.
Subramanyam Dogiparthi....
మయూరి, అశ్వని… ఈ రెండు బయోపిక్స్‌నూ ఉషాకిరణ్ మూవీస్ ఆ నిజజీవిత వ్యక్తులతోనే తీసింది… అప్పట్లో రామోజీరావు ఆలోచనలు, ఆచరణ అలా కొత్తగా ఉండేవి… సక్సెస్‌ఫుల్ కూడా… మొదట్లో ఉషాకిరణ్ మూవీస్ నాణ్యమైన సినిమాల్ని తీసింది… తరువాత ఏమైందో గానీ చిత్రనిర్మాణం పూర్తిగా మానేసింది…
సుధాచంద్రన్ అనే శాస్త్రీయ నృత్యకారిణి 1981 లో తిరుచునాపల్లిలో జరిగిన ఓ ప్రమాదంలో కాలు పోగొట్టుకుంటుంది . కాలు పోయిందని విలపిస్తూ కూర్చోకుండా జైపూర్ కృత్రిమ కాలు పెట్టించుకుని మరలా ప్రపంచంలోని పలు దేశాలలో నాట్య ప్రదర్శనలను ఇచ్చి సంచలనం సృష్టించారు .
Ads
ఆనంద బజార్ పత్రికలో ఈమె కధను చదివిన రామోజీ రావు గారు ఆమె కధను సినిమాగా తీస్తే ప్రజలకూ స్ఫూర్తివంతంగా ఉంటుందని భావించి సింగీతం శ్రీనివాసరావు గారికి ఆ బాధ్యత అప్పచెప్పారట . నటీమణుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్న సమయంలో సింగీతం వారికే ఆమె చేతే ఆ పాత్రను వేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచన రావటం , రామోజీరావు గారు ఆమోదించటం , ఆమె అంగీకరించటం చకచకా జరిగిపోయాయి . ఓ అద్భుతమైన క్లాసిక్ ప్రేక్షకులకు లభించింది .
తెలుగులోనే కాదు , తమిళ, మళయాళ, హిందీ భాషల్లో కూడా గొప్ప ప్రేక్షకాదరణ పొందింది . తెలుగులో ధన వర్షంతో పాటు , అవార్డుల వర్షం , పండిత పామరుల ప్రశంసలు లభించాయి . ఈ సినిమా తరువాత కూడా ఆమె ఫీల్డులోనే ఉంది, పలు సినిమాలు, టీవీ సీరియళ్లు…
భగవంతుడు అన్ని అవయవాలను ఇచ్చి ప్రపంచంలోకి పంపితే ఊర పందుల్లాగా తిని ఏ పనీ చేయని బడుధ్ధాయిలు , సోమరిపోతులు , భూమికి భారం గాళ్ళు ఈ సినిమాను చూసి బుధ్ధి తెచ్చుకోవాలి . కృషి ఉంటే మనుషులు రుషులవుతారు , మహా పురుషులవుతారు , తరతరాలకు తరగని వెలుగవుతారు . ఈ సుధాచంద్రన్ కధే అందుకు తార్కాణం .
1985 లో వచ్చిన ఈ మయూరి సినిమాలో సుధాచంద్రన్ తో పాటు నిర్మలమ్మ , శుభాకర్ , వై విజయ , పి యల్ నారాయణ ప్రభృతులు నటించారు . ఆమెకు నిజ జీవితంలో కృత్రిమ కాలుని ఏర్పాటు చేసిన డాక్టర్లు పి కె సేథీ , కాశీవాలాలే తమ తమ పాత్రలను పోషించటం ఆసక్తికరమైన విషయం .
సినిమా నృత్య నేపధ్యం కలిగిన సినిమా . సహజంగానే సంగీత సాహిత్యాలకు పెద్ద పీట ఉంటుంది . సంగీత దర్శకత్వం బాధ్యత బాలసుబ్రమణ్యం వహిస్తే , తాను మాత్రమే వ్రాయగల వేటూరి పాటలను వ్రాసారు . గణేష్ పాత్రో సంభాషణలను అందించారు . సంగీతానికి ధీటుగా బాలసుబ్రమణ్యం , జానకమ్మ , శైలజలు గాత్రాలను చేర్చారు . ఈ సినిమాను ఓ కళాఖండంగా తీర్చిదిద్దారు .
మొదటగా చెప్పుకోతగ్గ పాట గౌరీశంకర శృంగం నరనారీ సంగమ రంగం పాట . శృంగం అనే పదం వేటూరి వారికి తట్టడం అద్భుతం . ఈ పాట సాహిత్యం సాహితీ ప్రియులు తప్పక చదవాల్సిందే . ఈ బృంద నృత్యం జైపూర్ పేలసుల్లో , గోల్కొండ కోటలో అద్భుతంగా చిత్రీకరించారు . మరో గొప్ప పాట ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేల పాట . శైలజ పాడింది . ఎంత శ్రావ్యంగా ఉంటుందో అంత కమనీయంగా ఉంటుంది నృత్యం .
కైలాసంలో తాండవమాడె నటరాజా ఓ నటరాజా , మౌనం గానం మధురం మధురాక్షరం , ఈ పాదం ఇలలోన నాట్య వేదం పాటలు కన్నుల పండగే . వెన్నెల్లో ముత్యమా అంటూ సాగే పాటలో తెలుగు సాంస్కృతిక వారసత్వం వివరిస్తూ గురజాడ , నండూరి వారి మీద సాగుతుంది . చాలా గొప్పగా ఉంటుంది .
నిర్మలమ్మ డైలాగులు ప్రేక్షకులు మరచిపోలేనివి కొన్ని ఉన్నాయి . కె వి రెడ్డి గారి శిష్యుడయిన సింగీతం వారు ఆయనకు లాగానే సినీ చరిత్ర మరచిపోలేని పుష్పక్ , ఆదిత్య 369 వంటి ఇన్నోవేషన్స్ చాలానే చేసారు .
రామోజీరావు గారి సినిమా కాబట్టి తరచూ ఈటివిలో వస్తుంటుంది . అప్పుడే చూడాలి చూడాలని అనుకునే వారు . యూట్యూబులో లేదు . హిందీ సినిమా ఉంది . యూట్యూబులో కొన్ని సీన్స్ , పాటలు ఉన్నాయి . నృత్యాలు పాటలే అందంగా ఉంటాయి కాబట్టి ఆసక్తి కలవారు వాటిని వీక్షించవచ్చు . Unmissable . టివిలో వస్తే ఇంతకుముందు చూడనివారు మిస్ కాకండి .
సుధాచంద్రన్ తో టివి ఇంటర్వ్యూలు కుప్పలుకుప్పలు . ఆలీతో సరదాగా షోలో కూడా ఆమె ఇంటర్వ్యూ ఉంది . అలాగే మరెన్నో ఇంటర్వ్యూలు ఉన్నాయి . టైం ఉన్నప్పుడు చూడతగ్గ ఇంటర్వ్యూలే . ఓ స్ఫూర్తిదాయకమైన సినిమా , ఇంటర్వ్యూలు . It’s a great inspiring , classical , visual splendour .
#తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article