సంకేతాలు స్పష్టంగానే ఉన్నయ్… మంత్రి ఈటల రాజేందర్‌పై సీఎం కేసీయార్‌కు వైరాగ్యం వచ్చేసింది… బంధం తెగిపోయినట్టే… ఎన్నాళ్లుగానో ఇద్దరి నడుమ దూరం పెరుగుతూనే ఉంది… అప్పుడప్పుడూ ఈటల ఏవేవో నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయడం, తరువాత సద్దుమణగడం… మొన్నీమధ్య సాక్షాత్తూ కేటీయార్ పూనుకుని, కేసీయార్-ఈటల భేటీకి ప్రయత్నించినా ఫలించలేదు… కేసీయార్ ఈటలను దూరం పెట్టినట్టే అనే అభిప్రాయం అధికార్లు, పొలిటికల్, జర్నలిస్టు సర్కిళ్లలో ప్రచారంలో ఉన్నదే… ఇక ఇప్పుడు ఒకేసారి టీన్యూస్, ఎన్టీవీ, టెన్‌టీవీ, టీవీ9 తదితర చానెళ్లలో ఒకేసారి ఈటల మీద భూబాగోతం స్టోరీలు ప్రసారం అవుతున్నాయంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చు జరగబోయేది ఏమిటో… ప్రత్యేకించి టీన్యూస్‌లో ఓ మంత్రి మీద నెగెటివ్ స్టోరీ రావడం అంటే, ఆ మంత్రికి ఎగ్జిట్ ద్వారం చూపించినట్టే లెక్క… బహుశా రేపు నమస్తే తెలంగాణలో ఈ అంశంపైనే ప్రత్యేక కథనాలు ఉండవచ్చు…
చానెళ్లలో ఈ ప్రత్యేక కథనాలు చూడగానే మామూలు ప్రేక్షకుడికి అర్థమైపోయింది… ఇక కేసీయార్-ఈటల బంధానికి తెరపడినట్టే అని… కాకపోతే పహెలే బదనాం, బాద్మే బర్తరఫ్ అనే పద్ధతి కావచ్చు… ఒక సీనియర్ మంత్రిపై వేటు వేయాలంటే ఎంతోకొంత బేస్ ప్రిపేర్ చేయాలి కదా… ఇక ఇప్పట్లో ఏ ఎన్నికలూ లేవు… ఇప్పుడు అనవసరంగా డిస్టర్బెన్స్ దేనికి అనుకుని కొన్నాళ్లు సైలెంటుగా ఉన్న కేసీయార్ ఇక పార్టీ మీద కాన్సంట్రేట్ చేయబోతున్నాడు అని అర్థం… పార్టీకి, తనకు ఎప్పటికైనా నష్టమే అని తను బలంగా ఫీలైన అంశాల్ని సెటిల్ చేసే ప్రయత్నాలు ఆరంభమైనట్టే అనుకోవాలి… ఇక్కడ మనం ఈటల భూబాగోతం ఏమిటి, కేసీయార్‌తో ఎందుకు సంబంధాలు చెడిపోయాయి అనే చర్చలోకి వెళ్లడం లేదు… తన హిట్ లిస్టులో ఇంకా ఎవరున్నారనే చర్చ సాగుతూ ఉంటుంది కొన్నాళ్లు… డీఎస్, నరేంద్ర, విజయశాంతి… ఎవరైనా సరే, కేసీయార్ ఒక్కసారి వదుల్చుకోవాలని స్థిరంగా అనుకుంటే ఇక తన నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు… కాస్త ఆలస్యం కావచ్చుగాక… కానీ జరగకతప్పదు… చాలా ఉదాహరణలున్నయ్… ఈటల తాజా ఉదాహరణ అవుతున్నాడేమో..!! ఈ వార్తలు వచ్చిన వెంటనే కేసీయార్ స్పందించి జిల్లా కలెక్టర్ ద్వారా సమగ్ర విచారణ జరిపించి తనకు నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆదేశించాడు… అలాగే ఈ ఆరోపణల నిగ్గు తేల్చాలని విజిలెన్స్ డీజీపీ పూర్ణచందర్‌రావును కూడా ఆదేశించాడు… బహుశా ఈటల కూడా తనపై వచ్చిన ఆరోపణలకు టీవీ ముఖంగానే సమాధానాలు ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టున్నాడు…
Ads
Share this Article