.
Ramu Suravajjula ….. ఆఫీసుల్లో పిచ్చి వ్యవహారాలు ఏల? ఆయన చీఫ్ ఎగ్జి క్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ). భార్యా ఇద్దరు పిల్లలు. ఆమె చీఫ్ పీపుల్ ఆఫీసర్ (సీపీఓ). ఈ మధ్యనే రెండో పెళ్లి అయ్యింది. సంతానం వివరాలు అస్పష్టం.
పెద్ద టెక్ కంపెనీలో పెద్ద జీతంతో వారిద్దరివీ మంచి ఉద్యోగాలు. కలీగ్స్ ఇద్దరూ ఓ సంగీత విభావరికి కలిసి వెళ్లారు. అక్కడి దాకా ఓకే. కోల్డ్ ప్లే అనే ఆ షోలో ఆనంద పారవశ్యంతో సంగీత ప్రియులు ఊగిపోతున్నారు.
సీఈఓ గారు కూడా బాగా తన్మయత్వం పొందారు. వెనక నుంచి సీపీఓ మేడమ్ ను ఒడిసి పట్టుకుని కౌగలించుకున్నారు.
Ads
మేడం కూడా ఆ క్షణాలను ఆస్వాదిస్తున్నారు. వెనక నుంచి సార్ వేసిన రెండు చేతులను తన చేతులతో టైట్ గా లాక్ చేసి బంధించారు ఆమె. సుడి బాగోలేదో, పాపం పండిదో కానీ ఆ సంగీత విభావరిలో ఉన్న ‘కిస్ కామ్’ అనే కెమెరాలు సంగీత రసామృతంలో వారిద్దరూ ఒళ్ళుమరిచి ఓలలాడుతున్న దృశ్యాన్ని బంధించాయి. ఆ దృశ్యాన్ని వెంటనే ఆ పక్కనే ఉన్న పెద్ద స్క్రీన్ మీద చూపించాయి. స్టేడియం మొత్తం దీన్ని చూసింది.
‘కిస్ కామ్’ లు బంధించి పెద్ద స్క్రీన్ మీద చూపిన జంట అందరి ముందు ముద్దు పెట్టుకోవడం చేయాలన్నది నిబంధన. కిస్ చేసుకోకపోతే… కిస్.. కిస్… అని జనం అరిచి గోలచేస్తారు. అదో వెర్రి తంతు. అప్పటిదాకా గాఢ పరిష్వంగంలో మైమరిచి పులకరించి పోతున్న జంట ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. కాదు, షాక్ కు గురయ్యింది.
ప్రపంచాన్ని మరిచిపోయి హృదయ తంత్రులను నిశ్శబ్ద నిశీధిలో ఆమె వెనక నిలబడి మీటుతున్నట్లు ఉన్న సీఈఓ గారు బిత్తరపోయి కెమెరా ఫోకస్ నుంచి ఎడమవైపు తప్పించుకుని కూలబడ్డారు. ఆనంద పారవశ్యంతో మీటించుకుంటున్న మేడమ్ మరో వైపు తిరిగి తలకాయ పట్టుకున్నారు.
ఎందుకంటే, కొంపకొల్లేరు అయ్యింది. వారిద్దరూ భార్యా భర్తలు కాదు. రహస్య ప్రేమికులు. అడ్డంగా కెమెరాలో దొరికి పోయారు. ఈ దృశ్యం ప్రపంచవ్యాప్తంగా క్షణాల్లో వైరల్ అయ్యింది. కోట్ల రూపాయల ఆదాయం తెచ్చే ఉద్యోగానికి సీఈఓ రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఎంతో మర్యాదస్తుల, పరువుగల కుటుంబంలో పెరిగి విద్యా రంగంలో ఉన్న భార్య విడాకులకు సిద్ధమై ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి పోయింది. సీపీఓ ఉద్యోగం కూడా ఊడింది.
