.
నరేంద్రుడి వారసుడు దేవేంద్రుడే..! – 2029లో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ ..!? – 2014 వ్యూహానికే ఆర్ఎస్ఎస్ మొగ్గు …! ( వడ్డాది శ్రీనివాస్
)
——————————————-
“రాజకీయాల నుంచి ఇక రిటైర్ అవుతాను ” అన్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటన ఓ విషయాన్ని స్పష్టం చేసింది. బీజేపీలో రెండో తరం రాజకీయ యవనిక మీద నుంచి వైదొలగడానికి సిద్ధ పడిందని..!
బీజేపీ మొదటి తరం అటల్ బిహారీ వాజ్ పేయి, ఎల్ కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి తదితరుల తరం ఇప్పటికే రాజకీయాల నుంచి నిష్క్రమించింది.
Ads
రెండో తరం అయిన నరేంద్ర మోదీ, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కారీ, శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు ఇప్పటికే 70 ఏళ్ళ వయసు పైబడ్డారు. బీజేపీ సైద్ధాంతిక అధిస్థానం ఆర్ ఎస్ ఎస్ విధాన నిర్ణయం ప్రకారం 70 ఏళ్ళు దాటిన నేతలు వానప్రస్తం స్వీకరించాలి.
2029 ఎన్నికల్లో కొత్త తరాన్ని తెరపైకి తేవాల్సిన తరుణం ఆసన్నమైంది కూడా. 2001 లో గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోదీ 2014 వరకూ ఓటమి ఎరుగని సీఎం గా కొనసాగి… జాతీయ రాజకీయాల్లోకి వచ్చి అప్పటి నుంచి అప్రతిహతంగా ప్రధాన మంత్రిగా కొనసాగుతున్నారు. మోదీ ప్రస్తుత వయసు 74 ఏళ్లు. 2029 నాటికి 78 ఏళ్ళు అవుతాయి.
అంటే 2029 ఎన్నికల్లో ఆయన బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉండే అవకాశాలు దాదాపు శూన్యం.. మోదీ కూడా ఓటమి ఎరుగని పాలకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించాలి అని భావిస్తారు. అప్పటికి వరుసగా 15 ఏళ్ళు ప్రధాన మంత్రి పదవిలో ఉన్నట్టు అవుతుంది. దాంతో ఆయనపై సహజంగానే వ్యతిరేకత కూడా పెరుగుతుందనేది ఆర్ ఎస్ ఎస్ కు తెలియని విషయం కాదు.
2024 ఎన్నికల్లోనే అది కొంత బయట పడింది. ఇక మోదీని 2029 ఎన్నికల్లో ప్రధాన మంత్రి అభ్యర్థిగా కొనసాగించడం రాజకీయ కోణంలో అంత సరైన నిర్ణయం అవ్వదు. అటు మోదీ గౌరవంగా ఇటు బీజేపీ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఉభయ తారకంగా కొత్త నేతను ప్రధాన మంత్రి అభర్థిగా ప్రకటించడం తెలివైన వ్యూహం అవుతుంది. దాంతో ఫ్రెష్ ఫేస్ తో ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్ళవచ్చు.
2014 వ్యూహమే 2029లో...!
———————————————
మోదీ రాజకీయ సన్యాసం అన్నది ఖాయం అయితే… 2029 ఎన్నికల్లో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు…!? ఎన్నికల ముందే ప్రధాన మంత్రి అభ్యర్థిని ప్రకటించాలి అనే నిబంధన ఏమీ లేదు. కానీ ముందుగానే ప్రధాన మంత్రి అభ్యర్థిని ప్రకటించడాన్ని 1996 ఎన్నికల నుంచీ బీజేపీ ఓ రాజకీయ వ్యూహంగా చేసుకుంది.
ఎక్కువసార్లు అందులో ఆ వ్యూహం ఫలించింది. 2014 నుంచి ఐతే తిరుగు లేని వ్యూహంగా గెలుపు తెచ్చి పెడుతోంది. కాబట్టి 2029లో అందుకు భిన్నంగా వ్యవహరించే అవకాశాలు దాదాపుగా లేవు.
వయోభారం కారణంగానే మోదీ రాజకీయ సన్యాసం ప్రకటిస్తే… బీజేపీ రెండో తరం నేతలు అందరికీ అదే సూత్రం వర్తిస్తుంది.
