.
Devi Prasad C … నా అదృష్టమేమో గానీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా తొలినాళ్ళ నుండీ పాటలు రాయించుకు రావటానికి ఎక్కువగా నన్నే పంపేవారు దర్శక నిర్మాతలు.
“వేటూరి” గారితో పాటలు రాయించుకుంటూ “విజయా గార్డెన్స్”లో ఆయనతో గడిపిన సమయం మరిచిపోలేనిది.
“కృష్ణ” గారు హీరోగా “కోడి రామకృష్ణ” గారి దర్శకత్వంలో “రామలింగేశ్వరరావు” గారు నిర్మించిన చిత్రం “చుట్టాలబ్బాయి”…
Ads
కధ లో “సినిమా హీరో కృష్ణ” గారి అభిమానురాలి పాత్ర పోషించిన సుహాసిని గారి ఇమాజినేషన్లో ఒచ్చే ఓ డ్యూయెట్ సాంగ్ కోసం, ఒక్క గంటలో నాలుగు పల్లవులు, రెండు చరణాలు ఇచ్చారు వేటూరి గారు.
చరణాలతో పాటు ఓకే అయిన పల్లవి …
హీరోయిన్: నీ వేణువు ఊదరా నా మేను ఊగగా
అందాల మా కృష్ణమూర్తి ….
హీరో: ఓ కొంటె గోపిక నీ కొంగు కానుక
అందించవా అర్ధరాత్రి …..
అంటూ సాగుతుంది…
“పాట అంతా ఓకే గానీ ఓ మాస్ హీరో అభిమాని పాడే పాట ఎత్తుగడే అంత క్లాస్‌గా ఉంటే ఎలా “అన్నారు నిర్మాత గారు.
వేటూరి గారి దగ్గరకు మళ్ళీ వెళ్ళి విషయం చెప్పి కనీసం మొదటి లైన్ అన్నా మారిస్తే బాగుంటుంది గురువు గారు అన్నాను…
ఎలా మారుద్దాం నాయనా అన్నారాయన నవ్వుతూ….
సినిమాలో హీరోయిన్ నాకులాగే “సూపర్ స్టార్” అభిమాని కాబట్టి ఆయన స్టార్డమ్ ని పొగుడుతూ నటశేఖర, డాషింగ్, డేరింగ్ హీరోలాంటివేవైనా…. అంటూ ఉండగానే…. “ఆ చివరలో అన్నావే అదే రాసుకో నాయనా
“డాషింగ్ వీరుడే డేరింగ్ ధీరుడే అందాల మా కృష్ణమూర్తి” అన్నారు…
“అయ్యో ….. నేనేదో ఊరికే అన్నాను సర్” అంటే “నువ్వు ఊరికే అన్నా అది కరెక్ట్ గా వుంటుంది. కావాలంటే నీకు దానికి డబ్బులిస్తా నాయనా” అని పెద్దగా నవ్వారు.
అలా ఆ పాట మొదటి లైన్ మారిపోయింది…
అదే సినిమాలో రాధతో పాడే మరో డ్యూయెట్ రాయవలసి వుంది.
అర్జెంట్ సర్ అని తొందరపెడితే ఓ రోజు రాత్రి 7 గంటలకు టి.నగర్‌లోని వెంకటనారాయణ రోడ్లో వుండే ఓ కల్చరల్ క్లబ్ దగ్గరకి రమ్మన్నారు వేటూరి గారు. వెళ్ళాను…
లోపలికి వెళితే కనిపించి “బైట చెట్ల కింద అరుగు మీద కూర్చుని రాసుకుందాం, వెయిట్ చెయ్ నాయనా ” అన్నారు.
బైట చిన్న చినుకులు ప్రారంభం కావటంతో అంబాసిడర్ కారు ఫ్రంట్ సీట్లో కూర్చొన్నాను.
ఈలోగా డ్రైవర్ జోగారావు గారు కార్లో పాటల క్యాసెట్ పెట్టారు.
ఓపక్క చినుకులు పెద్దవయ్యాయి.
స్పీకర్లో “సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా సీతాలమ్మా” అని స్వాతిముత్యం సినిమాలోని పాట వస్తుంది.
ఈ లోగా ఎప్పుడొచ్చారో వేటూరి గారొచ్చి కారు వెనక సీట్లో కూర్చున్నారు. పాట ఆపేసి దిగిపోయారు డ్రైవర్.
కారులో కొద్దిగానే బైటి నుండి లైట్ల కాంతి పడుతోంది…
“ఇక్కడే కూర్చుని రాసుకుందాం పరవాలేదు కద నాయనా” అంటే సరే సర్ అని టేప్రికార్డర్లో ట్యూన్ ఆన్ చేశాను.
ఓ పక్కన వర్షం జోరు పెరిగి కారుపైన టపటపమంటూ శబ్దం చేస్తోంది.
పల్లవి ట్యూన్ విన్న మరుక్షణమే చిరునవ్వుతో రాసుకో నాయనా అంటూ…..
“సువ్వీ సువ్వీ సుందరాంగిరో …. కవ్విస్తుంటే నవ్వుతాదిరో…
అబ్బోయబ్బా అందగాడురో…. నిబ్బరాల నీటు చూడరో….
అంటూ గబగబా పాటంతా పదిహేను నిమిషాల్లో చెప్పేసి “కంగారుపడకు నాయనా…. “సువ్వీసువ్వీ” అనేది ఎప్పటినుండో జానపదాల్లో ఉన్నమాటలే. ఎన్నిసార్లు వాడినా బాగానే ఉంటాయి” అంటూ ” నాయనా ఇక్కడ బిసిబేళాబాత్ మహారుచిగా ఉంటుంది తిని వెళ్ళకూడదూ” అంటే “వెళ్తాను గురువు గారూ” అన్నాను.
కారు దిగి వర్షంలో తడుచుకుంటూనే లోపలికి వెళ్ళిపోయారాయన.
అమోఘమైన సాహితీ విలువలున్న పాటలని చెప్పలేకపోయినా
ఆ రోజుల్లో “సూపర్ స్టార్” అభిమానుల్ని బాగానే ఉత్సాహపరిచాయా పాటలు.
ట్యూన్ ఏదైనా ఎలాంటిదైనా విన్నంతనే, వేటూరి గారంత వేగంగా పాట రాయగలిగిన మరొక గీత రచయితని నా అనుభవంలో నేనైతే చూడలేదు.
అనంతమైన ప్రతిభతో, అసమానమైన కరుణతో వెలుగొందిన ఆ మహానుభావులను తలుచుకున్నప్పుడు అనిపించదా……
ఏవి తల్లీ…. నిరుడు కురిసిన హిమ సమూహములు……
_____ దేవీ ప్రసాద్…
Share this Article