.
( రమణ కొంటికర్ల
) ….. ఏకకాలంలో ఇద్దరినీ పెళ్లి చేసుకున్న మహిళ కథ ఇది. అరుదైన బహిరంగ బహు భర్తృత్వ వేడుక కూడానూ! హిమాలయ ప్రాంతాల్లో ఒకరికి మించి అన్నదమ్ములను, ఇతరులను ఒకే మహిళ పెళ్లి చేసుకోవడం కొన్ని తెగల్లో ఉన్నట్టు చదివాం… మనకు భారతంలో ద్రౌపది కథ కూడా తెలిసిందే కదా…
అలాంటి ఎన్నో వైవిధ్యమైన పెళ్లళ్లకు వేదికైన భారత్ లో… ఓ మహిళ ఇద్దరు అన్నదమ్ములను ఒకే వేదికపై పెళ్లి చేసుకున్న తంతుకు హిమాచల్ ప్రదేశ్ కేంద్రమైంది.
Ads
సిర్మౌర్ జిల్లా షిల్లాయ్ కు చెందిన ప్రదీప్ నేగీ, కపిల్ నేగీ ఇద్దరూ అన్నదమ్ములు. సమీపంలోని కున్హాట్ కు చెందిన సునీతా చౌహాన్ అనే మహిళతో ఈ ఇద్దరు అన్నదమ్ముల వివాహం హట్టి అనే సామాజిక సాంస్కృతిక వారసత్వ పద్ధతిలో జరిగింది.
హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో పురాతన హట్టి సంప్రదాయం ప్రకారం ఒక మహిళ ఇద్దరినీ వివాహమాడే బహుభర్తృత్వ ఆచారానికి అవకాశముంది. అయితే, చాలాకాలంగా సమాజంలో వస్తున్న మార్పులతో అలాంటి వివాహ వేడుకలు పెద్దగా కనిపించకపోయినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ ప్రదీప్ నేగీ, కపిల్ నేగీ అనే ఇద్దరు సోదరులను సునీత వివాహం చేసుకోవడంతో ఈ వేడుక ఇప్పుడు ఓ ట్రెండిగ్ టాపిక్ గా మారింది.
ఈ వేడుకకు సంబంధించి బలవంతపు పెళ్లిగా గానీ.. పెద్దల ఒత్తిడి కానీ.. సామాజిక అడ్డంకులు గానీ.. ఇలా ఏవీ లేకుండా పరస్పర అంగీకారంతో జరగడమే ఈ వివాహ విశేషం.
హట్టి సమాజానికి రోల్ మాడల్ ద్రౌపది!
బహుభర్తృత్వానికి సుముఖత వ్యక్తం చేస్తూ జోడిదరన్.. లేదా, ద్రౌపది పాత్రలా హిమాచల్ ప్రదేశ్ లోని హట్టి సమాజం ఇద్దరు సోదరులు ఒకే భార్యను కల్గి ఉండటంలో తప్పు లేదు. పైగా చాలాకాలంగా కొనసాగుతున్న ఆచారమిది. ఈ ఆచారం అటు హిమాచల్ ప్రదేశ్ లోని ట్రాన్స్ గిరి ప్రాంతంతో పాటు.. మరోవైపు ఉత్తరాఖండ్ లోని కొన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తుంది.
ఐక్యతను కాపాడుకోవాలనే కోరిక నుంచి మొదలైన ఆచారంగా ఇది ప్రచారం ఉంది. ఏ స్త్రీ కూడా వితంతువుగా మిగిలిపోవద్దనే మరో మోటో కూడా ఈ ఆచారం వెనుక ఉందట. అలాగే, వారసత్వంగా వస్తున్న ఆస్తులు, భూముల విభజన విషయంలోనూ అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా కూడా ఇలాంటి వివాహ వేడుకలు ఐక్యంగా ఉంచుతాయన్నది హట్టి సమాజం నమ్మకం.
అయితే, మారుతున్న కాలంలో ఇలాంటి ఆచారాలు పెద్దగా ఈమధ్య కనిపించకపోయినప్పటికీ… తాజాగా జరిగిన సోదురులైన నేగీ బ్రదర్స్, సునీత వివాహ వేడుకతో ఈ ఆచారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
మరి వధూవరులెమంటున్నారు..?
సునీతను వివాహమాడిన ప్రదీప్ నేగీ పెద్దవాడు కాగా.. అతను జల్ శక్తి విభాగంలో పనిచేస్తుంటారు. కపిల్ విదేశాల్లో ఆతిథ్యరంగంలో ఉద్యోగం చేస్తున్నాడు. వాస్తవానికి ఊరికి దూరంగా ఉద్యోగాల్లో బిజీగా ఉండే ఈ ఇద్దరు సోదరులూ కూడా హట్టీ సామాజికవర్గ సంప్రదాయాల ప్రకారం జరిగే వివాహ వేడుకలోని అన్ని కార్యాల్లోనూ పాల్గొని ఆకట్టుకున్నారు.
ఇది పరస్పర నిర్ణయమంటాడు ప్రదీప్. మా సామాజిక చరిత్ర గురించి మేమెప్పుడూ గర్వంగానే ఫీలవుతాం. అందుకే దాన్ని బహిరంగంగానే ఆచరిస్తామంటున్నాడు. ఇక కపిల్ ఏమంటాడంటే… మేం పారదర్శకంగా ఉంటాం.. నేను విదేశాల్లో ఉండొచ్చు..
కానీ, ఈ వివాహంతో మా భార్యకు కుటుంబపరంగా మద్దతు, భద్రత, ఆప్యాయత అన్నీ లభిస్తాయంటున్నాడు. ఈ సంప్రదాయం గురించి తనకు తెలిసే తాను ఒప్పుకున్నానంటోంది సునీత. నాపైన ఎలాంటి ఒత్తిడీ లేదని.. నా ఇష్టపూర్వకంగానే ప్రదీప్, కపిల్ అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకున్నానంటోందామె. మా బంధంపై తనకు అపార నమ్మకముందంటోంది.
మూడు రోజుల వివాహ వేడుక!
ఇప్పుడున్న సామాజిక పద్ధతులు.. పూర్తిగా మారిపోతున్న ధోరణుల్లో… కచ్చితంగా దృష్టిని ఆకర్షించేది, ఒకింత చర్చకు పెట్టేదే హట్టి సామాజికవర్గ ఈ వివాహ వేడుక. అయితే, ఈ వేడుకను మూడురోజుల పాట ఘనంగా నిర్వహించారు.
సమీప ప్రాంతాల నుంచి అనేక మంది బంధువులు, స్నేహితుల మధ్య ఈ పరిణయం జరిగింది. పాటలు, నృత్యాలతో పాటు.. వచ్చిన బంధుమిత్రుల ఆశీర్వాదాలతో ఒక బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోని పురాతన వేడుకను కలర్ లో చూస్తున్నట్టుగా సాగింది సునీత బహు భర్తృత్వ పెళ్లి వేడుక…
Share this Article