.
ప్రముఖులు ఎవరైనా మరణిస్తే … తమ జ్ఞాపకాల్ని షేర్ చేసుకుంటూ సంతాపం ప్రకటిస్తారు కొందరు… మరణించిన వ్యక్తి గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ సంతాప ప్రకటనలు జారీ చేస్తారు ఇంకొందరు… వీలైనంతవరకూ నెగెటివ్ ఇష్యూస్ పెద్దగా ప్రస్తావనకు రావు…
కోట శ్రీనివాసరావు నిస్పందేహంగా టాలీవుడ్ అందించిన గొప్ప నటుడు… నవ్వించాడు, ఏడిపించాడు, భయపెట్టాడు… అన్ని ఉద్వేగాలను పర్‌ఫెక్ట్‌గా ప్రదర్శించేవాడు… 750 సినిమాలు, సుదీర్ఘమైన కెరీర్… ఎవరెవరో పరభాష విలన్లను, కేరక్టర్ ఆర్టిస్టులను తెచ్చుకుంటున్నారే తప్ప, సొంత ఆర్టిస్టులను పట్టించుకోవడం లేదనే బాధ కూడా ఉండేది తనకు కొన్నాళ్లు…
Ads
ఆయన నటనకు పెద్ద ప్లస్ తన డిక్షన్.., తెలుగు పదాల ఉచ్చరణ తీరే సగం ఉద్వేగాన్ని పలికించేది… అది ఏ వేషమైనా సరే… కానీ ఈ సందర్భంగా ఓ చిన్న విషయమూ గుర్తుకు తెచ్చుకోవాలి, యాంటీ సెంటిమెంట్ అయినా సరే, అది బాధ కలిగించే సంగతి కాబట్టి… తను జీవితంలో ఎదుర్కొన్న పెద్ద అవమానం, తనను బాగా బాధపెట్టిన సందర్భం కాబట్టి…
ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక సూపర్ స్టార్ కృష్ణ, మండలాధీశుడు అనే సినిమా చేశారు. అందులో కోట శ్రీనివాస రావు ఎన్టీఆర్ ను అనుకరించే పాత్రలో నటించాడు, అందువల్ల ఎన్టీఆర్ అభిమానుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడట కోట శ్రీనివాసరావు.
ఆ మూవీ చేసిన కొన్ని రోజులకు కోట శ్రీనివాసరావు రాజమండ్రి షూటింగ్ కి వెళ్లగా అక్కడ వేరే షూటింగ్ నిమిత్తం బాలకృష్ణ కూడా వచ్చాడట. ఇద్దరూ ఒకే చోట బస చేయగా ఆయన లిఫ్ట్ లో పై నుంచి కిందకు వస్తుంటే తాను కింద నుంచి పైకి వెళ్ళేందుకు లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడ వాళ్ళందరూ కోట శ్రీనివాసరావుని తప్పుకోండి తప్పుకోండి అన్నారట.
ముందు ఆయనకు ఎందుకో అర్థం కాలేదట. అయితే బాలకృష్ణ లిఫ్ట్ లో నుంచి దిగుతుండగా చూసిన కోట శ్రీనివాసరావు బాలకృష్ణకి నమస్కారం పెడితే బాలకృష్ణ.. కోట శ్రీనివాసరావు ముఖం మీద కాండ్రించి ఉమ్మేసాడట.
ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఒక సూపర్ స్టార్ కొడుకు తన తండ్రిని తిడితే ఎలా ప్రవర్తిస్తాడో బాలకృష్ణ అలాగే ప్రవర్తించాడు అని కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడంటే తాను ఒక గొప్ప నటుడిని అని బాలకృష్ణ కూడా అంటున్నారనీ కానీ, ఒకప్పుడు మాత్రం ఇలా ఆయన చేతిలో అవమానం పొందానని కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
https://telugu.newsmeter.in/entertainment/kota-srinivasa-rao-about-balakrishna-behavior-682235
ఇందులో కొన్ని అంశాలు… సౌత్ ఇండస్ట్రీ హీరోలకు ఇండస్ట్రీలో మిగతా ఆర్టిస్టులు ఎలా అణిగిమణిగి ఉండాలో చెప్పే ఓ ఆధిపత్య వాతావరణం… నా బ్లడ్డు నా బ్రీడు అనే బాలకృష్ణ వంటి నటుల అహం… ఓ సీనియర్ నటుడిని కేవలం తన తండ్రిని పోలే ఓ కేరక్టర్ వేశాడని థూత్కరించడం, ఆ సీన్ ఊహిస్తేనే అదోలా ఉంటుంది…
కోట శ్రీనివాసరావు చేసిన తప్పేముంది..? తను ఆర్టిస్టు… తనకు వచ్చిన పాత్ర అది… ఐనా వార్త గానీ, విశ్లేషణ గానీ, కార్టూన్ గానీ, సినిమా గానీ… ఓ పొలిటికల్ సెటైర్ తప్పెలా అవుతుంది… అదీ అర్థం చేసుకునే స్థితి లేదు ఆనాడు… ఒక్కసారి ఆర్జీవీ చేసిన పొలిటికల్ సినిమాలు గుర్తుతెచ్చుకొండి…
ఆ పాత్ర చేస్తే అది ఎన్టీయార్ పట్ల గానీ, ఆ పార్టీ పట్ల గానీ ఆ పాత్రధారి ద్వేషంగా, వ్యక్తిగత ఉద్దేశంగా ఎలా పరిగణిస్తారు..? అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ అదేకాదు, మరికొన్ని సినిమాలూ తీశాడు ఎన్టీయార్ పాలన మీద సెటైర్లు, విమర్శలు… ఆ మండలాధీశుడు సినిమాలో రామోజీరావు పాత్ర కూడా ఉన్నట్టు గుర్తు… ఒక్క కోట మాత్రమే, అదీ ఎన్టీయార్ వేషం వేశాడు కాబట్టి టార్గెట్ అయ్యాడు… ఓ దశలో దాడి ప్రయత్నాలూ జరుగుతాయని తను భయపడ్డాడంటారు…
నిజం… కోట శ్రీనివాసరావు ఒక వర్గం తీవ్ర ద్వేషాన్ని, ఘోర అవమానాల్ని భరించాడు… ఆ రేంజ్ అవమానం ఎదుర్కొన్న మరో తెలుగు నటుడు లేడేమో, ఉండరేమో… నిందల్ని తుడిచేసుకుని, అలాగే స్థిరంగా ఇండస్ట్రీలో నిలబడ్డాడు… ఇప్పుడు ఆయన మృతదేహంపైన ఒక పూలగుచ్ఛం ఉంచి, మనస్పూర్తిగా నివాళి అర్పించాల్సిన తొలి వ్యక్తి బాలకృష్ణే…!!
Share this Article