Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యాదగిరిగుట్ట..! డబ్బుంటే ఫైవ్ స్టార్ సేవలు, దర్శనాలు, ఆశీర్వచనాలు..!!

July 26, 2025 by Rishi

.

శ్రావణమాసం వచ్చేసింది కదా, ఇక యాదగిరిగుట్టలో సందడి పెరుగుతున్నదీ అనే వార్త ఒకటి కనిపించింది… ఇంతకుముందు దర్శనాలు, రాత్రి నిద్రలు… కానీ కాలం మారింది కదా… గిరిప్రదక్షిణలు, సత్యనారాయణ వ్రతాలు కూడా…

ఇవి చదువుతుంటే మూణ్నాలుగు రోజుల క్రితం వార్త ఒకటి గుర్తొచ్చింది… ‘‘త్వరలో యాదగిరి అని ఓ మాసపత్రిక తీసుకొస్తాం… ఓ టీవీ చానెల్ పెడతాం… ఇకపై సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్టు 1000, శ్రీవాణి ట్రస్టు తరహాలో 5 వేల రూపాయలతో గరుడ టికెట్లు… 4 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటు, 20 కోట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం, కొండ కిందే వాహనపూజ సౌకర్యం’’…. ఇదీ సారాంశం…

Ads

అంతేకాదు, సదరు శ్రీవాణి ట్రస్టు తరహా 5 వేల రూపాయల గరుడ టికెట్టు ప్యాకేజీ కూడా అధికారులు చెప్పారు… ‘‘సుప్రభాత సేవ నుంచి శయనోత్సవం వేళ వరకు అంతరాలయ దర్శనం, ఏ సమయంలోనైనా దర్శనం, గుట్ట పైవరకూ వాహన అనుమతి, వేద ఆశీర్వచనం, కండువా, కనుము, 5 లడ్డూలు, కిలో పులిహోర…’’

gutta

ఈ స్వామి వారిని తిరుపతి శ్రీవారికి పోటీగా తయారు చేస్తున్నారని ఆనందించాలా..? రకరకాల ప్యాకేజీలు, ఈ ధరల్ని చూసి విస్తుపోవాలా..? ఏ మతమైనా తమ ప్రార్థన కేంద్రాలను వీలైనంతవరకూ చారిటీతో, ధర్మప్రచార కేంద్రాలుగా డెవలప్ చేస్తుంది… ఆధ్యాత్మిక వాతావరణం క్రియేట్ చేస్తుంది… కానీ మనం..?

వీలైనంత ఎక్కువ మంది భక్తులు రావాలని ఆశిస్తుంది ఏ గుడైనా..! సత్యనారాయణస్వామి వ్రతానికి ఏకంగా 1000 రూపాయలట… ఎక్కడ ఎంత వీలైతే అంత భక్తుల జేబుల నుంచి దండుకోవడమేనా..? రూ. 5 వేలు కడితే ఎప్పుడంటే అప్పుడు అంతరాలయంలోకి తీసుకెళ్తారట, వేద ఆశీర్వచనం అట…

పైగా ఓ కండువా, ఓ కనుము, కిలో పులిహోర, 5 లడ్డూలు ఇస్తారట… ఏమిటి ఈ ప్యాకేజీలు..? తిరుమల శ్రీవాణి ట్రస్టు పోకడల మీదే బోలెడు ఆరోపణలున్నాయి, వీళ్లకు తెలుసో లేదో…

ytd

అసలు ఈ ప్రాంత ప్రజలందరికీ దశాబ్దాలుగా పేదల దేవుడు నర్సింహస్వామి… వందల కోట్లతో గుడి పునర్నిర్మాణం చేశారు, ఏం లాభం..? మేడిగడ్డలాగే..! గట్టిగా వర్షమొస్తే ఇప్పటికీ ఓమూల కురుస్తుంది… గట్టిగా నాలుగు చినుకులొచ్చినా, ఎండ కొట్టినా తలదాచుకునే వసతి లేదు… రాత్రి నిద్రకు చాన్స్ లేదు… పుష్కరిణి దిగువన ఎక్కడికో వెళ్లిపోయింది…

గుట్టపైకి వెళ్లాలంటే రూ.500… గిరిప్రదక్షిణకు పార్కింగ్ ప్లేస్ లేదు… ఇన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి.., ఇప్పుడిక రకరకాల ప్యాకేజీలతో, ప్రతి అంశాన్ని అమ్మకపు సరుకుగా మార్చి పక్కా వ్యాపార కేంద్రంగా మార్చుతున్నారనే భావన…

ygt

ఇప్పుడిక యాదగిరి అనే మాసపత్రిక అట… అయ్యా, స్వాములూ, ఇది పత్రికలు చదివే కాలం కాదు… పైగా టీవీ చానెల్ అట… అస్మదీయులు కొందరికి అడ్డాగా మారడం తప్ప అది సాధించేదేమీ ఉండదు… ఎస్‌వీబీసీ బాగోతాలు చూస్తున్నాం కదా… అదొక తెల్లగుర్రం… మరి ఇక్కడ దేనికి కొత్తగా..? ఎవరి కోసం..? ఎంచక్కా అందుబాటులో ఉన్న ఏ భక్తి చానెల్‌లోనో రోజూ కొంతసేపు అద్దెకు తీసుకుంటే సరిపోదా..?

