ఇప్పుడు మన పోపుల పెట్టె విశిష్టత అర్థమవుతోంది… ఇప్పుడు ప్రాణాయామం ఆవశ్యకత ఏమిలో తెలుస్తోంది… ఇప్పుడు చిరుధాన్యాల అవసరం అవగాహనకు వస్తోంది… ఇప్పుడు చద్దన్నం, చల్ల ఎంత మేలో తెలిసొస్తోంది…. తరాలుగా రసాయనికి టూత్ పేస్టులు వాడీ వాడీ ఇప్పుడు ఉప్పు, బొగ్గుపొడి, వేపపుల్ల గొప్పతనం మళ్లీ వాడు చెబితేనే సమజైనట్టుగా…. అన్నం వార్చడం ఎందుకో కూడా మళ్లీ ఏ విదేశీ సైటువాడో చెబితేనే ఇప్పుడు తెలుస్తోంది… అసలు వార్చడం మరిచిపోయి ఎన్నేళ్లయిపోయింది… గంజి దేనికి మంచిదో కూడా ఏ విదేశీ సంస్థ వాడో చెప్పాలి… మధుమేహం తగిలితే తప్ప జొన్న గట్క, రాగి సంకటి యాదికి రాలేదు మనకు.. ఇదంతా మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ఓ నెల్లూరు డాక్టర్ గారు చద్దన్నం, పులిసిన మజ్జిగ ఎంత మంచిదో గట్టిగా చెప్పిండు కాబట్టి ఒక TV ఇంటర్వ్యూలో… ఇదుగో ఓ కార్పొరేట్ హాస్పిటల్ వంటి కార్పొరేట్ స్టార్ హోటల్ వాడు కూడా వెంటనే పట్టేసుకుని, ఫర్మెంటెడ్ రైస్, సద్ది అన్నం పేరిట వెంటనే మెనూలో పెట్టేసి, అడ్డగోలు రేట్లను సహజంగానే పెట్టేశాడు… ఓ మెయిన్ స్ట్రీమ్ పత్రికవాడి వెబ్ సైటయితే ఏకంగా దీంతో కరోనాకు చెక్ అని హెడింగ్ పెట్టి, తన హెడ్ ఎంత పెద్దదో ప్రదర్శించాడు… చాలామంది రాత్రిళ్లు అన్నాన్ని పులియబెట్టడం స్టార్ట్ చేశారు…
అంతే కదా మరి… మనకు లేచిందే పరుగు… కరోనా ప్రబలుతున్నప్పుడు, అది తినేస్తున్నప్పుడు ఇప్పటికిప్పుడు చద్ది అన్నం తినడం వల్ల ఒనగూరే తక్షణ ప్రయోజనం ఏమీ ఉండదు మనకు… దాన్ని ఒక అలవాటుగా తీసుకుంటూ ఉంటే మన దేహానికి ఆ చద్దన్నం ద్వారా ప్రొబయాటిక్స్, ఇతర ప్రయోజనాలు సమకూరుతూ ఉంటయ్… ఇంతకీ ఆ డాక్టర్ రెడ్డి గారు ఏం చెప్పారు..? మన ఆయుర్వేద, మూలికా వైద్యులు ఎంతోకాలంగా చెబుతున్నదే చెప్పాడు… ‘‘మన పూర్వీకులు మంచే చెప్పార్రా అబ్బాయ్, రాత్రి మిగిలిన అన్నాన్ని పారవేయకుండా మజ్జిగ కలిపి అలా పక్కన పెట్టేయండి, పొద్దున ఓ ఉల్లిపాయ, ఓ మిరపకాయ లేదంటే ఊరగాయ నంజుకుని కుమ్మేసెయ్… మనకు మంచి చేసే బ్యాక్టీరియా పుడుతుంది… లేదంటే పెరుగును చిలికి, మజ్జిగ చేసి, రాత్రి పక్కన పెట్టేయండి… కాస్త పులుస్తుంది కదా, రోజుకు రెండుమూడుసార్లు తాగేసెయ్… చలువ…’’ అవున్నిజమే కదా… ఐనా ఇవ్వాళ్రేపు మంచి చెప్పేవాళ్లెవరున్నారులే…
Ads
ఆల్కలిన్ వాటర్ మంచిది అనే ప్రచారం క్రమేపీ పెరుగుతోంది… ఇది దేహంలోని అసిడిక్ స్వభావాన్ని తగ్గించి, పీహెచ్ వాల్యూ సవరించి, క్షార స్వభావాన్ని పెంచి, దేహంలో సమతుల్యత తీసుకొస్తుంది అనేది ఓ నమ్మకం… అయితే ఇది నిజమేనా, అయితే ఏరకంగా అని చెప్పేవాడు లేడు… మనకు అన్నింటికీ ఇప్పుడు మార్గదర్శి యూట్యూబే కదా… అందులోనూ అనేకానేక ఫేక్ ప్రచారాలు… మరి దేన్ని ఎలా నమ్మడం..? పులిసిన అన్నం లేదా చద్దన్నం లేదా పులిసిన మజ్జిగ మాత్రమే కాదు… మన సంప్రదాయిక వంటలు కూడా పులిసిన ఆహారానికి చాలా ప్రయారిటీ ఇచ్చాయి… ప్రత్యేకించి మన దక్షిణ రాష్ట్రాల్లో… పిండి రుబ్బి రాత్రి అలా వదిలేసి… పొద్దున్నే వండుకునేవాటిలో ఇడ్లీ ప్రధానం… దోసెలు, అప్పం, ఊతప్పం ఎట్సెట్రా అన్నీ ఇలాంటివే… ఇప్పుడు తక్షణ ఫర్మెంటేషన్ చిట్కాలు చెబుతున్నారు కానీ అవి ఆరోగ్యపరంగా దండుగ… రాత్రిళ్లు మెల్లిగా పులిసిన పదార్థాలే మేలు… అన్నట్టు, అన్నంలో మజ్జిగ కలిపి పక్కన పెట్టినప్పుడే ఎందుకైనా మంచిదని ఉప్పు, మిరపకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పసుపు అందులో పడేస్తున్నారా..? వద్దు… జస్ట్, అన్నం, మజ్జిగ… అంతే… పొద్దున తినేటప్పుడు మాత్రమే కాస్త ఉప్పు ప్లస్ మిరపకాయ… నిజానికి ఊరగాయతో తింటే మరింత బెటర్… ఉల్లిపాయ నంజుకోవడానికి…! అంతేతప్ప అందులో పెండాబెల్లం అన్నీ కలిపేయకండి… అది ఇంకో పైత్యానికి దారితీసే ప్రమాదముంది… రాగి పాత్ర, మట్టి పాత్రలు వాడితే ఉపయోగం ఏమిటో పూర్తిగా, శాస్త్రీయంగా తెలియదు కానీ అవి ఆ ఆహారం పట్ల సదభిప్రాయాన్ని మాత్రం కలిగిస్తయ్…!! మరి ఫ్రిజ్జుల మాటేమిటి అంటారా..? పులియడానికి ఉపయోగపడదు… పులిసిన దాన్ని నాలుగు రోజులు అలాగే ఉంచడానికి పనికొస్తుంది… సమజైంది కదా…!!
Share this Article