.
( రమణ కొంటిెకర్ల
) ….. రోడ్డు తెగితే.. వాళ్లు మానవ వంతెన అయ్యారు… 35 మంది విద్యార్థులను కాపాడారు!
కొన్ని ఘటనలు అతిశయోక్తిలా కనిపిస్తాయి. కానీ, ఆ పరిస్థితులను కళ్లతో చూసినప్పుడు అవెంత నిజమో, ఎంతీ అవసరమో అక్కడి దృశ్యాలు చెబుతాయి. అలాంటి ఓ విచారకమైన దృశ్యమే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ట్రెండింగ్ టాపిక్ గా మారింది.
Ads
ఏకంగా 35 మంది పిల్లలను కాపాడటానికి ఇద్దరు వ్యక్తులు మానవ వంతెనగా మారిన కథ అది…
పంజాబ్ మల్లియన్ లో భారీ వర్షాలు అక్కడి గ్రామీణ భారతాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. మల్లియన్, రసూల్ పూర్ అనే ఓ రెండు గ్రామాలను కలిపే రోడ్డు కింద ఓ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ వరదకు రెండు గ్రామాలను కలిపే రోడ్డు పూర్తిగా ఎక్కడికక్కడ తెగిపోయింది.
అప్పటికే మల్లియన్ లో స్కూల్ కు వెళ్లిన పిల్లలకు ఉదయం పది గంటల సమయంలో అప్పటికే భారీ వర్షాలు కురుస్తుండటంతో సెలవు ప్రకటించారు. ఆ విద్యార్థులంతా ఇళ్లకు తిరిగి వెళ్లాలంటే ఆ వాగు దాటి రసూల్ పూర్ కు రావాల్సి ఉంది.
కానీ, వాగు మాత్రం నడుం పైన లోతు వరకు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఐదడుగుల వెడల్పుతో ఆ కల్వర్ట్ పైనున్న బ్రిడ్జ్ తెగిపోయింది. దాంతో విద్యార్థులు ఆ వాగు దాటితేనేగానీ వెళ్లలేని ఆందోళనకర స్థితి నెలకొంది. మరోవైపు, వర్షం తగ్గేలా లేదు. ఆ క్రమంలో ఇద్దరు స్థానికులు చూపిన తెగువ ఇప్పుడు అభినందనలందుకుంటోంది.
అవునూ, ఇద్దరు స్థానికులే బ్రిడ్జ్ గా మారిపోయారు. అలా తమపైనుంచి 35 మంది బడి పిల్లలను వాగు దాటించారు. విద్యార్థుల ప్రమాదకర పరిస్థితి గురించి స్థానిక గురుద్వారాకు సమాచారమందండంతో పెద్దఎత్తున అక్కడి జనం తరలివెళ్లి గుమిగూడారు. అందులో సుఖ్వీందర్ సింగ్, గగన్ దీప్ సింగ్ అనే ఇద్దరే ఆ అడ్వంచరెస్ ఇన్సిడెంట్ కు ప్రధాన కారకులై విద్యార్థుల్ని కాపాడారు.
ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఆలోచించకుండా.. అంతవరకూ పిల్లల ఓపికకు పరీక్ష పెట్టకుండా ఒక వ్యూహాన్ని అమలు చేద్దామని ఆలోచించారు. సుఖ్వీందర్, గగన్ దీప్ ఇద్దరు నీళ్లల్లోకి దిగి.. ఒకరినొకరు గట్టిగా పట్టుకుని… రెండువైపు ఒడ్డును వాళ్లు పట్టుకుంటే.. వారి పైనుంచి విద్యార్థులు వెళ్లే ఏర్పాటు చేశారు.
తెగింది చిన్న పార్టే అయినా.. అక్కడ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో… విద్యార్థులు భయపడ్డారు. దాంతో వారిద్దరే నీళ్లల్లోకి దిగి.. వారే ఓ మానవ బ్రిడ్జ్ గా ఏర్పడ్డారు. ఇప్పుడు వీరి కథ సోషల్ మీడియాలో వైరల్ గా మారి అప్లాజ్ అందుకుంటోంది.
35 మంది పిల్లలకు ఎలాంటి హాని జరక్కుండా కాపాడి వారిని తమ ఇళ్లకు, గమ్యస్థానాలకు చేర్చడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక జుగాద్ పంచాయితీ సభ్యులు వారు చూపిన తెగువ, ధైర్యాన్ని పొగుడ్తూ క్లిష్టపరిస్థితుల్లో వారు వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురిపించారు.
అస్తవ్యస్థంగా మారిన ఆ రహదారిని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని, లూథియానా అధికారగణం స్పందించాలని.. మార్గాన్ని సుగమం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి ఆ మల్లియన్, సుల్తాన్ పూర్ గ్రామాలు. సుఖ్వీందర్, గగన్ దీప్ చూపిన చొరవ సంక్షోభ సమయాల్లో సమాజం స్పందించాల్సిన తీరుకు ఓ ఉదాహరణగా చర్చనీయాశమవుతోందిప్పుడు…
Share this Article