Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహ్… ఆ జంబలకిడిపంబ సినిమాకు ఇక్కడ బీజం పడిందా..?!

July 15, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడిపంబ సినిమాకు బీజం , ఐడియా ఈ మొగుడు పెళ్ళాలు సినిమాలోనే పడింది … 1985 లో విడుదలయిన ఈ సినిమాకు జంధ్యాల దర్శకుడు అయితే ఇవివి అసోసియేట్ డైరెక్టర్ …

సినిమా మొదట్లోనే… వంద సంవత్సరాల తర్వాత అంటే 2085 లో పెళ్ళిచూపులు ఎలా ఉండొచ్చో , ఆడ మగా పొజిషన్స్ ఎలా రివర్స్ కావచ్చో హీరో నరేష్ కల ద్వారా చూపారు జంధ్యాల . ఈ పెళ్ళిచూపులు వంటి సీన్లు జంబలకిడిపంబలో చాలానే ఉన్నాయి . వంద సంవత్సరాల తర్వాత అనే జంధ్యాల ఐడియాకు పోలిందే కల్కి 2898 AD .

Ads

ఈ మొగుడు పెళ్ళాలు సినిమా గొప్ప సందేశాత్మక సినిమా ఏమీ కాదు . జంధ్యాల మార్క్ వినోదాత్మక , హాస్య రసభరిత చిత్రం . కాసేపు సరదాగా , హాయిగా నవ్వుకుంటూ సినిమా చూస్తాం . అక్కడక్కడా ఆయన సినిమాల్లో పాత్రలు కాసిన్ని పిచ్చి పిచ్చి చేష్టలు కూడా ఉంటాయి . ఈ సినిమాలో అలాంటి చేష్టలు పావలా శ్యామల చివర్లో చేస్తుంది .

పెళ్లి కోసం తహతహలాడే హీరో నరేష్ కలిగించు కళ్యాణ యోగం అంటూ గుళ్ళూ గోపురాలను పట్టుకుని తిరుగుతుంటాడు . అలా తిరిగే హీరోకి అందమైన హీరోయిన్ భానుప్రియ సింథాల్ పౌడర్ డబ్బాలు ఇంటింటికీ తిరుగుతూ అమ్ముకుంటూ తారసపడటం , ఆమెను ప్రేమించటం , పెళ్లి చేసుకోవటం చకచకా జరిగిపోతాయి .

పెళ్ళయాక భార్యామణి ఉపవాసాలు , పూజలు , వగైరాలతో భర్తను విసిగిస్తుంటుంది . దానితో చిరాకెత్తుతుంది హీరోకి . ఇంతలో వారిద్దరి మధ్యకు ఓ బిడ్డ కూడా వచ్చేస్తుంది . మొగుడు పెళ్ళాల మధ్య గేప్ ఇంకా పెరుగుతుంది . తగుదునమ్మా అంటూ హీరో ఆఫీసులో అటెండర్ సుత్తి వేలు బోడి సలహాల రూపంలో అగ్నికి ఇంకా ఆజ్యం పోసి దూరం పెంచుతాడు .

ఈ ప్రహసనంలో ఆఫీసులో పనిచేసే మరో అమ్మాయిని ఇరికించటం , ఆ అమ్మాయి లవర్ కూడా అపార్ధం చేసుకోవడం వంటి జంధ్యాల మార్క్ మలుపులు చోటు చేసుకుంటాయి . హీరోయిన్ తండ్రి సాక్షి రంగారావు హీరోయినుకి బుధ్ధి చెప్పటం వంటి మరిణామాలతో మొగుడు పెళ్ళాలు తమ తప్పులను తెలుసుకోవటం , సుత్తి వేలు తన నిర్వాకాన్ని చెప్పడంతో సినిమా సుఖాంతం అవుతుంది .

మొగుడు పెళ్ళాల మధ్య గొడవలకు ఇగోలు , శృతిమించిన ఆత్మాభిమానాలు కారణాలు అవుతుంటాయి చాలా సినిమాల్లో . ఈ సినిమాలో మెయిన్ జంట గొడవలకు కారణాలు పెళ్ళాం మీద మొగుడికి మోజు , పెళ్ళాం గారికి పూజలు , ఉపవాసాలు , ఇంటి బాధ్యతల మీద దృష్టి .

ఫైనల్గా ఈ సినిమా కధయినా ఇచ్చే సందేశం ఒకటే . ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం , సర్దుకుపోవటం . అదే ఈ సినిమాలో కూడా చెప్పబడుతుంది . నరేష్ , భానుప్రియ జంటతో పాటు మరో జంట శుభలేఖ సుధాకర్ , శ్రీలక్ష్మి జంట .

  • శ్రీలక్ష్మి పాత్రలను జంధ్యాల అద్భుతంగా డిజైన్ చేస్తొరు తన సినిమాలలో . ఈ సినిమాలో బిందె కొంటే స్పూన్ ఫ్రీ అని కేక వస్తే వంద రూపాయలు ఎక్కువయినా ఇచ్చి స్పూన్ కోసం బిందెను కొనే పాత్ర ఆమెది . మన నిత్య జీవితంలో ఏ షాపింగ్ మాలుకి వెళ్ళినా ఇలాంటి ఫ్రీ ఆపర్లు కనిపిస్తునే ఉంటాయి . చివరకు బార్లలో కూడా . మూడు పెగ్గులు తాగితే ఒక పెగ్గు ఫ్రీ . ఆఫర్ల ప్రపంచం !!