భక్తుల సొమ్మును కాస్త ‘ధర్మంగా’ ఖర్చు పెట్టాలనే సోయి అక్కర్లేదా..? పోనీ, డీడీ యాదగిరి ఉందిగా, దాన్ని వాడుకోవడం చేతకాదా..? పైగా ఇప్పుడున్నది యూ ట్యూబ్, సోషల్ మీడియా యుగం… డిజిటల్ పత్రికలు, సోషల్ వీడియోల కాలం…

yadagirigutta

ఆంజనేయ, గరుడ, ప్రహ్లాద, రామానుజ, యాద మహర్షి విగ్రహాలను ఒక్కొక్కటీ 70 అడుగులు పొడుగుతో 3.6 కోట్లతో నిర్మిస్తారట… సరే, అదనపు ఆకర్షణ… వైష్ణవాలయమే కాబట్టి ఆంజనేయుడు, గరుడుడు వోకే… నరసింహ క్షేత్రం కాబట్టి ప్రహ్లాదుడు వోకే… ఆ రుషి పేరిటే యాదగిరి వెలిసింది కాబట్టి యాద మహర్షి వోకే… మరి రామానుజుడు..? హేమిటో… ఈ నిర్ణయాలు ఎవరివో, వీటిల్లో ఏయే నిర్ణయాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందో కూడా తెలియదు…

అసలు ఈ గుట్టకు సంబంధించి ఏం జరుగుతున్నదో సీఎంవో గానీ, దేవాదాయ శాఖ ముఖ్యులు, ఉన్నతాధికారులు గానీ ఎప్పుడైనా ఏమైనా పట్టించుకున్నారా..? భక్తుల మనోభావనలు తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా..?

yadagirigutta

వచ్చిన బంగారంతో తిరుమలకన్నా ఎత్తయిన స్వర్ణగోపురాన్ని కళ్ల ముందుంచారు, గ్రేట్… అదొక్కటీ రీసెంట్ పీరియడ్‌లో చెప్పుకోదగ్గ విశేషం… కేసీయార్ కాలంలో ఏమాటకామాట… కొత్త గుడి ప్రారంభాన్ని బీఆర్ఎస్ కార్యక్రమంగా మార్చారు తప్ప, కొందరు ముఖ్యుల నిర్ణయాలే తప్ప మిగతా రాజకీయాల పెత్తనాలు ఉండేవి కావు… ఇప్పుడన్నీ ప్రారంభమయ్యాయి… అన్నట్టు పాలక స్వాములూ… త్వరలో ఇంకేమైనా సరసమైన ప్యాకేజీలు రాబోతున్నాయా..?

చివరగా… ఆ పక్కనే ఉన్న స్వర్ణగిరి ప్రైవేటు వెంకటేశ్వరస్వామి గుడికి అంతమంది సామాన్య భక్తులు పోటెత్తుతున్నారు కదా… అక్కడ ‘రేట్ల’కూ, ఆధ్యాత్మిక వాతావరణానికీ, ఇక్కడ ఫైవ్ స్టార్ ప్యాకేజీలు, వాణిజ్య వాతావరణానికీ నడుమ తేడా ఏమిటో, వ్యాపార దృక్పథంతోకాదు, ఓసారి నిర్మలమైన భక్తహృదయంతో ఆలోచించండి..!!

yadagiri

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హరిహరా..! ఇవేం కలెక్షన్లు నాయకా..? థియేటర్లు నిర్మానుష్యం..!!
  • ఏం విజయ్..? మరీ దర్శకులకు ఫోన్లు చేసి చాన్సులు అడుగుతున్నావా..?!
  • సీఎం రమేష్‌ను గోకాడు కేటీఆర్… పాత బాగోతాలన్నీ బయటికొస్తున్నయ్…
  • వాళ్లే మానవ వంతెన అయ్యారు… విద్యార్థులను రక్షించారు…
  • నో… నో… కథాకథనాలేవీ చిరంజీవి, యండమూరి రేంజ్ కానేకావు..!!
  • రాముడే ఓ పాఠం..! ఖాకీ శిక్షణలోనూ రామాయణ పారాయణం..!
  • మహావతార్ నరసింహ..! పిల్లలకు పురాణాలు పరిచయం చేయండి..!!
  • యాదగిరిగుట్ట..! డబ్బుంటే ఫైవ్ స్టార్ సేవలు, దర్శనాలు, ఆశీర్వచనాలు..!!
  • తల్లి గర్భంలో నవమాసాలు మోస్తే.., తండ్రిగా పది నెలలు గుండెల మీద..!!
  • వ్యతిరేక గొంతులో పచ్చివెలక్కాయ… రేవంత్‌‌పై కాంగ్రెస్ హైకమాండ్ హేపీ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions