Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రివెడ్ షూట్స్… ఈ దిక్కుమాలిన తంతును అర్జెంటుగా బహిష్కరిద్దాం…

July 28, 2025 by M S R

.

పెళ్ళిలో పురోహితుడి పాత్ర గొప్పదా? ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పాత్ర గొప్పదా? అన్న ప్రశ్నే ఇప్పుడు అర్థరహితమైనది. చిన్నప్పుడు స్కూళ్లల్లో కత్తి గొప్పదా- కలం గొప్పదా? అన్న విషయంమీద వ్యాసాలు రాయించేవారు. వక్తృత్వపు పోటీలు నిర్వహించేవారు. కలమే గొప్పదని నిరూపించడానికి పిల్లలు నానా అగచాట్లు పడేవారు.

పెళ్ళిలో ఓం ప్రథమంగా నిశ్చయ తాంబూలాలకు ముహూర్తం నిర్ణయించేది పురోహితుడు. మాంగళ్యధారణకు శుభలగ్నం నిశ్చయించేది పురోహితుడు. జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టించేది పురోహితుడు. అగ్నిసాక్షిగా తాళి కట్టించేది పురోహితుడు. తలంబ్రాలు చల్లించేది పురోహితుడు. దండలు మార్పించేది పురోహితుడు.

Ads

కొంగుముడి వేయించేది పురోహితుడు. హోమాగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయించేది పురోహితుడు. శతమానం భవతి అని ఆశీర్వదించేది పురోహితుడు. దంపతులతో వ్రతం చేయించేది పురోహితుడు- అని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే.

పెళ్ళిలో ఓం ప్రథమంగా నిశ్చయ తాంబూలాలు కాగానే ప్రీ వెడ్ షూట్ కు ముహూర్తం నిర్ణయించేది కెమెరామ్యాన్. మాంగళ్యధారణకంటే చాలా ముందే ఎంపికచేసిన ప్రత్యేక లొకేషన్లలో హనీమూన్ లాంటి శృంగార సరస రసోల్లాస గట్టి కౌగిళ్ళు, ఘాటు చుంబనాల నాటు నాటు సన్నివేశాలను సృష్టించేది కెమెరామ్యాన్.

పందిట్లో జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టించేది కెమెరామ్యాన్. అగ్నిసాక్షిగా పురోహితుడు తాళి కట్టించినా…విభిన్న కెమెరా యాంగిల్స్ కోసం అదే పందిట్లో అదే ముహూర్తానికి ముందో వెనుకో మళ్ళీ మళ్ళీ తాళి కట్టించేది కెమెరామ్యాన్. తలంబ్రాలు ఎలా చల్లితే ఫోటోలు, వీడియోలు సినిమాటిగ్గా ఉంటాయో చెప్పి…ఆపి…ఆపి చల్లించేది కెమెరామ్యాన్.

దండలు మార్పించేది, వధూవరులను కొయ్యబొమ్మలుగా మార్చి…పందిట్లో పెద్దలు నిరీక్షిస్తుండగా వేళ దాటినా సాగరసంగమం పిల్ల ఫోటోగ్రాఫర్ భంగిమల్లో నిలుచోబెట్టేది కెమెరామ్యాన్. వేసిన కొంగుముడినే మళ్ళీ వేస్తున్నట్లుగా నటింపచేసేది కెమెరామ్యాన్.

హోమాగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసేప్పుడు ఎక్కడ ఆగాలో, ఎప్పుడు ముందుకు సాగాలో చెప్పేది కెమెరామ్యాన్. శతమానం భవతి అని వచ్చినవారు ఆశీర్వదించేలోపు శిలా విగ్రహాల్లా కదలకుండా నిలుచోండనో, పక్కకు జరగండనో విసుక్కునేది కెమెరామ్యాన్. దంపతుల వ్రతం మధ్యలో దూరి…వారి వీపులమీదుగా సత్యనారాయణస్వామిని ఫ్రేములో బంధించేది కెమెరామ్యాన్.

…ఇప్పుడు చెప్పండి. “తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడు”-అనుకుని పక్కకు వెళ్లిపోయిన పురోహితుడు గొప్పవాడా? పౌరోహిత్యం, మంత్రం, హోమం, అగ్నిసాక్షి ప్రదక్షిణలు ఒక తంతు- ఫోటోలు, వీడియోలే నిత్యం- సత్యం అనుకుని తనను తాను హెచ్చించుకున్న కెమెరామ్యాన్ గొప్పవాడా?