అందుకే అమిత్ షా ముందుగానే తన రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయనకు ప్రస్తుతం 60 ఏళ్లు. 2029 నాటికి 64 ఏళ్లకు చేరుకుంటారు. అయినా మోదీ ఉంటేనే అమిత్ షా బలం. మోదీ లేకుండా ఆయన బలవంతుడు కాదు. ఆమోదనీయుడు కాదు.. వరుసగా మరో గుజరాతీ నేతను ప్రధానమంత్రి అభ్యర్థిగా చేయడానికి ఆర్ ఎస్ ఎస్ సమ్మతించదు కూడా..
సీనియర్ నేత, అందరికీ ఆమోదనీయుడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఉన్నారు. ఆయన కూడా 70 + వయసు కేటగిరిలోకే వస్తారు. 2029లో ప్రధాన మంత్రి పదవి ఎలానూ దక్కదు కాబట్టి అంతకు ముందుగానే 2027 లో రాష్ట్రపతి పదవిని ఆయన ఆశించవచ్చు.
మరో సీనియర్ నేత, ఆర్ ఎస్ ఎస్ కు అత్యంత సన్నిహితుడు నితిన్ గడ్కరీ కూడా వయోభారంతో పాటు ఆరోగ్య సమస్యలు అడ్డంకి. మోదీ సమకాలికుడు, మూడు సార్లు మధ్య ప్రదేశ్ సీఎంగా చేసి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా వయసు పైబడింది. కాబట్టి బీజేపీ రెండో తరం నేతలు ఎవరూ 2029 ఎన్నికల్లో ప్రధాన మంత్రి అభ్యర్థి కాలేరు.
రాబోయే 20 ఏళ్ల పాటు బీజేపీకి బలమైన నాయకత్వం ఉండేలా చూడాలి అన్నది ఆర్ ఎస్ ఎస్ దీర్ఘ కాలిక వ్యూహం. అదే ఆలోచనతో ఎల్ కే అడ్వాణీని పక్కనపెట్టి 2014, లో మోదీని ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తెచ్చింది.. ఆ ఎత్తుగడ ఫలించింది కూడా. విజయవంతమైన అదే వ్యూహాన్ని 2029 ఎన్నికల్లో కూడా అనుసరించే అవకాశాలు ఉన్నాయి. అంటే 50+ వయసు కేటగిరిలో ఉన్న నేతకే ఆర్ ఎస్ ఎస్ బొట్టు పెడుతుందన్నది సుస్పష్టం.
2029 బీజేపీ ప్రధాన మంత్రి అభర్థి ఎవరు...!?
—————————————————————+
ఆర్ ఎస్ ఎస్, బీజేపీ ముందు ప్రధానంగా మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.
బీజేపీ మూడో తరంలో వీళ్ళు ముగ్గురూ ప్రధానమైన నేతలు.
హిందుత్వ కోణమే ప్రధాన కొలబద్ద అయితే యోగి ఆదిత్య నాథ్ కు ఎక్కువ మార్కులు పడతాయి. కానీ పరిపాలనా దక్షత కోణంలో దేశ వ్యాప్తంగా ఆయనకు ఆమోదనీయత తక్కువే. బీజేపీకి ప్రధాన ఓటు బ్యాంకు అయిన మధ్య తరగతి వర్గాలు, ఆధునిక భావాలు ఉన్న యువతరం యోగి పట్ల అంత సానుకూలత చూపదు…
కార్పొరేట్, పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు కూడా అంత సుముఖంగా ఉండవు. సన్యాసం స్వీకరించిన రాజకీయ నేత ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకూ నెగ్గుకు రావచ్చు గానీ దేశ ప్రధాన మంత్రి పదవికి ఎంపిక చేయాలి అంటే ఇమేజ్ పరంగా ప్రతికూలమే. సంకీర్ణ ప్రభుత్వం అనివార్యత ఏర్పడితే యోగి అభ్యర్థిత్వానికి మిత్రపక్షాల మద్దతు అంత సులభం కాదు..
