ఇంతకీ ఎవరు గెలిచారు..? ఎవరు ఓడిపోయారు..? ఈ ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి..? మోడీకి కర్రు కాల్చి వాతలు పెట్టాయా..? లేదు… అసలే కాదు, రెండుమూడు సీట్లున్న బెంగాల్లో ఈరోజు హోరాహోరీ ఫైట్ దాకా వచ్చారు… లెఫ్ట్, కాంగ్రెస్‌లను నిండా తొక్కేశారు… చివరకు నందిగ్రాంలో మమతకు చివరిదాకా చుక్కలు చూపించారు, ఆమెకు నవ్వాలో ఏడవాలో తెలియని దురవస్థ… అస్సాంలో నిలిచారు… కేరళలో పాదం మోపారు… స్థూలంగా బీజేపీ హేపీయే… కాకపోతే ఆశించినంత స్వీటు దక్కలేదు, అంతే… ఐతే నంబర్ వన్, లేదంటే నంబర్ టూ అనే సూత్రంతో వెళ్తున్న బీజేపీకి ఫలితాలు ఆ దిశలో ఆశాజనకమే… ప్రత్యేకించి అది కోరుకునే కాంగ్రెస్ ముక్త భారత్ దిశలో అడుగులు బలంగానే పడుతున్నయ్…
ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్తు, జనం జాతీయ పార్టీలను నమ్మడం లేదు అంటారా..? నో, నో… అస్సాంలో గెలిచింది ఎవరు..? గెలిచింది బీజేపీ, నిలిచింది కాంగ్రెస్… కేరళలో గెలిచింది లెఫ్ట్, నిలిచింది కాంగ్రెస్… బెంగాల్లో నిలిచింది బీజేపీ… సో, ప్రాంతీయ పార్టీలను ప్రజలు భుజాన మోశారు అనేది అబ్సర్డ్ కామెంట్… సరే, సరే… తిరుపతిలో వైసీపీ, సాగర్‌లో టీఆర్ఎస్, బెంగాల్లో మమత, కేరళలలో లెఫ్ట్, అస్సాంలో బీజేపీ… అంటే అధికారంలో ఉన్నవాళ్లకే ప్రజలు జేజేలు కొట్టారా… నో, నో… అదీ తప్పే… తమిళనాడులో తన్ని తరిమేశారుగా అన్నాడీఎంకేను…
Ads
అబ్బా… మరింకేం అంటవ్… సిద్ధాంతబలమున్న వాళ్లనే గెలిపించారు అంటావా..? అది అస్సలు సరికాదు… ఉదాహరణకు బెంగాల్… మమతకు ఓ నిర్దిష్ట సిద్ధాంతం, రాద్ధాంతం ఏమీ ఉండవు… కర్రబలమే ఆమె నమ్ముకున్నది… ఈసారి అది గాకుండా ప్రశాంత్ కిషోర్ అనే బుర్రను అరువు తెచ్చుకుంది, సోషల్ దందాకు తెరతీసింది… లెఫ్టో, రైటో సిద్ధాంతమున్న సీపీఎం, బీజేపీ దెబ్బతిన్నాయి… ఇంకెక్కడి సిద్ధాంతాలు..?
అవును కదా, ప్రశాంత్ కిషోర్ గెలిచాడా..? ఇదొక కొత్త ధోరణి… రాజకీయ పార్టీలు, వాటి సిద్ధాంతాలు జాన్తా నై… ఎవరు మాయామర్మాలతో జనం కళ్లకు గంతలు కట్టగలరో, భ్రమల్లో ముంచెత్తగలరో, తాత్కాలికంగా జనం విచక్షణను మాయం చేయగలరో వాళ్లదే గెలుపు అనే భావన పెరుగుతోంది… తమిళనాట స్టాలిన్ గెలుపుకూ, బెంగాల్లో మమత గెలుపుకూ ఇదే కారణమట… ఇదొక విపరీత పరిణామం… ఏమో, రేప్పొద్దున పంజాబ్‌లో మళ్లీ అమరీందర్, తెలంగాణలో షర్మిల కూడా అంతేనా..? ఏమో మరి… జగన్‌ను గెలిపించాడు, ఉద్దవ్ ఠాక్రేను గెలిపించాడు… మరి యూపీలో ఎందుకు చతికిలపడ్డాడు అంటారా..? అదే మరి చెప్పేది, పీకే అల్టిమేట్ ఏమీ కాదు… యాదృచ్ఛికం మాత్రమే… మొత్తానికి వోటరు ఒక దిశలో ఏమీ స్పందించలేదు… పారడాక్స్ మ్యాండేట్…
లెఫ్ట్ బెంగాల్లో మట్టిగొట్టుకుపోయింది… ఇక అది లేవదు… కానీ కేరళలో నిలిచింది… అంటే జనం ఒక పార్టీని గుడ్డిగా నమ్మే స్థితి లేదు… ఎటొచ్చీ ఒక శుభపరిణామం ఏమిటంటే..? కమల్‌హాసన్ వంటి టైంపాస్ పల్లీ బఠానీ పార్టీలను తన్ని బంగాళాఖాతంలోకి పారేశారు… ఒక అశుభపరిణామం ఏమిటంటే..? కాంగ్రెస్ మరీ మట్టిగొట్టుకుపోవడం… అస్సాం, కేరళ కూడా దెబ్బతీశాయి… రాహుల్ నాయకత్వం పనికిరాదు అని తేల్చేశాయి… కానీ ఆ పార్టీ నిలబడాలి, బీజేపీకి ఓ బలమైన ప్రతిపక్షం అవసరం… ఆ నాయకుడు మారితే బెటరేమో… లేదా నాయకుడినే మార్చేస్తే బెటరేమో… ఈ ఎన్నికలు ఏ అస్పష్టత లేకుండా తేల్చిన విషయం ఏమిటీ అంటే..? రాహుల్ వద్దు… ఆ వారసత్వమూ వద్దు… ఇక మిగతా విశ్లేషణలన్నీ సో, సో…!!
Share this Article