ఖడ్గసృష్టి’లో మొట్టమొదటిది! ‘నవీన విశ్వవిద్యాలయాల్లో పురాణ కవిత్వం లాగా, శ్రవణయంత్రశాలల్లో శాస్త్రీయ సంగీతం లాగా ఇలా వచ్చావేం వెన్నెలా?’ అంటూ వెన్నెలతో మహాకవి సంభాషణ మొదలవుతుంది.

సాదాసీదాగా, నిరలంకారంగా, వూర్కెనే నువ్వూ నేనూ మాట్లాడుకున్నట్టే వుంటుంది. శరశ్చంద్రిక చదవడం పూర్తి అయ్యేసరికి మనం ఒక వెన్నెల తుఫాన్ లో చిక్కుకుపోతాం. సాక్షాత్తూ వెన్నెల… సముద్రం మీద సంతకం చేస్తున్న దృశ్యం ఒక మహత్తరమైన పెయింటింగ్ లా మనోఫలకం మీద నిలిచిపోతుంది.

ప్రలోభాలకూ, పద్మశ్రీలకూ తలవొంచని తరానికి చెందినవాడు పురిపండా అప్పలస్వామి. ఒరియా సాహిత్య చరిత్ర రాసిన తెలుగువాడు. చేతిరాతతో లండన్ మహాప్రస్థానం ఎందుకూ? అని శ్రీశ్రీ సందేహిస్తున్నపుడు, పురిపండా ఇలా అన్నారు. ‘మహాప్రస్థానం ఈ శతాబ్దంలో తెలుగులో వచ్చిన ఏకైక మహాకావ్యం. నాకు తెలిసినంతమట్టుకు మరే భారతీయ భాషలోనూ ‘కవితా ఓ కవితా’ అంత గొప్పగీతం రాలేదు’. ఈ మాట ఒక జ్ఞానపీఠ్ అవార్డు కన్నా తక్కువదేమీ కాదు. మార్క్సిస్ట్ ఈస్థటిక్స్ కి మహాప్రస్థానమే ఒక సజీవ ఉదాహరణ.

గదిలో ఎవరూ లేరు, గది నిండా నిశ్శబ్దం
సాయంత్రం ఆరున్నర, గది లోపల చినుకుల వలె చీకట్లు… అని మొదలవుతుంది ‘ఆకాశదీపం’.
వట్టి వచనం. తొంభై సంవత్సరాల క్రితం యిలా రాయడానికి ఎంత ధైర్యం శ్రీశ్రీకి?

దీపం ఆరిపోయింది, తారగా మారిపోయింది అని కవిత ముగిసేసరికి గుండె పేలిపోతుంది. అందుకే చలం ‘బుద్ధున్నవాడెవడూ దీన్ని కవిత్వం అనడు’ అన్నారు. ‘ఈ కవి appeal బుద్ధిని, వివేకాన్నీ, కళానిబంధనల్ని మించిన ఏ అంతరాళానికో తగుల్తుంది, ఆ అంతరాళం అనేది ఉన్నవాళ్ళకి’ అని ఘాటుగా చెప్పారు.

నిప్పులు చిమ్ముకుంటూ… అంటూ ఆరు లైన్ల పొట్టి కవిత రాసినా, కవితా ఓ కవితా.. అని ఆరేడు పేజీల సుదీర్ఘ కవిత్వం రాసినా శ్రీశ్రీలో ఆవేశం, సముద్రకెరటమై ఎగిసిపడుతుంది. లెనిన్, స్విన్ బర్న్, సాల్వడార్ డాలీ, కొంపెల్ల జనార్ధనరావు… యిలా ఎవరి గురించి రాసినా పాఠకుణ్ణి నిద్రపోనివ్వని శ్రీశ్రీ ముద్ర మనందరి కలెక్టివ్ ఎక్స్ పీరియన్స్!

కనకదుర్గా చండసింహం జూలు దులిపీ ఆవులించింది.. అనే శుద్ధ వచనాన్ని నరాలు తెగే అభ్యుదయ కవిత్వంగా మార్చే రహస్యం తెలిసినవాడు… అతనొక్కడే !