రెండో చాయిస్… మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. నితిన్ గడ్కారీ తరువాత ఆర్ ఎస్ ఎస్ కు అత్యంత ఆప్తుడు. ఆర్ ఎస్ ఎస్ కేంద్ర స్థానం నాగపూర్ కు చెందిన ఫడ్నవీస్ ఆధునిక హిందుత్వవాది. ఒకప్పటి ప్రమోద్ మహాజన్, ప్రస్తుత మోదీ తరహాలో కార్పొరేట్ శైలి హిందుత్వానికి ప్రతీక.
దేశంలో మధ్య తరగతి వర్గాలు, ఆధునిక యువతరాన్ని ఆకట్టుకునే వ్యవహార శైలి ఆయనది. ఫడ్నవీస్ రాజకీయ ఎత్తులు పైఎత్తులు తెలిసినవాడు. మరోవైపు పరిపాలనా దక్షుడుగా కూడా గుర్తింపు పొందిన నేత. 2014 లో మోదీకి సానుకూలంగా ఉన్న అంశాలన్నీ ప్రస్తుతం ఫడ్నవీస్ కూ ఉన్నాయి.
బీజేపీ అంటే గిట్టని వర్గాల్లో మోదీ పట్ల ఉన్నంత తీవ్ర వ్యతిరేకత ఫడ్నవీస్ పట్ల ఉండదు అనేది అదనపు బలం. ప్రస్తుతం 54 ఏళ్ల వయసు ఉన్న ఫడ్నవీస్ కు 2029 నాటికి 58 ఏళ్ళు వస్తాయి. 60 ఏళ్ల లోపే ఉండే ఆయన బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి గా ఎంపిక అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..
ఇక మూడో చాయిస్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఒడిశాకు చెందిన సీనియర్ నేత.. బలమైన ఆర్ ఎస్ ఎస్ నేపథ్యం ఉన్న ఆయనకు కేంద్ర మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉంది. కాకపోతే జనాదరణ కోణంలో ధర్మేంద్ర ప్రధాన్ కు ఎక్కువ మార్కులు పడవు. ఒడిశాలో 2024లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆయనను ముఖ్యమంత్రిగా చేయలేదు. అటువంటిది ప్రధాన మంత్రి అభ్యర్థిగా ధర్మేంద్ర ప్రధాన్ పేరును ఆర్ ఎస్ ఎస్, బీజేపీ ఎంత వరకు పరిశీలిస్తాయో సందేహమే..
2027 వరకూ ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్మూ రాష్ట్రపతిగా ఉంటారు.. ఇక 2029 లో అదే రాష్ట్రానికి చెందిన ధర్మేంద్ర ప్రధాన్ ను బీజేపీ ప్రధాన మంత్రి అభర్థిగా ప్రకటించే అవకాశాలు తక్కువే. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు కావచ్చు గానీ ప్రధాన మంత్రి అభ్యర్థి అయ్యే అవకాశాలు పెద్దగా లేవనే చెప్పాలి. అస్సోం సీఎం హిమంత విశ్వ శర్మకు ఆర్ఎస్ఎస్ మూలాల్లేవు.
ఈ సమీకరణాల నేపథ్యంలో బీజేపీ దీర్ఘ కాలిక రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా దేవేంద్ర ఫడ్నవీస్ ను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఆర్ ఎస్ ఎస్ నిర్ణయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది దసరా పండుగ నాటికి వందేళ్ళు పూర్తి చేసుకోబోతున్న ఆర్ ఎస్ ఎస్ బీజేపీ కొత్త ప్రధాన మంత్రి అభ్యర్థి ఎంపిక దిశగా ఎప్పుడు కార్యాచరణకు ఉపక్రమిస్తుందో చూడాలి.
ప్రధాన మంత్రి అభ్యర్థి ప్రకటనకు మరో మూడేళ్ల సమయం ఉంది. అంతలో సమీకరణల్లో ఏమైనా మార్పులు చోటు చేసుకోవచ్చు. మరికొన్ని పేర్లు చర్చలోకి రావచ్చు. అనూహ్య పరిణామాలకూ దారి తీయవచ్చు. ఏది ఏమైనా నాగ్ పూర్ నుంచి బీజేపీ సైద్ధాంతిక అధిష్టానం ఆర్ ఎస్ ఎస్ చెప్పే మాటే బీజేపీకి శిరోధార్యం అన్నది బహిరంగ రహస్యమే కదా… – వడ్డాది శ్రీనివాస్
Share this Article