.
బివి పట్టాభిరామ్… 75వ ఏట జీవితాన్ని సంపూర్ణం చేసుకున్న వ్యక్తి… నిజమే, తన జీవితమే ఓ పాఠం… చాలా అంశాల్లో…! ఆయన మరణానంతరం మీడియాలో పలువురు ఆయనతో తమ వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు తప్ప, తనను సరిగ్గా ఆవిష్కరించలేదేమో అనిపించింది…
కొందరు రిపోర్టర్లు తనను సైకియాట్రిస్టు అని రాసేశారు… ఓసారి మేజిక్ ఫెయిల్యూర్‌పై తనెలా బాధపడ్డాడో యండమూరి చెబితే… పట్టాభిరాం చిన్న మేజిక్కులు చూస్తూ పీవీ చప్పట్లు కొట్టాడని ఎమెస్కో విజయకుమార్ రాసుకొచ్చాడు… మేజిక్కు వెనుక ఉన్న మర్మం మాత్రం చెప్పేవాడు కాదట… నిజమే, గుప్పిట తెరిస్తే ఇంకేముంది..?
Ads
కొన్నాళ్లుగా అనేక యూట్యూబ్ వీడియోలు… ఏ మేజిక్ వెనుక ఏ మర్మమో విప్పి చెప్పేవి… నిజానికి అవి పట్టాభిరాం కోణంలో ఒకరకంగా వృత్తి ద్రోహమే… మర్మం బయటపడిన మేజిక్కులు మళ్లీ చేయలేరు, కొత్తవి క్రియేట్ చేసుకోవాలి… ఒకసారి మేజిక్ గుట్టు తెలిశాక ఇక ప్రేక్షకుడు దాన్ని ఎంజాయ్ చేయలేడు కదా…
సరే, తనది బహుముఖ ప్రజ్ఞ… ఎక్కడా ఆగిపోలేదు, ఇక చాలు అని… అదీ నచ్చేది… యండమూరి ఎలాగైతే నవలా ఫిక్షన్ పాఠకులు తగ్గిపోతున్నారని గమనించి వ్యక్తిత్వ వికాస పాఠాలు, పుస్తకాలవైపు మళ్లాడో, తన ఫ్రెండ్ పట్టాభిరాం కూడా అంతే… తనను డైవర్సిఫై చేసుకున్నాడు…
మొదట్లో తను ఏదో చిన్న ఉద్యోగి… తరువాత కేవలం మేజిక్… రెండుమూడు గంటలపాటు షో నడిపేలా… ప్రేక్షకులను మంత్రజాల ముగ్దులను చేస్తూ…! జస్ట్, వినోదం కాదు, దాన్ని జనంలో ఉన్న మూఢనమ్మకాలకు విరుగుడు చైతన్యబోధలా మార్చాడు… అదీ విశేషం.., అదీ తన విద్యకు సొసైటీ కన్సర్న్… తను సంస్కరణాభిలాషి… నిజమైన సంస్కారి…
తరువాత హిప్నాటిజం వైపు మళ్లాడు… అప్పట్లో మేజిక్ అంటే ఎలా పట్టాభిరాం పేరు వినిపించేదో హిప్నాటిజం అంటే కూడా సేమ్… తనే దాన్ని బలంగా పరిచయం చేసింది తెలుగువాళ్లకు… ప్లస్ యండమూరి నవలలు కూడా..! హిప్నాటిజం ద్వారా వైద్యం అనేది తను నమ్మాడో లేదో తెలియదు గానీ ఆ వైద్యం మీద కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి…
(అదేదో జంధ్యాల సినిమాలో శ్రీలక్ష్మికి తనే నటించి చేసిన చికిత్స ఫన్ కోసమే… కానీ అప్పట్లో చాలామంది హిప్నో ట్రీట్‌మెంట్ పేరిట కొందరు హిప్నాటిస్టులు చాలా గడించారు… హిప్నో థెరపీ బహుశా కొన్ని మానసిక బలహీనతలకు మాత్రమే ఫలిస్తుందేమో… ఆ చర్చను పక్కన పెడితే పట్టాభిరాం హిప్నాటిజంలో పీహెచ్‌డీ చేశాడు…)
సైకాలజీ, ఫిలాసఫీ, జర్నలిజం, గైడెన్స్ కౌన్సెలింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్… అన్నీ చదివాడు… రెండింటిలో పీజీ కూడా..! మేజిక్, హిప్నాటిజం, సైకాలజీని కలగలిపి తన సైకలాజికల్ కౌన్సెలింగ్ సాగేది… క్రమేపీ మేజిక్, హిప్నాటిజం నుంచి పక్కకు జరిగి పూర్తిగా మానసిక, వ్యక్తిత్వ వికాస బోధకుడిగా, కౌన్సెలర్‌గా మారిపోయాడు… ఇదంతా ఒక వైపు…
తను రచయిత… పలు అంశాల్ని సూటిగా చెప్పటానికి దాదాపు 57 పుస్తకాలు రాశాడు… తన ఆత్మకథతో సహా..! బహుశా అందులో అధికభాగం ఎమెస్కో పబ్లిష్ చేసినవే కావచ్చు… తెలుగే కాదు, తనకు తమిళం, కన్నడ, ఇంగ్లిషులోనూ పట్టుంది, రాశాడు… వ్యాసాలు, పుస్తకాలు ఎట్సెట్రా…
ఇండియాలోని పలు ప్రముఖ నగరాల్లోనే కాదు… ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, అమెరికా, థాయ్‌లాండ్, అరబ్ దేశాల్లో అనేక వర్క్ షాపులు… ఫ్లోరిడా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్… న్యాష్‌విల్, న్యూ ఆలియన్స్ మేయర్ల ద్వారా గౌరవ పౌరసత్వాలు… పలు ఇండియన్ యూనివర్శిటీలు, ఎంఎన్‌సీలు, ఆధ్యాత్మిక సంస్థలకు సలహాదారు… వాట్ నాట్..? తనదే ఓ పెద్ద విజయగాథ..!!
Share this Article