.
ఈటీవీలో పాడుతా తీయగా… ఎవరో గాయని ‘గాలికదుపు లేదు, కడలికంతు లేదు’ పాట పాడింది… బాగా పాడింది… జడ్జిల్లో చంద్రబోస్ స్వయంగా గీతరచయిత, వెరీ సీనియర్, ఆస్కార్ విజేత… మరో జడ్జి మోస్ట్ సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ కంపోజర్ కీరవాణి… ఇంకో జడ్జి సీనియర్ గాయని సునీత… కానీ ఆ పాటను ఎవరూ అర్థం చేసుకోలేకపోయారని అనిపించింది… చేసుకోలేదు…
ముగ్గురికీ తెలుగు సినిమా సంగీతంలో చాలా సీనియారిటీ ఉంది… రాసే కలానికి, పాడే గొంతుకు, స్వరపరిచే వాయిద్యానికి పాట అర్థం కాకపోతే మరి మామూలు జనం మాటేమిటి మాస్టారూ… అది ఆచార్య ఆత్రేయ రాసిన పాట… భావగర్భితం… ఆ సినిమా కథలోని కీలకమైన మలుపు దగ్గర ఓ మహిళ అంతరంగాన్ని ఆవిష్కరిస్తాడు…
Ads
ఆ సినిమా కథే ఓ ప్రయోగం… అందులోని పాటలన్నీ సూపర్బ్ ఒక్క మాటలో చెప్పాలంటే… సంగీతం, సాహిత్యాలే కాదు, చిత్రీకరణ కూడా… జోకర్ వేషంలో కమల్‌హాసన్ సరితతో డిఫరెంట్ డాన్స్, కమల్‌హాసన్ వెంట్రిలాక్విజం… (మన సినిమాల్లో దాని పరిచయం అదే తొలిసారి)… ఆ బొమ్మ ద్వారా తన ప్రేమను చెప్పుకోవడానికి విఫల ప్రయత్నం… చిరంజీవి విలనీ… కొడుకు విలనీకి అమ్మ ఆత్మశుద్ధి…
గణేష్ పాత్రో డైలాగ్స్ అపురూపం… చివరలో జయసుధ అంటుంది కమల్‌హాసన్‌తో… ఆ బొమ్మ గొంతు నీదేనని నాకు తెలుసు, కానీ ఆ గుండె కూడా నీదేనని తెలియలేదు… స్థూలంగా కథ ఏమిటంటే..? ఒక మహిళ… ఓ ప్రేమికుడు… పెళ్లి చేసుకోవాలనుకుంటారు, కుదరదు… లవ్ ఫెయిల్యూర్… ఆమె జయసుధ, అతను శరత్ బాబు…
చిరంజీవి, జయసుధ పెళ్లవుతుంది… చిరంజీవి శాడిస్టు… భరించలేక విడిచిపెట్టి బయటపడుతుంది… ఓ ఆఫీసులో పని, అక్కడ కమలహాసన్ సపోర్టుగా ఉంటాడు, మూగప్రేమికుడు… వన్ సైడ్ లవ్… ఈలోపు పాత ప్రేమికుడు మళ్లీ తగులుతాడు… పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు… ఆరోజుల్లో అంటే, 50 ఏళ్ల క్రితం మహిళల స్థితిగతులతో పోలిస్తే జయసుధ నిర్ణయం సంప్రదాయ విరుద్ధం కదా…
ఆ సందర్భంగా ఈ పాట… గాలికదుపు లేదు, కడలికంతు లేదు… అంటే శాడిస్టు భర్తను వదిలేసి, మళ్లీ తన పాత ప్రేమికుడినే పెళ్లిచేసుకునే ఉత్సాహం… ఆ ఉత్సాహపు గాలికి అదుపు లేదు, ఆమె మనసులో ఉప్పొంగే ఆ భావసముద్రానికి అంతూ లేదు…
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా… ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా..? గంగా ప్రవాహం కమండలంలో.., అంటే ఆమె కొత్త ఉత్సాహాన్ని సంప్రదాయపు సంకెళ్లలో (పునర్వివాహాన్ని సొసైటీ పెద్దగా ఆమోదించని ఆ రోజుల్లో… సంప్రదాయ విరుద్ధంగా భావించే కాలంలో… మొగుడితో సర్దుకొమ్మంటుందే తప్ప అన్నీ సర్దుకుని వెళ్ళిపొమ్మని సొసైటీ చెప్పని ఆ దినాల్లో…) ఇమిడ్చగలమా, సాధ్యమేనా అంటాడు రచయిత…
