.
ఆంధ్రా మీడియా..! ఈ పదం మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తోంది… కాదు, తీసుకొస్తున్నారు… రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ సెంటిమెంటును రగిలించే ఓ ప్రయత్నం… తీసుకొస్తున్నది బీఆర్ఎస్ పార్టీ…
మహా న్యూస్ అనబడే ఓ పరమ నాసిరకం చానెల్ కేటీయార్‌పై చేసిన తిక్క వ్యాఖ్యలు, ప్రసారం చేసిన చెత్త వార్తలు దీనికి ఊపిరి పోశాయి… ఓ మాజీ మంత్రి బరాబర్ దాడులు చేస్తం, మరో రెండు మీడియా సంస్థలూ మా నోటీసులో ఉన్నయ్ అంటాడు…
ఇంకొకాయన తెలంగాణ జ్యోతి పేరెందుకు పెట్టుకోలేదు, మా యాడ్స్ అన్నీ ఆంధ్రా మీడియాకు ఎందుకివ్వాలి అనడుగుతాడు… తప్పేముంది..? తప్పుడు రాతలకు శిక్షిస్తే తప్పేముంది అంటుంది ఆ వర్గం మీడియా మేధోజర్నలిస్టుల వర్గం…
Ads
సర్, మన అధికారంలోకి రాగానే ఆంధ్రజ్యోతి పని పట్టాలి అని ఫ్యాన్స్ కేటీయార్‌కు లేఖ రాసినట్టు ఓ వార్త క్రియేటవుతుంది… నమస్తే తెలంగాణ అయితే ఏకంగా ‘ప్యాంటు తడిసిపోతుంది ఎందుకు?’ అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను ప్రశ్నిస్తూ సుదీర్ఘంగా ఓ వ్యాసం పబ్లిష్ చేసింది, దాని పక్కనే మరో స్టోరీ సేమ్ యాంగిల్…
మొన్న కొత్త పలుకులో ‘తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా’ అని ప్రశ్నించాడు కదా రాధాకృష్ణ… అంతేకాదు, కేసీయార్ గురించి నాకు చెబుతున్నారా? ఆయ్ఁ అంటున్నాడు తను…
సరే… ఆంధ్రజ్యోతి వర్సెస్ నమస్తే… జ్యోతి వర్సెస్ సాక్షి, ఈనాడు వర్సెస్ సాక్షి… ఏనాటి నుంచో ఉన్న కీచులాటలే… అన్నీ పార్టీల పత్రికలే అయిపోతున్న దుర్దినాల్లో ఇవన్నీ సహజమే… ఇప్పుడవి వ్యాపించి మంటలు రేగుతున్నాయి… ఇక్కడ ఓ ఫోటోను గుర్తుచేసుకుందాం…
కొండగట్టు ప్రమాదం వంటి ఏ విపత్తు చోటుచేసుకున్నా ఇల్లు కదలని కేసీయార్ ఆంధ్రజ్యోతి ఆఫీసు తగులబడిపోయిందని వినగానే ఆగమేఘాల వెళ్లాడు, పరామర్శించాడు… అవసరమైన సాయం చేస్తాను బ్రదర్ అన్నాడు… అదీ వాళ్ల నడుమ బంధం… అప్పట్లో ఏరాపోరా అనుకునేంత చనువు, మంచి దోస్తీ, సాన్నిహిత్యం…
ఐనాసరే, ఎక్కడ చెడిందో ఏమిటో గానీ… ఆంధ్రజ్యోతి ప్రభుత్వ ప్రకటనలు ఆగిపోయాయి… ఇప్పుడిక ఏకంగా తెలంగాణ వ్యతిరేక ముద్ర వేసేస్తున్నారు… ఆంధ్రజ్యోతి ఆఫీసు మీద దాడులు జరిగే అవకాశం ఉందనే నిఘా సమాచారంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు…
మరి అంతటి పక్కా తెలంగాణ ద్రోహ పత్రికను అధికారంలో ఉన్న పదేళ్లూ ఎందుకు ఉపేక్షించారు..? చంద్రబాబును అర్జెంటుగా తెలంగాణ నుంచి తరిమేసే దిశలో అంత సీరియస్ ఎఫర్ట్స్ పెట్టిన కేసీయార్ రాధాకృష్ణను ఎందుకు కట్టడి చేయలేదు..? ఇప్పుడే తను తెలంగాణ ద్రోహిగా కనిపిస్తున్నాడా..? తగులబడిన ఆంధ్రజ్యోతి ఆఫీసుకు పరుగు తీసినప్పుడు రాధాకృష్ణ తెలంగాణ ద్రోహిత్వం గుర్తుకు రాలేదా..?
