.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అంటే ఏమో అనుకున్నాం సుమీ… మస్తు ఉషార్ పిట్ట… అనగా, చాలా బహుళ భారీ తెలివితేటలు ఉన్నవాడని అర్థం… అఫ్‌కోర్స్, తెలంగాణ బీజేపీ విభాగానికి అంతకుమించి ఉన్నాయి, అది వేరే విషయం…
విషయం ఏమిటంటే… శ్రీమాన్ మాధవ్‌జీ (గారు అంటే అమ్మ భాష… జీ అంటే పెద్దమ్మ భాషగా గమనించగలరు… మరో శ్రీమాన్ పవన్ కల్యాణ్ భాషాపరిజ్ఞానాల పాండిత్య పటుత్వాల సాక్షిగా…) నిన్నో మొన్నో ఓ వి‘చిత్ర’పటాన్ని ఇంకో శ్రీమాన్ లోకేష్ బాబుజీ గారికి ఇచ్చారు…
Ads
అందులో తెలంగాణ ఉనికి లేదు… ఏమిటయ్యా మహాశ్రీమాన్ మోడీజీ బాబు గారండోయ్, ఇదేమైనా మర్యాదా..? నువ్వు, మీ మాధవుడు కలిపి మా పోరాటాల్ని, మా ఉనికి, మా త్యాగాల్ని, మా ఎట్సెట్రా ఎట్సెట్రా అవమానిస్తున్నావ్ నువ్వు, వాటీజ్ దిస్ అని మరింకో శ్రీమాన్ కేటీయార్‌జీ గారు ట్వీటారు… అనగా తిట్టారు…
తెలంగాణ సమాజం కూడా కరెక్టే కదా, ఏపీ బీజేపీకి ఆమాత్రం తెలివిజ్ఞానపాండిత్యమర్యాదలు ఏమీ తెలియవా ఫాఫం అని నొచ్చుకుంది… ఐనాప్పటికినీ మాధవ్ కిక్కుమనలేదు, పట్టించుకోలేదు… పట్టించుకుంటే, సున్నితంగా ఫీలైతే ఏపీలో బీజేపీ పగ్గాలకు అక్కరకు రారని ఓ నానుడి ఉందిలెండి…
పోనీ, అలా వదిలేశాడా..? లేదు… తెలంగాణ బీజేపీకి చీమ కుట్టినట్టయినా లేదు… ఫాఫం, బండి సంజయుడు లోలోపల మహాతీవ్ర బాధపడ్డాడేమో గానీ, బయటకు మాత్రం కిమ్మనలేదు… ఈలోపు సదరు ఏపీ మాధవుడు ఏం చేశాడు..? ఈసారి అదే అఖండ భారతావని చిత్రపటంలో తెలంగాణను ప్రత్యేకంగా గుర్తింపజేసి… అంటే రాత్రికిరాత్రి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చేసి.,. దాన్ని తీసుకొచ్చి తెలంగాణ బీజేపీ రాంచందర్రావుకు ఇచ్చి, చేతులు దులిపేసుకున్నాడు…
ఇప్పుడేమంటారోయ్ అన్నట్టు మొహం పెట్టాడు… ఫాఫం తెలంగాణ బీజేపీకి ఎప్పుడూ భోళాఅమాయకపుతెలివితక్కువతనం కదా… సంతోషపడింది… ఒరేయ్, ఎవడ్రా మా మాధవుడిని నిందిస్తున్నదీ అన్నట్టుగా… తనూ ఓ ట్వీట్ కొట్టింది తెలంగాణ సమాజం మొహాన… మరి సూపర్ ఎక్సట్రా బంపర్ బ్లాస్టింగ్ తెలివితేటలు కదా…
అది ఇలా ఉంది…
అఖండ భారతావని అమోఘ చరిత్రను అన్వయించే చిత్రపటంలో అభ్యంతరాలు వెతకడం అంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టే, కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టే…
ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ@MadhavBJP గారు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ
@N_RamchanderRao గారిని హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
భారత సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే ఓ చిత్రపటాన్ని అందజేసి తమ ఆప్యాయతను, సోదర భావాన్ని, తెలంగాణ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు…
చూశారా, మాధవుడికి ఫాఫం తెలంగాణ మీద అపారమైన అతి ఎక్కువ భారీ గౌరవం ఉందట… కానీ నిన్నటి అఖండ భారతావనిలో లేని తెలంగాణ ముక్క అంత అర్జెంటుగా ఎలా అతుక్కుంది మాస్టారూ… నిన్నటి తప్పుకు నేటి సవరణా..?
తెలంగాణను అతికించారుసరే, మళ్లీ మరి కోడిగుడ్డు ఈకలు, కొండను తవ్వి భాష ఎందుకు మాస్టారూ..? దీన్ని బామ్మ భాష అంటారా..? ఆంటీ భాష అంటారా..?
అసలు ఆ అఖండ భారతావని చిత్రపటం తీరే పెద్ద వివాదం, దాని జోలికి ఇక్కడ పోవడం లేదు గానీ… మరీ బీజేపీ కూడా ఇలా మారిపోయిందేమిటి మాస్టారా..? అబ్బో, మాధవుడు, రాంచంద్రుడి సాక్షిగా తెలుగు బీజేపీకి ఉజ్జల భీకర బీభత్స భవిష్యత్తు ఉన్నట్టే కనిపిస్తోంది సుమీ..!!
బీజేపీ భక్తపామర జనులకు ఓ చిక్కు ప్రశ్న… పర్ సపోజ్, ఇదే మాధవుడు, అదే రాంచంద్రుడు కలిసి మోడీ దగ్గరకు వెళ్లి, అక్కడా ఓ విచిత్ర పటాన్ని సమర్పించాలని అనుకున్నారు అనుకొండి… అందులో ఏపీ, తెలంగాణలు ఎలా ఉండును..? జవాబులు తెలిసీ చెప్పకపోయారో… తెలుసు కదా… భేతాళుడు మళ్లీ చెట్టెక్కుతాడు..!!
Share this Article