.
అంబారీల ఊరేగింపులు సిగ్గుపడేలా భూమ్యాకాశాలు ఒకటి చేస్తూ జరిగిన ఆ అనంత వైభవోజ్వల వివాహం జరిగి ఏడాది అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా పత్రికల్లో వచ్చిన వార్తలాంటి ప్రకటన…; ప్రకటన లాంటి ఫోటో ఫీచర్ వార్త చదివితే…, చిత్రాలు చూస్తే కలిగే చిత్ర విచిత్ర అనుభూతులకు ఏ భాషలో అయినా మాటలు చాలవు..!
పెళ్ళిళ్ళల్లో శాశ్వత సమాగమం; పునస్సమాగమం; కార్యం లాంటి మాటలకు అర్థాలు తెలియక ఈ అతిలోక వివాహ తొలి ఏడు పండగ తెలుగు ప్రకటనల్లో వాడారో! తెలిసే వాడారో! తెలియదు… కానీ ఆ తెలుగులో నేరుగా ధ్వనించే అర్థాలను ఎవరైనా పూసగుచ్చినట్లు ఆ ఆది దంపతులకు వివరిస్తే ఎలా ఉంటుందో..!
Ads
“మహాభారతంలో ఏది ఉందో అదే ప్రపంచంలో ఉంటుంది- మహాభారతంలో ఏది లేదో అది ప్రపంచంలో ఎక్కడా ఉండదు”- అని ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. అలా ఈ తొలి ఏడు పెళ్ళి పండుగ ప్రకటనల ప్రకారం- “ఈ పెళ్ళిలో ఏది ఉందో అదే ప్రపంచంలో ఉంటుంది- ఈ పెళ్ళిలో ఏది లేదో అది ప్రపంచంలో ఎక్కడా ఉండదు!!”
“పృథివి కలవాడి పృష్ఠంబు పుండయిన జగతి వార్తకెక్కు“- అని ఒక ప్రమాణం. అంటే బాగా డబ్బున్నవాడి పిర్ర మీద చిన్న పుండు లేచినా అది ప్రపంచానికి అతి పెద్ద వార్త అవుతుందట.
పుండే అతి పెద్ద వార్త అయ్యేప్పుడు… ఈ సహస్రాబ్దపు అతి పెద్ద పెళ్ళి పండుగ వార్త కాకుండాపోతే… అది మానవ నాగరికతకే మాయని మచ్చ అయి ఉండేది!
అవును గానీ అంబానీ భయ్యా… ఇది భారత దేశ వివాహ ఆచారాలను ప్రపంచ వేదిక మీద నిలబెట్టిన వేడుక ఎలా అవుతుంది..? దేశంలో ప్రతి 100 కిలోమీటర్లకూ భాష, యాస వేర్వేరు అన్నట్టుగానే… కులానికోరకం పెళ్లి తంతులాగే… బోలెడన్ని వివాహ సంప్రదాయాలు, వేడుకలు…
ఐనా ఇది సంపద ప్రదర్శన… ఇది మహాట్టహాసం, ఇది పటాటోపం, ఇది మహాడంబరం… ఇది భారతీయ వివాహ సంప్రదాయానికి మోడల్ కానేకాదు… మీలాంటోళ్లు రోజులతరబడీ వందల కోట్ల తంతు కానిచ్చేసి… ఇదే మా పెళ్లి పద్ధతి అని చాటింపేస్తారు ఇలా పత్రికల్లో పెద్ద పెద్ద వాణిజ్య ప్రకటనలతో…! దయచేసి ఈ మోడలే భారతీయ వివాహ సంప్రదాయం పద్ధతి అని ముద్రవేయకండి, మీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్…
మీ అంతగాకపోయినా మిగతా ధనికులు మిమ్మల్నే పాటిస్తారు… ఎగువ మధ్యతరగతీ ఆ వాతలు పెట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తుంది… దిగువ మధ్యతరగతి ఆ వాతలకూ అప్పులు చేసి ఆరిపోతుంది… అప్పనంగా వచ్చిపడే ప్రజాధనం అందరి దగ్గరా ఉండదు కదా…
తెలుగు మధ్యతరగతిలో మేమూ తక్కువ కాదు… పిచ్చి ప్రివెడ్ షూట్ల దగ్గర నుంచి… హల్దీ, మెహందీ, మంగళస్నానం, బ్యాచ్‌లర్ పార్టీ, రికార్డింగ్ డాన్సుల సంగీత్, బరాత్, పెళ్లి, రిసెప్షన్, నోము… ఎన్నెన్నో అట్టహాసాల వాతలు మేమూ పెట్టుకుంటున్నాం..!!
Share this Article