మహాప్రస్థానమూ, ఖడ్గసృష్టి మాత్రమే రాసి శ్రీశ్రీ చేతులు దులుపుకోలేదు. సిరిసిరిమువ్వలు, ప్రాసక్రీడలు, లిమరిక్కులు, గల్పికలు, అనువాదాలు, నాటికలు, కథలు, వీలునామా, సినిమా పాటలు, ఆత్మకథ ‘అనంతం’ ….

మరెన్నో రాశాడు. అద్భుతాలు చేశాడు. జీవితాంతమూ రాస్తూనే వున్నాడు. ఎంత రాశాడో అంతకుమించి చదువుకున్నాడు. శ్రీశ్రీ జ్ఞాని. రుషితుల్యుడు. కష్టజీవులందరికీ మిత్రుడు. తెలుగుజాతి వరపుత్రుడు.

దాశరథి కృష్ణమాచార్య చల్లని సముద్రగర్భంలో బడబానలాన్ని చూసినా, సోమసుందర్ వజ్రాయుధాన్ని దూసినా, దేవరకొండ బాలగంగాధర తిలక్ అమృతం కురిపించినా, వెలుతురెక్కడ సోనియా అంటూ బైరాగి విలపించినా, చెట్లు కూలుతున్న దృశ్యాన్ని చూసి అజంతా కన్నీళ్లు పెట్టినా, జనంతో నడు, కాలాన్ని వెంటపెట్టుకు నడూ.. అని మఖ్దూమ్ మొహియిద్దిన్ పిలుపుయిచ్చినా, సత్యమూర్తి చిరుగాలి సితారా సంగీతం వినిపించినా, ఎండ్లూరి సుధాకర్, మద్దూరి నగేష్ బాబు వెలివాడల వేదనని కన్నీటి అక్షరాలుగా పరిచినా అది శ్రీశ్రీ తిరుగుబాటు వేదాంతానికి ఉత్తేజపూర్వకమైన కొనసాగింపు మాత్రమే.

గురజాడ వేంకట అప్పారావు పరిచిన వారసత్వపు వెలుతురు దారుల్లో శ్రీశ్రీ ఎర్రకాంతుల ఇనోదయాన్ని డిస్కవర్ చేసి, నవ్య కవిత్వంతో నిండిన వేల పాలపుంతల్ని ప్రసాదిస్తే.. ఆ వెలుగు వెన్నెల జడిలో ఆధునిక తెలుగు కవిత్వం మానవజీవన మాధుర్య సౌందర్య తీరాలను తాకి పరవశిస్తోంది.■

…………………….
ఒక మాట : ఈరోజు జూన్ 15
శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం సాక్షి డైలీ లో వచ్చింది . కవి బండ్ల మాధవ రావు, శ్రీశ్రీ విశ్వేశ్వరరావులు అడిగితే రాశాను . వాళ్ళిద్దరూ కూడబలుక్కుని , కుట్రజేసి , నాకు తెలియకుండా సాక్షికి పంపించారు . పగ సాధించకపోను ………. _ తాడి ప్రకాష్ 9704541559 (శ్రీశ్రీ 75…. బొమ్మ…. ఆర్టిస్ట్ అన్వర్)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
  • డిస్టర్బింగ్ సీసీటీవీ ఫుటేజీ… కొన్ని జవాబులు దొరకని ప్రశ్నలు కూడా…
  • ‘‘నీ ఏడుపేదో నువ్వేడువు… నాకన్నా ఎక్కువ ఏడువు… నేనేమైనా వద్దన్నానా..?’’
  • అమ్మతనం అంటే అన్నీ సహించడం కాదు… కొన్ని వదిలించుకోవడం కూడా..!!
  • ఆ ఉగ్రవాది కసబ్‌ను కోర్టులో గుర్తించిన ఓ చిన్న పాప మీకు గుర్తుందా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions