.
పాలు… చంటి పాప దగ్గర నుంచి పండు ముసలి వరకూ… పాలు ఓ పౌష్ఠికాహారం… అందులోనూ వెజ్, నాన్-వెజ్ ఉంటాయా..? ఆ తేడా ఏకంగా రెండు దేశాల ట్రేడ్‌కు అడ్డంకిగా మారుతుందా..?
ఎస్, అమెరికాతో వాణిజ్యానికి నాన్ వెజ్ పాలే అడ్డంకి..! దానివల్లే భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ప్రతిష్టంభనలో పడింది… చర్చలు కొనసాగుతున్నప్పటికీ, వ్యవసాయం, పాల ఉత్పత్తుల విషయంలో ఇరు దేశాలూ ఒక సాధారణ అభిప్రాయానికి రాలేకపోతున్నాయి…
Ads
“నాన్- వెజ్ పాలు”… దీనిపై దేశం సున్నితమైన మత, సాంస్కృతిక ఆందోళనకు గురవుతోంది… అందుకే అమెరికన్ పాల ఉత్పత్తుల దిగుమతులను దేశంలోకి అనుమతించడానికి భారత్ వెనుకాడుతోంది… పేరుకే ట్రంపుడు మోడీ దోస్త్.,. కానీ అనేక విషయాల్లో ఇండియా పట్ల ఓ శతృత్వ వైఖరి తీసుకున్నాడు…
మోడీ, ట్రంపు కోసం ప్రచారం చేసినందుకు లెంపలేసుకుంటున్నాడా..? ఎలన్ మస్క్ వంటి ఫైనాన్షియర్, జాన్ జిగ్రీ దోస్త్‌నే బెదిరించి, ఏకంగా పార్టీ నుంచి, తన కోటరీ నుంచి తరిమేసినవాడు ట్రంపుడు… అనైతిక వ్యాపారి తను… రష్యాతో వ్యాపారం చేస్తే ఏకంగా 500 శాతం సుంకం వేస్తా, బ్రిక్స్‌కు సపోర్ట్ చేస్తే 200 శాతం సుంకం వేస్తా అని బెదిరిస్తున్నాడు…
మోడీ ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో చూడాలి… కానీ అమెరికాతో అంటకాగే ఈ ప్రభుత్వానికి రష్యాయే మన నిజమైన స్నేహితుడు అనే సోయి ఆ దేవుడు కలిగించాలి… సరే, నాన్ వెజ్ పాల దగ్గరకు వద్దాం…
'నాన్-వెజ్' పాలు అంటే ఏమిటి?
2023 వరల్డ్ అట్లాస్ నివేదిక ప్రకారం, భారతదేశ జనాభాలో సుమారు 38 శాతం మంది శాఖాహారులుగా గుర్తించారు… హిందువులు ప్రతిరోజూ మతపరమైన ఆచారాలలో, తమ ఆహారాలలో పాలు, నెయ్యి ఉపయోగిస్తారు…
“మాంసం, రక్తం దాణాగా వేయబడిన ఆవులు ఇచ్చే పాలను నాన్ వెజ్ పాలు అంటారు… మన దేశంలో ప్రధానంగా గడ్డి, తవుడు, నూనె తీసిన పిట్టు వంటివి దాణాగా వేస్తారు ఆవులకు గానీ, గేదెలకు గానీ… కానీ అమెరికాలో మాంసం ముక్కలు కూడా వేస్తారట… సో, ఆ పాలు నాన్-వెజ్ పాలు అన్నమాట…
భారతదేశ పశుసంవర్ధక,, పాడి పరిశ్రమల శాఖ ఆహార దిగుమతులకు పశువైద్య ధృవీకరణను తప్పనిసరి చేసింది… ఈ ధృవపత్రాలను జారీ చేయడానికి ఒక షరతు ఇలా ఉంది… “పాడి పశువులకు మాంసం, ఎముకల పిండి, అంతర్గత అవయవాలతో కూడిన దాణాను ఎప్పుడూ తినిపించకూడదు…’’ అమెరికా దీనిని ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) లో విమర్శించింది… దాని ప్రయోజనాల కోసం అది దేన్నయినా విమర్శిస్తుంది కదా…
అమెరికా తన ఆవులకు ఏమి తినిపిస్తుంది
అమెరికాలో పశువుల దాణాలో జంతు ఉత్పత్తులు ఉంటాయి. “ఆవులకు ఇప్పటికీ పందులు, చేపలు, కోడి, గుర్రాలు, పిల్లులు, కుక్కల అవయవ దాణాను వేస్తుంటారు… పంది, గుర్రపు రక్తాన్ని, అలాగే పశువుల అవయవ భాగాల నుండి వచ్చే గట్టి కొవ్వును కూడా తినిపిస్తారు…’’ అని సియాటెల్ పోస్ట్- ఇంటెలిజెంజర్- 2004 నివేదిక…
పాడి విషయంలో భారత్ ఎందుకు వెనక్కి తగ్గదు
జంతు ఉత్పత్తులు తిని పెరిగిన ఆవుల పాల ఉత్పత్తుల దిగుమతులను న్యూఢిల్లీ నిషేధించింది… పాల ఉత్పత్తి, వినియోగంలో అతిపెద్ద దేశమైన భారత్, అమెరికాకు తన పాడి మార్కెట్‌ను తెరవడానికి అంగీకరించకపోవచ్చు… పాడి రంగం 140 కోట్లకు పైగా భారతీయులకు ఆహారాన్ని, ఎనిమిది కోట్ల మందికి పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తుంది…
మతపరమైన, సాంస్కృతిక విషయాలే కాకుండా, భారత్ తన ఆర్థిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి… స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇటీవలి విశ్లేషణ ప్రకారం, పాడి రంగాన్ని అమెరికన్ దిగుమతులకు గనుక తెరిస్తే భారతీయ పాడి రైతులకు వార్షికంగా లక్ష కోట్ల నష్టం వాటిల్లవచ్చు…
వాడెక్కడో మెలిక పెడతాడు, ఒత్తిడి తెస్తాడు, మన మెడలు వంచే ప్రయత్నం చేస్తాడు… ఇండియా స్థిరంగా తన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందా అనేది ప్రశ్న… ఈలోపు ఆల్రెడీ కొందరు విమర్శలు స్టార్ట్ చేశారు… మన దేశంలో అలవాటే కదా… ఆవులు ఊళ్లల్లో పొలాల వెంబడి తిరుగుతూ నాన చెత్తా తిని పాలు ఇస్తాయి, మరి వాటిని ఏమందాం అని…!!
ఇలాంటి బ్యాచులకు దేశంలో కొదవ లేదు కాబట్టి… మోడీ భాయ్, నువ్వు ఈ విషయంలోనైనా కాస్త స్థిరంగా నిలబడు… పాడి రైతుల పొట్ట గొట్టకు..!! అంతటి ఎలన్ మస్కా ట్రంపును చీదరించుకుంటున్నాడు… నీ దోస్తానా ఎంత..? వదిలెయ్..!!
Share this Article