మంత్రి పదవి పీకేసి, పొగబెట్టేసి… కేసీయార్ ఇక వదిలేస్తాడా ఈటలను..? లేక అరెస్టు చేసి, జైలుపాలు చేసి, ఇంకా వేటాడతాడా..? పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడా..? కేసీయార్ వేట నుంచి రక్షణకు ఓ బలమైన పార్టీ అండ చూసుకోవడమా..? లేక ఓ ప్రత్యేక పార్టీ పెట్టి, అందరినీ కూడగట్టి, కూటములు కట్టి కేసీయార్ మీద కక్ష తీర్చుకును ప్రయత్నం చేయడమా..? డబ్బు ఉండొచ్చు, కానీ అంత యాక్సెప్టెన్సీ ఉందా తనకు..? (తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కేసీయార్‌కు దక్షిణ తెలంగాణలో పెద్దగా యాక్సెప్టెన్సీ లేదు, అది వేరే కథ…) ఇప్పుడు ఈటలను రెచ్చగొట్టేవాళ్లు నాలుగు రోజులయ్యాక, అంతా చల్లబడ్డాక తనతో ఉంటారా..? ఇలా రకరకాల ప్రశ్నలు తెలంగాణ సమాజంలో..! ఎందుకంటే..? ఈటల జోలికి వెళ్లడానికి ముందు కేసీయార్ బహుముఖంగా ఆలోచించి, బాగా గ్రౌండ్ ప్రిపేర్ చేసి మరీ కొట్టాడు… తనను వదిలించుకోవడం వల్ల నష్టమేమిటో ఒకసారి ప్లస్సు, మైనస్సు ఆలోచించుకుని మరీ వేటువేశాడు… ఈటలకూ ఈ విషయం తెలుసు… అయితే తను కేసీయార్‌ను విడిచిపెట్టిపోయిన ఇతర నాయకుల్లాగా బయటపడటం లేదు, తన ఆలోచనలు- అడుగులు ఏమిటో కూడా స్పష్టంగా చెప్పడం లేదు… చాలా అంశాల్లో గుంభనంగానే వ్యవహరిస్తున్నాడు…
చివరకు విలేకరులతో చిట్‌చాట్ సందర్భంగా కూడా తనేమీ ‘పొల్లు మాటలు’’ రానివ్వడం లేదు… చాలా ఏళ్లుగా కేసీయార్‌ను దగ్గర నుంచి చూస్తున్నాడు కాబట్టి, కేసీయార్‌ను ఎదుర్కోవడం అంత అల్లాటప్పా వ్యవహారం కాదని తనకూ తెలుసు… అందుకే ఇప్పటికిప్పుడు గాలిలో మేడలు కట్టడం లేదు తను… రియలిస్టిక్ ఆలోచనల ధోరణితోనే వెళ్తున్నాడు… ఇప్పుడు ఆయన ఏం చెప్పినా సరే జనం అంత తేలికగా నమ్మరు… తనను కేసీయార్ వెళ్లగొట్టాడు కాబట్టి ఏవేవో చెబుతున్నాడులే, తనేమైనా తక్కువా..? అందరు టీఆర్ఎస్ నాయకుల్లాగే, అందుకే ఇన్నాళ్లూ ఏమీ మాట్లాడలేదు అనుకునేవాళ్లే ఎక్కువ ఉంటారు… అది జనసహజం… తన మీద వేటు పడకముందే ఈటల ఏదైనా బ్రేకప్ నిర్ణయం తీసుకుని, జనంలోకి వెళ్తే ఆ కథ వేరే ఉండేది… (ఈటల ఎపిసోడ్ ఎటు వైపు వెళ్తున్నా సరే… టీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాల బాగోతాలపై, కేసీయార్ సృష్టించిన నయా సంస్థానాలపై, నయా జమీందార్లపై తెలంగాణలో విస్తృతచర్చ రావడం ఒక గుడ్ సైడ్ ఎఫెక్ట్…)
Ads
తనకు తెలుసు… కేసీయార్‌తో ఒకసారి చెడిపోతే మళ్లీ అతకదు… ఒకవేళ అవసరార్థం అతికినా అదీ నిలవదు… కేసీయార్‌కు ఒకరి మీద వైరాగ్యం వచ్చిందంటే ఇక దగ్గరకే రానివ్వడు… 2018 ఎన్నికల నుంచే ఈటల కేసీయార్ నడుమ సంబంధాలు బాగాలేవు… అది ఈటల మాటల ధోరణితో వచ్చిన దూరం కాదు, ఇంకేదో ఉంది… అదేమిటో కేసీయార్ చెప్పడు, ఈటల చెప్పడు… అసలు ఈటల గెలవడమే కేసీయార్‌కు ఇష్టం లేదు… తప్పనిసరై పార్టీ టికెట్టు ఇచ్చారే తప్ప, తను గెలవకుండా ఎన్నికల టైంలోనే ఇంటిపైన రైడ్స్ చేయించారనీ, ప్రత్యర్థికి ఆర్థికసాయం చేశారనీ ఈటల మనస్సులో ఉన్నదే… తరువాత కూడా అనేక సందర్భాల్లో హ్యుమిలియేట్ చేశారు, ఇక కొద్దిరోజులుగా ఈటల గురించిన ఆస్తులు, ఇతర సమాచారం సేకరిస్తున్నారని తెలిశాక, ఈ వేటు పడుతుందని అంచనా వేస్తున్నదే… పక్కా స్క్రిప్టు ప్రకారం బదనాం చేయడం, వేటు వేయడం చకచకా జరిగిపోయాయి… అయితే ఇక అయిపోయినట్టేనా..? కాదు అనేదే ఈటల అంచనా… ఇప్పుడు కేవలం అసైన్డ్ భూముల రచ్చను మాత్రమే తెరపైకి తీసుకొచ్చారు… కానీ ఇంకా వేటాడుతాడు కేసీయార్… ఆల్రెడీ దేవరయాంజాల్ భూముల వ్యవహారాన్ని తవ్వారు, నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాలు అవే… చెట్లు నరికివేయడం మీద వాల్టా చట్టంతోపాటు ఇంకా ఏమేం అంశాల్లో ఈటలను ఇక్కట్లపాలు చేయాలో ప్లాన్ ముందే రెడీ… ఈటల కూడా అన్నింటికీ సిద్ధమైపోయినట్టే కనిపిస్తోంది…!!
Share this Article