.
Subramanyam Dogiparthi
…… కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్పవిలాపంతో , ఆ అత్యంత శ్రావ్యమైన పద్యంతో ప్రారంభం అవుతుంది సినిమా . ఆడపిల్ల బతుకు కూడా ఇంతే కదా అని హీరోయిన్ తండ్రి ఆవేదనతో మొదలయినా సినిమా విలాపంతో కాకుండా విప్లవంతో ముగుస్తుంది .
పుష్పవిలాపం కాస్తా పుష్పవిప్లవం అవుతుంది 1985 ఏప్రిల్లో విడుదలయిన ఈ మా పల్లెలో గోపాలుడు సినిమాలో . భర్త అంటే తాళి కట్టిన వాడు కాదు ; ప్రేమగా చూసుకునే వాడు మాత్రమే భర్త అనే సందేశంతో విప్లవాత్మక ముగింపుని ఇస్తుంది .
Ads
పట్నం నుండి కాలేజి అమ్మాయిలు బొటానికల్ టూరుకి గోదావరి లంకలకు వెళతారు . అక్కడ ఓ పడవ నడిపే పాతాళభైరవి తోటరాముడు వంటి కుర్రాడు ఆ ట్రూపులో ఉన్న హీరోయినుకి దగ్గర అవుతాడు . ఆ అమ్మాయి చనువును అపార్ధం చేసుకున్న హీరో ప్రేమించేస్తాడు .
హీరోయినుకి తండ్రి నిశ్చయించిన యువకుడితో వివాహం జరుగుతుంది . వివాహితగా వచ్చిన అమ్మాయి గారిని చూసి అవాక్కయిపోయి తేరుకుంటాడు . హీరోయిన్ భర్త అంగీకారంతో హీరోని పట్నం తీసుకుని పోయి ఇంట్లో పనికి పెట్టుకుంటుంది . హీరోయిన్ భర్త హీరోయిన్ని పెట్టే గృహహింసకు ఒళ్ళు మండిన హీరో భర్త గారికి దేహశుద్ధి చేస్తాడు .
తనకు చిట్టెమ్మకు అక్రమ సంబంధం ఆపాదించిన భర్త గారికి హీరో తాను ప్రేమించిన మాట నిజమే అని , చిట్టెమ్మకు అదేమీ తెలియదని ప్రకటిస్తాడు . హీరోయిన్ భర్తకు తలంటిపోసి హీరోతో వెళ్ళిపోతుంది . ఇది విప్లవాత్మక ముగింపు . సప్తపది ముగింపు . Of course , ముగింపుకు దారితీసిన కారణాలు , నేపధ్యాలు వేరనుకోండి .
హీరోగా బ్లాక్ బెల్ట్ కరాటే ఫైటర్ అర్జున్ కి హీరోగా ఇది మొదటి సినిమా . వీరోచితంగా నటించాడు . ప్రత్యేకంగా మెచ్చుకోవలసింది పూర్ణిమనే . సాఫ్ట్ , మైల్డ్ పాత్రలకు పరిమితమయిన పూర్ణిమకు షీరోచితమయిన పాత్ర లభించింది . బాగా నటించింది .
- మరో ముఖ్య పాత్ర పులుసు పురాణం వై విజయది . కోడి రామకృష్ణకు వై విజయ అన్నా , ఆమె నటన అన్నా బాగా ఇష్టం , నమ్మకంలాగా ఉంది . ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు . చెల్లెలు చంద్రికతో వై విజయ ఇరగతీస్తుంది . డబుల్ మీనింగ్ డైలాగులు కాస్త శృతిమించాయనుకోండి . ప్రేక్షకులకు నచ్చింది . (తరువాత ఇక ఆమెకు అన్నీ ఇలాంటి పాత్రలే…)
ఇతర ప్రధాన పాత్రల్లో గొల్లపూడి మారుతీరావు , ఆలీ , రాజా , ప్రభృతులు నటించారు . హీరోయిన్ చెల్లెలుగా నటించిన అమ్మాయి పేరు తెలియదు . బాగా నటించింది .
కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . రాణీ రాణెమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా సూపర్ హిట్ సాంగ్ . ( స్కూళ్లలో, కాలేజీల్లో ఈ పాట మోగిపోయేది అప్పట్లో…) ఘుం ఘుం ఘుం ఘుమ్మెత్తిస్తుంది గోదావరి సీమ అంటూ సాగే డ్యూయెట్ , నేను ఈల వేస్తే గోలకొండ ఎగిరి పడుతుంది అంటూ సాగే అర్జున్ పాట శ్రావ్యంగా ఉంటాయి .
కో కో కో కోతి కొమ్మచ్చి తీపి అప్పచ్చి అర్జున్ పాట , సరిగ సరిగ సరిగ చీరె నలగనీకు రొమాంటిక్ పాట బాగుంటాయి . సి నారాయణరెడ్డి వ్రాసిన పాటల్ని బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలు శ్రావ్యంగా పాడారు . గణేష్ పాత్రో పదునైన డైలాగులను అందించారు .
(హీరో హీరోయిన్ పాత్రల కేరక్టరైజేషన్ల మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి, అదే వేరే సంగతి…. ప్లస్ గణేష్ పాత్రో కలం నుంచి పులుసు పాత్ర డైలాగులు రావడం కూడా హాశ్చర్యమే…)
భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ గోపాలరెడ్డి 17 సినిమాలను నిర్మిస్తే 13 సినిమాలకు దర్శకుడు కోడి రామకృష్ణే . హిట్ కాంబినేషన్ . చిన్న సినిమా . అయితే ఏం ? 21 కేంద్రాలలో వంద రోజులు అడింది . అర్జున్ హీరోగా ఎంట్రీ అదిరింది . సినిమా యూట్యూబులో ఉంది . It’s an off-beat entertainer . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
Share this Article