.
Mohammed Rafee
…… నగర జీవితాలే… మెట్రో… ఇన్ దినో – చూడాల్సిన సినిమా
అప్పుడెప్పుడో 2007లో లైఫ్ ఇన్ ఎ మెట్రో సినిమా వచ్చింది! ఆ సినిమా సీక్వెల్ “మెట్రో ఇన్ దినో” జూలై 4న విడుదలైంది! రాత్రి చూశాను! చూడాల్సిన సినిమా ఇది! దర్శకుడు అనురాగ్ బసు ఇలాంటి మెట్రో జీవితాలను సినిమాగా మలచడంలో మాస్టరే!
Ads
నాలుగు మెట్రో నగరాల్లో ఒక్కో జీవితాన్ని తీసుకుని, నాలుగు వేరు వేరు కథలను విడిపోకుండా ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసి ప్రేక్షకులను కూర్చోబెట్టడం అందరికి సాధ్యం కాదు! అది అనురాగ్ బసు ప్రత్యేకత! మ్యూజిక్ అందించిన ప్రీతం కృషి కూడా ఉండనే ఉంది! లిల్టింగ్ సౌండ్ ట్రాక్ ను వ్యాఖ్యాతగా ఉపయోగించి సినిమాను నడిపించిన ప్రయోగం బావుంది!
ముంబయి, కోల్ కతా, ఢిల్లీ, పూణే మెట్రో నగరాల్లోని ఒక్కో ఫ్యామిలీని ఒక్కో కథగా మలచి నాలుగు జీవితాలను కళ్లకు కట్టించారు! మెట్రో నగరాల్లో జీవితాలు ఆధునిక మార్పులతో ఎలాంటి ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నారో, ప్రేమలు అనుబంధాలకు ఎలా అల్లాడిపోతున్నారో, కన్ఫ్యూషన్ కుటుంబ జీవితాలతో ఎలా అయోమయానికి గురవుతున్నారో, ఆకర్షణలతో ఎలా జీవితాలను పోగొట్టుకుంటున్నారో…. పెద్ద తరం నుంచి స్కూల్ తరం వరకు వివిధ జంటల వాస్తవ జీవితాలను తెరకెక్కించడంలో అనురాగ్ బసు సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు!
టీనేజ్ లో రెసిడెన్షియల్ స్కూల్స్ లో పెరిగే పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు అమ్మాయిల వైపు ఆకర్షితులవుతున్నారో, అబ్బాయిల వైపు మళ్లుతున్నారో తెలియని అయోమయ జీవితం! కాలేజ్ రోజుల్లో ఇష్టపడిన అబ్బాయిని కాకుండా తలిదండ్రుల మాట, పరువు కోసం ఎవరినో వివాహం చేసుకుని కుటుంబానికి అంకితమైపోయి చివరకు రీ యూనియన్ పేరిట పాత అనుబంధాలను పెంచుకునే ఇంకో జీవితం!
ఎన్నో ఆశలతో పెళ్ళి చేసుకుంటే భర్త పట్టించుకోకుండా తన కెరీర్ కోసం పాకులాడుతూ చిన్న చిన్న ఆనందాలను కూడా దూరం చేసుకునే మరో జీవితం! పెళ్ళి చేసుకుని మనసులు కలవని భర్తతో కాకుండా తన భావాలకు నచ్చిన వ్యక్తిని ప్రేమించడం, పెళ్ళి చేసుకోవాలా వద్దా అంటూ తడబడే ఇంకో జీవితం!
ఇంట్లోనే వుంటూ ఒకరికొకరు చాటింగ్ చేసుకుంటూ మోసగించుకునే జీవితం! భర్త మరొకరితో అనుబంధం పెంచుకున్నాడు కాబట్టి అదే తప్పు తను కూడా చేసి కక్ష సాధించే భార్య జీవితం!
విడో కోడలు జీవితాన్ని నిలబెట్టేందుకు మామ గారు చిన్ననాటి స్నేహితురాలితో కలసి ఆడిన మెలో డ్రామా… ఇలా అనేక జీవితాలే మెట్రో 2! మెట్రో నగరాల్లో ఇలాంటి జీవితాలు సర్వ సాధారణంగా మారిపోయాయి! ఆ జీవితాలే ఈ సినిమా! అయితే ప్రతి జంటలోనూ మహిళలే బాధితులు అనే వాస్తవాన్ని చూపించడం ఈ సినిమాకు జీవం! సమాజంలో వున్నది అదే వాస్తవం!
సారా అలీఖాన్ నటించిన సినిమాల్లో ఇదే బెస్ట్ అని చెప్పుకోవాలి! అనుపమ్ ఖేర్, నీనా గుప్తా, కొంకణ్ సేన్, ఆదిత్య రాయ్ కపూర్, పంకజ్ త్రిపాఠీ, అలీ ఫజల్, ఫాతిమా సనా షేక్, శశ్వత చటర్జీ ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు!
ప్రీతం ఖైసర్ జాఫ్రి ఖవ్వాలి నుంచి మెటల్ సంగీతం వరకు ముఖ్యంగా గిటార్ ట్యూన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ! నీలేష్ మిశ్రా కవిత్వం వెంటాడుతుంది! స్క్రీన్ ప్లే అద్భుతం అనే చెప్పాలి! అనురాగ్ బసు మంచి సినిమా అందించారు!
లైఫ్ వున్న సినిమా ఇది! ఇంటర్వెల్ వరకు సూపర్ గా ఉంది! ఆ తరువాత మన ప్రేక్షకుల మనస్తత్వానికి తగ్గట్లు సుఖంగా శుభం కార్డు వేయడం కోసం కొంత సాగదీత అనిపిస్తుంది! అయినా చూడొచ్చు! … – డా. మహ్మద్ రఫీ
Share this Article