ఇందులో శ్రీలక్ష్మి పాత్ర చాలా సరదాగా ఉంటుంది . మెట్టినిల్లు కూడా పుట్టినింటికి ఆనుకునే ఉంటుంది . మొగుడితో గొడవ పడటం, గోడ దూకి సూట్ కేసు తీసుకుని పుట్టింటికి రావటం , మొగుడు సుధాకర్ వచ్చి తీసుకుని వెళ్ళటం చాలా హాస్యభరితంగా ఉంటుంది .

ఇతర ప్రధాన పాత్రల్లో కాకినాడ శ్యామల , డబ్బింగ్ జానకి , సాక్షి రంగారావు , మహీజ , రవి , ప్రభృతులు నటించారు . చిన్న చిన్న పాత్రలు చాలానే ఉన్నాయి . ఔత్సాహిక కళాకారులు ఆ పాత్రల్ని వేసారు . పేర్లు సుపరిచితమయినవి కావు .

నరేషుకి ఇలాంటి పాత్రలు 1985 కే కొట్టిన పిండి అయిపోయాయి . ముఖ్యంగా చెప్పుకోవలసింది భానుప్రియ గ్లామర్ని . బాగానే ఉపయోగించుకున్నారు జంధ్యాల . సుత్తి వీరభద్రరావు , శుభలేఖ సుధాకర్ , శ్రీలక్ష్మి నటన హైలైట్ .

bhanupriya
వేటగాడు సినిమా నిర్మాతలలో ఒకరయిన కె శివరామరాజు ఈ సినిమాకు నిర్మాత . స్క్రీన్ ప్లే , సంభాషణలను జంధ్యాల అందించారు . రమేష్ నాయుడు సంగీత దర్శకత్వంలో వేటూరి వారి పాటల్ని బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , మాధవపెద్ది రమేష్ , జానకమ్మలు చాలా శ్రావ్యంగా పాడారు .

ముఖ్యంగా జాము గడిచెను జాబిలి ఒరిగెను పాట . ఈ పాటలో భానుప్రియ క్లాసికల్ డాన్సుని నృత్య దర్శకుడు శేషు అద్భుతంగా కంపోజ్ చేసారు . అంతే అందంగా జంధ్యాల చిత్రీకరించారు . నువ్వు కాటుక దిద్దకపోతే మలిసంధ్యకు చీకటి రాదు , దూరం దూరం దూరం డ్యూయెట్లు బాగుంటాయి .

రెండు జంటలు కలిసి పాడే పాట ఒకే వెలుతురిచ్చే రెండు పొద్దులుతో ప్రారంభమయ్యే మొగుడు పెళ్ళాలు ఐకానిక్ సాంగ్ చిత్రీకరణ చక్కగా ఉంటుంది . సినిమా మొదట్లోనే కలిగించు కళ్యాణ యోగం అంటూ నరేష్ గుళ్ళూ గోపురాలు తిరిగే పాట సరదాగా ఉంటుంది .

విశాఖపట్నంలో నిర్మించబడే సినిమాలన్నీ ఎక్కువగా హిట్ , సూపర్ హిట్ . అందులో జంధ్యాల సినిమాలయితే ఇంకా హిట్టు . అయితే ఈ సినిమా మాత్రం ఆ లెవెల్లో సక్సెస్ కాలేదనుకుంటా . సినిమా సరదాగా , వినోదాత్మకంగా సాగుతుంది . ఇంతకముందు చూడనట్లయితే యూట్యూబులో చూడొచ్చు . భానుప్రియ శాస్త్రీయ నృత్యం పాటను మిస్ కావద్దు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అయ్యో బాబూ… బనకచర్లపై ‘ముచ్చట’ చెప్పిందే వెదిరె శ్రీరామూ చెప్పాడు..!!
  • కూలేశ్వరం ఏటీఎం కీలక బోల్ట్… ఏళ్లకేళ్లు సర్వీస్ ఎక్స్‌టెన్షన్ …
  • బనకచర్లపై మాట్లాడేదేం లేదు… కేంద్ర-బాబుకు తెలంగాణ ప్రభుత్వం షాక్…
  • ఎవరు ఆ త్రిశూలధారి..? ఆ యుద్ధంలో ఎలా ప్రత్యక్షమయ్యాడు..? ఎందుకు..?!
  • జగడపు చనువుల జాజర… ఓ శృంగార కీర్తనకు వెగటు గెంతుల రీల్స్…
  • రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్..! బనకచర్ల ఏటీఎంకు బాబు కోటరీలోనే వ్యతిరేకత..!!
  • ఆహా ఏమి రుచి..! కొత్తిమీర కూరితేనే వంకాయకు ఆ రుచివైభోగం…
  • గాలికదుపు లేదు- కడలికంతు లేదు… ప్రతి పదంలోనూ లోతైన భావన…
  • ఓహ్… ఆ జంబలకిడిపంబ సినిమాకు ఇక్కడ బీజం పడిందా..?!
  • ఆర్ఎస్ఎస్ ముద్ర..! నలుగురు కొత్త ఎంపీలు, ముగ్గురు గవర్నర్లు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions