.
తెలంగాణ రైజింగ్ 2047 పేరిట ప్రభుత్వం ప్రచారంలోకి తీసుకొస్తున్న ఓ ఫోటో చాలామందిని ఆకర్షిస్తోంది… అనేక భాషల్లో యావత్ లోకానికి స్వాగతం చెబుతున్న ఆ ఫోటో నిజంగానే బాగుంది… ఎందుకు బాగుందీ, అది ఎందుకు అవసరం అంటే..?
ఖచ్చితంగా చెప్పుకోవాలి… హైదరాబాద్ అభివృద్ధి ఎవరి కోసమూ ఆగదు… ఇదొక నదీప్రవాహం… అనేక తరాలుగా అనేక ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, అలవాట్లు, మతాల ప్రజానీకం కలిసిమెలిసి… ఎవరి అస్థిత్వాన్ని వాళ్లు కాపాడుకుంటూనే… ఓ విశ్వనగరంగా రూపాంతరం చెందిన నగరం ఇది… గంగా యమునా తెహజీబ్ మాత్రమే కాదు, అనేకానేక ఉపనదులు కలిసే ప్రధాన నది…
Ads
కవి బాలగంగాధర్ తిలక్ చెప్పినట్టు… ఇది కాదొక స్థిర బిందువు, అనైక నదీనదాలు కలిసే అంతస్సింధువు… ఐటీ మాత్రమే కాదు, ఫార్మా, ఆర్ట్, సినిమా, మాన్యుఫాక్చరింగ్, ఆటో… వాట్ నాట్..? అందరికీ ఇదే అడ్డా… సగటు కూలీ దగ్గర నుంచి హైప్రొఫైల్ రాజరికం బాపతు కేరక్టర్ల దాకా… అందరినీ అలుముకుంటుంది, అంటే హత్తుకుని, అక్కున చేర్చుకుంటుంది… నిజాం జమానాలోనే నార్తరన్ కమ్యూనిటీలు బోలెడు ఇక్కడికి వచ్చి ఏ హమారా హైదరాబాద్ అని నినదించాయి…
ఎస్, ఇక్కడ ఎవరూ కన్నడమే మాట్లాడు, హిందీ వద్దు, మరాఠీ మాట్లాడకపోతే తాటతీస్తాం, తమిళంలో సొల్లు అని నిర్బంధం విధించరు… దాడులు చేయరు… నీ భాష నీ ఇష్టం… మేం స్వాగతిస్తాం… ఇక్కడ రేపిడోలు, ఊబర్లు ఉంటాయి… గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్స్ ఉండవు… సముద్ర తీరం కాదు కదా, నాలుగు చినుకులు గట్టిగా కురిస్తే నగరమంతా మునిగిపోవడం ఉండదు…
నీ ఫుడ్ దొరుకుతుంది, నీ సినిమా దొరుకుతుంది, పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విద్య, సేమ్ రేంజ్ వైద్యం… ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, గోదావరి- కృష్ణా వాటర్, మెట్రో రైల్… అన్నింటికీ మించి అందరినీ ఆదరించే స్థానిక జనం…
ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ప్రధాన నగరాల్లో వర్క్ ఫోర్స్ నానా అవస్థలను ఎదుర్కుంటోంది… భాష, మతం, ప్రాంతం, సంస్కృతి, ఫుడ్… అన్నీ ఇరకాటంలో పడేస్తున్నాయి తాజా పరిణామాలు… ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, పూణె అన్నీ… హైదరాబాద్ మాత్రమే అందరికీ అనువైన సురక్షిత, సౌకర్యవంతమైన నగరం ఇప్పుడు…
అమరావతి మీద చంద్రబాబు కాన్సంట్రేషన్ బాగానే ఉన్నా… ఓ నగరాన్ని రాత్రికిరాత్రి నిర్మించలేరు ఎవ్వరూ… క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఎయిర్‌స్పేస్ ఇండస్ట్రీ కావచ్చు… భవిష్యత్తు ఉపాధి రంగాలకు హైదరాబాదే గమ్యం కాబోతోంది…
అందుకే ఆ ఫోటో నచ్చింది… దీన్ని దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం బహుళ ప్రచారంలోకి తీసుకురాబోతోంది… ఫ్యూచర్ సిటీ, ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్… అన్ని బాదులూ నలువైపులా విస్తరిస్తూ… ఎస్, తెలంగాణ రైజింగ్… హైదరాబాద్ ఆల్వేస్ రైజింగ్… నెవ్వర్, అన్నికాలాల్లోనూ సుఖంగా, సౌకర్యంగా ఉండే ఈ వాతావరణం దేశంలో ఏ నగరంలోనూ లేదు, ఉండదు… అందుకే హైదరాబాద్ వస్తే చాలు, ఇక వదిలిపెట్టరు…
అన్నట్టు ఆ ఫోటోలో ఏముందని కదా… ఇదీ…
- no matter which language you speak, what clothes you wear, who you live with, what you believe in, or the choices you make, Hyderabad welcomes you with open arms
come to hyderabad to work, to study, to invest, to explore, to grow, to settle, to do business, to thrive and to belong
మీరు ఏ భాష మాట్లాడినా, ఏ దుస్తులు ధరించినా, ఎవరితో నివసిస్తున్నా, ఏ ప్రాంతమైనా, ఏ విశ్వాసాలు పెట్టుకున్నా, లేదా మీది ఏ విషయంలో ఏ ఎంపిక ఏదైనా, హైదరాబాద్ మిమ్మల్ని ముక్తకంఠంతో, చేతులు జాపి స్వాగతిస్తుంది…
పని చేయడానికి, చదువుకోవడానికి, పెట్టుబడి పెట్టడానికి, అన్వేషించడానికి, ఎదగడానికి, స్థిరపడటానికి, వ్యాపారం చేయడానికి, అభివృద్ధి చెందడానికి, దీన్నీ మీదిగా చేసుకోవడానికి హైదరాబాద్‌కు రండి… ఇది యూనిక్… ఇది యూనివర్శల్…
Share this Article