.
నిజానికి చాలా రోజులైంది ఓసారి కామాఖ్యకు వెళ్లాలి, చూసి రావాలని..! ఎందుకు అనే ప్రశ్నకు సంక్షిప్త వివరణ కుదరదు…
1) దేశంలో నాలుగు ఆదిశక్తి పీఠాలు… గౌహతిలోని కామాఖ్య, పూరీ జగన్నాథ టెంపుల్లోని బిమలా దేవి, కోల్‌కత్తాలోని మహాకాళి, అదే ఒడిశాలోని గంజాం జిల్లాలో ఉన్న తారా తరణి టెంపుల్…
Ads
2) ఇవి గాకుండా 12 శక్తి పీఠాలు అని మరో జాబితా… అవి ఆదిశక్తి పీఠాలు కావు, శక్తి పీఠాలు… 18 తో మరో జాబితా… 51తో మరొకటి… 108తో పీఠాల జాబితా… పేర్లు ఏవయితేనేం..,. ఓ కన్ఫ్యూజన్ ఉంది… నిజంగా శక్తి పీఠాలు ఎన్ని..? ఏవేవి..?
3) ఐతే ఇక్కడ ఆస్తికుడి కోణం కాదు ఇది… ఆసక్తికుడి కోణం… అంటే, విషయంపై ఆసక్తి మాత్రమే నాకు ప్రధానం… ఏమిటా ఆసక్తి..? నిజంగా గుడిలోనే బలి జరుగుతుందా అని..!! చట్టబద్ధమేనా అని..!!
.
ఏమిటంటే…? ప్రపంచంలో రోజూ కోట్ల జీవుల్ని హతమార్చి తింటాం కదా.,. అది జంతుహింస కాదా..? అసలు ప్రపంచ జీవావరణ సూత్రమే ఒకదాన్ని ఇంకొకటి తినాలని కదా… అలా తింటేనే బ్యాలెన్స్ కదా… తినాలంటే చంపాలి కదా… చంపడం అనేది హింసే కదా… మరిక జంతుబలి దారుణం, నీచం, నిషిద్ధం అంటూ జంతుబలి నిషేధ చట్టం ఎందుకొచ్చినట్టు…? అంతా హిపోక్రసీ, అంతా నాటకం, అంతా ఆత్మవంచన…
సరే, అది వదిలేస్తే… నాకు తెలుసు శక్తిపీఠాలు ఎక్కడున్నా జంతుబలి, తాంత్రిక పూజలు అధికారికంగా అమలయ్యేది, ఆచారంగా వర్ధిల్లుతున్నది కామాఖ్యలోనే… ఎస్, అందుకే కామాఖ్యకు వెళ్లాలనే కాంక్ష, గమనించాలనే ఆసక్తి చాన్నాళ్లుగా ఉంది…
జంతుబలి మీద చాలా వివాదాలున్నయ్… తెలుసు… జంతుబలిని నిషేధిస్తూ కొన్ని రాష్ట్రాల్లో చట్టాలూ ఉన్నాయి… కోట్లాది మంది ఆధ్యాత్మిక విశ్వాసాన్ని, పూజా విధానాన్ని ఓ జీవోతో, ఓ సర్క్యులర్‌తో, ఓ చట్టంతో, ఓ పోలీస్ లాఠీతో ఆపగలమా…? ఇదీ ప్రశ్న…
బలి విశిష్టత, ప్రాశస్త్యం, రకాలు, ఔచిత్యం, పవిత్రత వంటి పదాలు, వివరణలు, విశ్లేషణల జోలికి పోవడం లేదు ఇక్కడ… మాంసాహారం కోసం చంపినా, నైవేద్యం కోసం చంపినా ఒకటే… పెద్ద తేడా లేదు… పైగా మనిషి ఆదిమ జీవనం నుంచి ఇప్పటి దాకా బలి ఎవడూ అడ్డుకోలేని అర్చన పరంపర… జీవకారుణ్య చట్టం, జంతుబలి నిరోధక చట్టం అరిచేవాడితో సహా…
అంబుబాచీ తరువాతరోజు కదా, లక్షల జనం, ఆరోజు దర్శనమే కుదరలేదు… గర్భాలయంలోకి వెళ్లకుండానే మంటపంలోని ‘మూర్తి దర్శనం’ మమ అనిపించుకుని వచ్చేశాం… పైగా అంబుబాచీ మేళా ముగిసేదాకా జంతుబలి, బలిపూజ ఉండవన్నారు…
వోకే, రారమ్మని పిలిచిన అమ్మ దర్శనం ఇవ్వక వాపస్ పంపిస్తుందా అనుకుని, మరుసటి రోజు ప్రయత్నం.., ఒకరోజు మాజీ సీఎం రాక, మరుసటిరోజు సీఎం రాక… ఐనా రెండోరోజు బలిపూజ సంపూర్ణం, దాంతోపాటే దర్శనం… ఫిక్స్…?
ఈమధ్య మన తెలుగు జనం విపరీతంగా వెళ్తున్నారు అక్కడికి… మనవాళ్ల సంగతి తెలుసు కదా, మొత్తం వాతావరణాన్ని పొల్యూట్ చేసేశారు… ఎవరైనా పంతులు (పూజారి) ఔట్ ఆఫ్ ది వే 10 వేలు అడిగితే 20 వేలు ఇచ్చే బాపతు మనం… ఇంకేముంది…? 5 వరకూ పూజలు కుదరవు అంటూనే అంబుబాచీ రెండో రోజు నుంచే బలిపూజ స్టార్ట్ చేశారు…
ఏ పూజకు ఎంత..? ఏ పద్థతి..? ఎవరిని అడగాలి..? చెప్పుకుందాం రెండో భాగంలో...
Share this Article