శాడిస్టు భర్త నుంచి బయటపడి, కొత్త స్వేచ్ఛను, కొత్త సుఖాన్ని, కొత్త భద్రతను కోరుకోవడానికి ఉరకలు వేసే ఆమె మనస్సుకు గిరి గీయగలమా..? లక్ష్మణరేఖలు గీయగలమా, గీస్తే ఆ మనస్సు ఆగుతుందా అనడుగుతాడు…
ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో… ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో… ఈ వాక్యాలు తుళ్లిపడే ఆమె మనస్థితిని చెబుతాయి… ఆమె కోరుకునే కొత్త జీవితాన్ని సూచిస్తాయి… తుళ్ళి తుళ్ళి గంతులు వేసే లేగకేది కట్టుబాటు, మళ్ళి మళ్ళి వసంతమొస్తే మల్లెకేల ఆకుచాటు అంటాడు రచయిత…
తుళ్లిపడే లేగకు ఎందుకు కట్టుబాటు..? అంటే కట్టుబాట్లలో కట్టేయడం…, అలా ఆమె మనస్సును, ఆ ఉరుకును, ఆ తుళ్లిపడే ఉత్సాహాన్ని కట్టేయగలమా..? ఎందుకు కట్టేయాలి అనేది ఆత్రేయ ప్రశ్న… మళ్లీ వసంతమొచ్చాక ఇక ఆ మల్లెకు ఆకుచాటు ఎందుకు అంటాడు తను…
ఓ తెమ్మెరా ఊపవే ఊహలా ఊయల నన్నూ… ఓ మల్లికా ఇవ్వవే నవ్వులా మాలిక నాకూ… ఓ గాలీ నన్ను ఊహల ఉయ్యాలలో ఆపవే, ఓ మల్లికా నాకు నీ నవ్వును ఇవ్వవే మల్లీ అని ప్రకృతితో మమేకమై పాడుకుంటూ ఉంటుంది ఆమె…
తల్లి మళ్ళి తరుణయ్యింది… పువ్వు పూసి మొగ్గయ్యింది… ఇక్కడ తల్లి మళ్లీ తరుణి కావడం అంటే… ఆల్రెడీ పెళ్లయిన ఆమె మళ్లీ కొత్త వధువు కావడం, ఒకరకంగా కన్నెపిల్ల అయిపోవడం… అందుకే పువ్వు మళ్లీ పూసి మొగ్గయింది అని ఆత్రేయ అభివ్యక్తి… వావ్…
పాట చివరలో మరో వాక్యంతో అదరగొడతాడు మనల్ని… గుడిని విడిచి వేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేముందీ… ఒక గుడిని, అంటే ఒక ఇంటిని (శాడిస్టు మొగుడి ఇంటిని) వదిలేసి, వేరొక గుడిలో, అంటే మరో ఇంటిలో ప్రమిదనవుతా, తప్పేముంది అని ప్రశ్నిస్తుంది ఆత్రేయ కలం… ఆ పాత్రధారి…
పాట మర్మాన్ని, లోతును, కథలో ఆ సందర్భాన్ని అర్థం చేసుకోగలిగితే మనసును కుదిపేసే భావవ్యక్తీకరణలు ఈ వాక్యాలన్నీ… తనున్న స్థితిలో ఓ బాధిత మహిళ కొత్త జీవితపు ఆశల్ని, ఆకాంక్షల్ని, కోరికల్ని చెప్పుకోవడం… వోకే, చివరకు ఆ రెండో పెళ్లీ సాధ్యం కాదు, కమలహాసన్ ప్రేమను కూడా నిరాకరించి, అంతులేని వైరాగ్యంతో, నిర్వేదంతో అత్తను వెంటేసుకుని, అనంత తీరాలవైపు వెళ్లిపోవడం ముక్తాయింపు…!!
- (కమలహాసన్ తన బొమ్మ ద్వారా తన మనసును విప్పుకునే తీరు మరోసారి చెప్పుకుందాం…)
Share this Article