ఇక్కడ బతికేవాళ్లంతా తెలంగాణవాళ్లే… ఆంధ్రుల కాలిలో ముల్లు దిగితో పంటితో తీస్తా అనే ధోరణి కదా తనది…, అంతటి తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఒక్క ఆంధ్రా ఆస్తి మీద చిన్న రాయి కూడా పడలేదు కదా, మరి ఇప్పుడేంటి ఇలా..? సరే, ఇవన్నీ వదిలేస్తే బండి సంజయ్ ది మరో వింత ధోరణి…
ఆంధ్రజ్యోతి ఆఫీసు వద్దకు వెళ్లిన బీజేవైఎం కార్యకర్తలు మద్దతు ప్రకటించారు… అవసరమైతే బీఆర్ఎస్ దాడుల నుంచి రక్షణగా ఉంటామంటున్నారు… ఏబీఎన్ మీద దాడి జరిగితే టీన్యూస్ మీద దాడి చేస్తామని బండి సంజయ్ అంటున్నాడు… ఫాఫం, తను ఈ దేశ హోం సహాయ మంత్రి అని మరిచిపోయినట్టున్నాడు... మీడియాకు రక్షణ తన బాధ్యత, తనే దాడులు చేస్తానంటాడేమిటో..? సార్, కరీంనగర్ నుంచి బయటికి రండి సార్...
ఐనా రేవంత్ రెడ్డికి సపోర్టుగా ఉంటున్నాడని కాంగ్రెస్ వాళ్లు అభిమానంతో ఆంధ్రజ్యోతి రక్షణకు సిద్ధపడతారని అనుకుంటే అనూహ్యంగా బీజేపీ నుంచి మద్దతు ఏమిటో… ఇంట్రస్టింగు… ఆంధ్రజ్యోతి మీద ఈ గాఢ ప్రేమ ఏమిటో అంతుపట్టదు…
ఏపీలో టీడీపీతో బీజేపీ దోస్తీ… టీడీపీ అంటే ఆంధ్రజ్యోతి, అందుకేనా ఈ సపోర్టు… లేక తెలంగాణలోనూ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి రాజకీయాలు స్టార్ట్ చేయబోతున్న సంకేతాలా..? ఆ కూటమికి ముందే బ్రేకులు వేయాలని బీఆర్ఎస్ ఆంధ్రా మీడియా అని హడావుడి చేస్తోంది కాబట్టి తాము కూడా ముందే అడ్డుకునే ఆలోచనా..?
- జస్ట్, ఇవి మీడియా సంస్థల మీద దాడులు అనే కోణంలో ఆగిపోవడం లేదు… ఈ మొత్తం పంచాయితీల అసలు మర్మాలు వేరు… ఒక్కొక్కటే అవే బయటపడతాయి, చూస్తూ ఉండండి..!! చివరగా, ఈ కేంద్ర మంత్రివర్యులు సాక్షి ఆఫీసులపై టీడీపీ శ్రేణుల దాడుల్ని కనీసం ఖండించాడా..?! అన్నీ రాజకీయ సమీకరణాలకు లోబడే సంభవిస్తూ ఉంటాయి, స్పందనలైనా, ఖండనలైనా, ఏవైనా..!!
Share this Article