.
ఒక మనిషి మరణించాక… ఏం చేస్తాం..? ఖననం లేదా దహనం… లేదంటే ఏదైనా మెడికల్ కాలేజీకి బోధన అవసరాల కోసం అప్పగించడం రీసెంట్ ట్రెండ్… మరీ భీకర టెర్రరిస్టులయితే జలసమాధి… ఇవే కదా మనకు తెలిసింది…
తరువాత చితాభస్మాలను, అస్థికలను ఏ నదీప్రవాహంలోనో కలిపేసి శ్రద్ధాంజలి ఘటించడం హిందూ సంప్రదాయంలో ఉంది… కానీ సెలెస్టిస్ అనే ఓ టెక్సాస్ కేంద్రిత సంస్థ ఉంది… అది మనుషుల చితాభస్మాల్ని ఏకంగా అంతరిక్షంలోకి తీసుకుపోయి, కక్ష్యలో ప్రవేశపెడుతుంది…
Ads
- నిజమే… మరో రెండు మూడు సంస్థలూ ఉన్నాయి… అంటే అంతరిక్ష ఖననం… Space Burial… వింతగా ఉందా..? నవ్వొస్తుందా..? అక్కర్లేదు, ఎవరి నమ్మకాలు వాళ్లవి… ఆ ఖనన సంస్థలు భారీగానే వసూలు చేస్తాయి కూడా…
ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకంటే..? జర్మనీకి చెందిన ఒక ఎయిరోస్పేస్ స్టార్టప్ కంపెనీ టీఈసీ (The Exploration Company) మిషన్ పాజిబుల్ పేరిట ఓ స్పేస్ కేప్సూల్‌ను పంపించింది ఈమధ్య… దాని పేరు Nyx… బాగానే ప్రయోగించబడింది… నిర్ణీత ప్రోటోకాల్ మేరకు కక్ష్యను చేరింది…
రెండుసార్లు భూప్రదక్షిణం కూడా చేసింది… అందులో 166 మందికి చెందిన చితాభస్మం ఉంది… ప్లస్ గంజాయి విత్తనాలు కూడా..! తరువాత కమాండ్ కంట్రోల్‌కూ ఆ స్పేస్ కేప్సూల్‌కు నడుమ కనెక్షన్ తెగింది… అది వెళ్లి పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కడో కూలిపోయింది… ఆ అంతరిక్ష ఖననానికి ఉద్దేశించిన ఆ చితాభస్మాలు కాస్తా చివరకు జలసమాధి అయ్యాయి...
ఎక్కడో తప్పు జరిగింది… సగం విజయం సాధించాం, మరో సగం వైఫల్యం… సంబంధిత కుటుంబాలకు క్షమాపణలు అని సదరు కంపెనీ తమ వెబ్‌సైటులో, లింక్డ్ ఇన్‌లో సారీ చెప్పింది… అయితే ఇక్కడ మరో ప్రశ్న… గంజాయి విత్తనాలు దేనికి..?
స్పేస్‌లో అవి మొలకెత్తుతాయా అని పరిశోధించడానికి అట… నిజమే, దాన్ని ప్రయోగించిన కంపెనీయే చెబుతోంది… మరి గంజాయి మీదే ఎందుకు ఆ పరిశోధనలు అంటారా..? రేప్పొద్దున మానవుడు అంగారక గ్రహం మీద అడ్డా వేస్తే అక్కడ గంజాయి మొలకెత్తుతుందా లేదా తెలుసుకోవడానికి అట… ఇప్పుడు నవ్వండి మనసారా..!! గంజాయా మజాకా..?!
Share this Article