.
తెలుగు ప్రేక్షకులూ డబ్బు రెడీ చేసుకొండి… అఫ్‌కోర్స్, పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా… నెలరోజుల్లో వెండి తెర మీద ఓ భారీ గేమ్ మొదలు కాబోతోంది… కనీసం 700 కోట్లు కావాలి… బీ రెడీ…
ఆ ప్రఖ్యాత, ప్రముఖ, ప్రసిద్ధ దర్శకుడెవరో చెప్పాడు కదా… ఒక్కో సినిమాకు, అదీ అత్యవసర వినోదానికి ఆఫ్టరాల్ ఓ 2000 ఖర్చు పెట్టలేరా అని అడిగాడు కదా సీరియస్‌గానే… ఆలోచించుకొండి, ఒక్కో కుటుంబానికి నెల రోజుల్లో మొత్తం ఎన్ని వేల రూపాయలు కావాలో…
Ads
ఎస్… బహు పరాక్… ప్రేక్షకుల నుంచి అక్షరాలా 700 కోట్లు కొల్లగొట్టాలని టాలీవుడ్ దండయాత్ర చేయడానికి రెడీగా ఉంది… రాబోయే నెల రోజులు మొత్తం పెద్ద సినిమాల జాతర.., ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాలు రావాలంటే కనీసం 500- 600 కోట్లు కలెక్షన్స్ రావాలి… కనీసం…
పవన్ కల్యాణ్ చాన్నాళ్ల తరువాత తెరపైకి ఈనెల 24న వస్తున్నాడు… పేరు హరిహర వీరమల్లు – 150- 160 కోట్లు… ఎస్, చాన్నాళ్ల తరువాత విజయ్ దేవరకొండ వస్తున్నాడు… పేరు కింగ్డమ్ – 90- 100 కోట్లు…, హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీయార్ మల్టీ స్టారర్ మీద బోలెడు పాన్ ఇండియా ఆశలు… పేరు వార్- 2 – 180 – 200 కోట్లు… ఆగస్టు 14 రిలీజ్…
ఇక రజినీకాంత్ కూలీ గురించి చెప్పక్కర్లేదు… భారీ రేట్లకు అమ్ముతున్నారు బయ్యర్లకు… ఒక్క తెలుగు డిస్ట్రిబ్యూషనే 45 కోట్లు అని అంటున్నారు… తమిళనాట సరేసరి… సో, కనీసం 150 కోట్లు… వార్-2 తోపాటే ఆగస్టు 14 రిలీజ్… ఇవన్నీ బ్రేకీవన్ నంబర్లు… ఇంకా ఎక్కువే ఆశిస్తున్నారు నిర్మాతలు సహజంగానే… మధ్యలో మహేష్ బాబు అతడు సినిమా రీరిలీజ్… దీనిపైనా బాగానే ఆశలున్నాయి…
కానీ… నిజంగా జనం దగ్గర అంత డబ్బుందా..? కన్నప్పకు కాస్త మంచి టాక్ వచ్చినా సరే, భారీ తారాగణం ఉన్నా సరే… 50 కోట్ల దగ్గర కొట్టుకుంటోంది… వసూళ్లు భారీగా పడిపోయాయి… తమ్ముడు సంగతి డిజాస్టర్‌కన్నా ఎక్కువ… జస్ట్, ఉదాహరణల కోసం చెబుతున్నాను…
ఏ భాష తీసుకున్నా సరే… 90 శాతం సినిమాలు బాక్సాఫీసు వద్ద తన్నేస్తున్నాయి… పెద్ద పెద్ద హీరోలవి కూడా…! ఆయా సినిమాల నాణ్యత మాటెలా ఉన్నా జనం దగ్గర డబ్బుల్లేవు… ఎక్కువ ఖర్చులు పెట్టుకుని థియేటర్ దాకా వచ్చి చూసే రోజులు కావు ఇవి… ఓటీటీల దెబ్బ, ప్రభావం కూడా బాగానే కనిపిస్తోంది… సో, పైన చెప్పిన పందెం కోళ్లలో ఏది గెలుస్తుందో, ఏది నిలుస్తుందో… ఎన్ని హిట్టవుతాయో తెలియదు… ఎన్ని ఢామ్మంటాయో తెలియదు…!!
కొన్నాళ్లుగా జనం టీవీల్లో సినిమాల్ని చూడటం లేదు… ఓటీటీల్లో చూస్తున్నారు… కానీ వాటి సబ్‌స్క్రిప్షన్ కూడా భారం అవుతుండే సరికి, మళ్లీ టీవీల ముందు కూర్చుని చూస్తున్నారా..? తండేల్ సినిమా టీవీ ప్రీమియర్ ప్రసారానికి 10.2 టీఆర్పీ రావడం ఈరోజుల్లో విశేషమే మరి… అదీ చైతన్య రేంజుకు..!!
Share this Article