చక్కటి సంసారాలు ఉన్నా, ఆఫీసుల్లో కలీగ్స్ తో పిచ్చి వ్యవహారాలు నడిపేవారు మన దగ్గరా పెద్ద సంఖ్యలో ఉంటారు. దొరికితేనే దొంగలు. ఇట్లాంటి వారు ఇట్లనే ఎప్పుడో ఒకప్పుడు బుక్ అయి పరువు ప్రతిష్ఠలు పోగొట్టుకుంటారు.
- ఒక మనిషి అధికారాన్ని, దర్పాన్ని అడ్డం పెట్టుకునో లేదా అదనపు ఆకర్షణకు అర్రులు జాచో రిలేషన్ లోకి పోతున్నారంటే అర్థం…. దిగజారుడు స్వభావం ఉన్నట్టుగా, నమ్మదగిన వ్యక్తులు కానివారిగా కార్పొరేట్ భావిస్తుంది.ఇలాంటి వాళ్ళు స్వలాభం కోసం రూల్స్ బ్రేక్ చేయడానికి వెనకాడరని, రాంగ్ రూట్ లో వెళ్ళడానికి జంకరని అభిప్రాయ పడుతుంది. ఛీటింగ్ కేటగిరీలో ఇలాంటి వారిని చేరుస్తారు.
మీకులాగానే, నేను పనిచేసిన సంస్థల్లో ఇలాంటి చిత్తకార్తె కేసులు చూశాను. ఇందులో తప్పు ఒక్కరిది కాదు, ఏ ఇజమ్స్ వీరిని రక్షించవు. బాస చేసిన జీవిత భాగస్వామిని, పిల్లలను, కుటుంబాన్ని ఛీట్ చేసిన అపరాధం ఇద్దరిదీ. వేరే మనిషిని జీవితంలోకి ఆహ్వానించి… కట్టుకున్న భార్యను లేదా భర్తను మోసం చేయడం క్షమించరాని నేరంగా దాదాపు అన్ని సమాజాలు ప్రస్తుతానికి భావిస్తున్నాయి. మన సుప్రీం కోర్టు తీర్పు ఒకటి కొద్దిగా భిన్నంగా ఉన్నట్టు ఉంది కదా!
వర్క్ ప్లేస్ లో ఆకర్షించే అందాలు ఎప్పుడూ ఉంటాయి. బలహీనతలు పుట్టిముంచుతాయి. అందంగా ఆకర్షణీయంగా, చలాకీగా ఉండే మహిళలు మాత్రమే కాదు.. ఆ లక్షణాలు ఉన్న పురుషులు కూడా ప్రతిలింగాకర్షణ వల్ల ఆ ఊబిలో పడే ప్రమాదం ఉంది.
అందులో చిక్కుకోకుండా, దేవాలయంలాంటి వర్క్ ప్లేస్ లో సంసార పక్షంగా ఉండడం ముఖ్యం. వస్తు వినియోగ సంస్కృతి పెరిగి, విలువలకు ఉన్న వలువలు తొలిగించవచ్చని భావించి, అప్పటికి దొరికే ఆనందం మాత్రమే అంతిమం అనే జనాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆఫీసుల్లో కవ్వింపునకు లొంగకుండా, కాలుజారకుండా ఉండడం ఒక పెద్ద ఆర్ట్.
ఈ విషయంలో పంచుకోవడానికి నా దగ్గర చాలా మెటీరియల్ ఉంది గానీ, ఈ hot topic మీద ఇంతకు మించి ఈ పేస్ బుక్ లో మాట్లాడుకోవడం మర్యాద కాదనిపించి ముగిస్తున్నా. భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్/ సిస్టర్…
(అసలు ఈ కిస్ కామ్ వివాదం ఏమిటని చాలామంది అడుగుతున్నారు, అందుకని వివరంగా పబ్లిష్ చేయాల్సి వచ్చింది)
Share this Article