లేక పెళ్ళంటే ఫోటోలు, వీడియోలే ప్రధానమనుకుని పురోహితుడిని, ఆయన చేసే పెళ్ళి ప్రక్రియను వెనక్కు నెట్టేసి…కెమెరామ్యాన్లకు పౌరోహిత్య బాధ్యతలను అప్పగించిన మనం గొప్పవాళ్ళమా?

అన్నట్లు- సమకాలీన సమాజంలో నలభై శాతం పెళ్ళిళ్ళు పెటాకులవుతున్నట్లు సుప్రీం కోర్టు న్యాయమూర్తి అధికారిక లెక్కలతో చెబుతున్నారు. పెటాకులైనవి పురోహితుడు చేసినవా? ఫొటోగ్రాఫర్లు చేసినవా?

తప్పు కెమెరామ్యాన్లదా? మనదా?
ఈ వైపరీత్యానికి, ఆచార దోషానికి ఎవరు బాధ్యులు? ఎవరు ఎవరికి వేయాలి శిక్ష? ఎవరో ఒకరు నడుం బిగించాలి. ఎక్కడో ఒక చోట మార్పు రావాలి. అలా ఆలోచించి కడప జిల్లా ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ ఈ విషయం మీద ఒక తీర్మానం చేసి ఒక కరపత్రాన్ని విడుదల చేసింది. అందులో ముఖ్యమైన విషయాలివి:-

pre wed
# పెళ్ళికి ముందు ప్రీ వెడ్ షూటింగులను నిషేధించాలి.
# మాంగళ్య ధారణ సమయంలో ఫొటోగ్రాఫర్ల, వీడియోగ్రాఫర్ల డైరెక్షన్, ఓవరాక్షన్ లను కట్టడి చేయాలి.
# హిందూ వివాహ సంప్రదాయాలను, పవిత్రతను పరిరక్షించుకోవాలి.
# పెళ్ళిలో పురోహితుడి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు మాత్రమే వినిపించాలి.
# జీలకర్ర, బెల్లం పెట్టుకోవడానికి ముందు దంపతులుగా కలిసి ఉన్నట్లు ఎలాంటి వీడియోలు, ఫోటోల షూట్లు పెట్టుకోకూడదు.

# మాంగళ్య ధారణ, హోమాలు, పెద్దల ఆశీర్వచనాలు అయిపోయాక ఎన్ని షూట్లయినా పెట్టుకోవచ్చు.
# పెళ్ళి ఫోటోలు, వీడియోల కోసం కాదని వధూవరులు, వారి తల్లిదండ్రులు గుర్తించాలి.
# ఆధ్యాత్మికత, సంప్రదాయం, ఆచారాలను గౌరవించేవారు హిందూ వివాహ ప్రక్రియలో ఉన్న పవిత్రతకు తూట్లు పొడవకూడదు. అగ్నిసాక్షి, మంత్రం సాక్షికి ఉన్న అంతరార్థాన్ని చెడగొట్టకూడదు.
# ఈకాలంలో చాలా పెళ్ళిళ్ళు పెటాకులు కావడానికి ఇలాంటి వింతపోకడలే కారణమా…

ఈ తీర్మానాన్ని ఎంతమంది గౌరవించి పాటిస్తారో కానీ…ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ ఆవేదన మాత్రం అర్థం చేసుకోదగ్గది. వారి సూచనలు పాటించదగ్గవి. కెమెరామ్యాన్లకు కొన్ని సలహాలిచ్చి, వారు పెళ్ళి పందిట్లో ఎప్పుడు ఎక్కడికి రావాలో? ఎక్కడికి రాకూడదో? చెబితే సరిపోతుంది. మనసుంటే మార్గముంటుంది. సనాతనధర్మ పరాయణులందరూ ఆలోచించి… పాటించాల్సిన సూచనలు చేసిన ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభకు అభినందనలు. – పమిడికాల్వ మధుసూదన్    9989090018

పనిలోపనిగా… మనవి కాని రికార్గింగ్ డాన్సుల సంగీత్‌లు, హల్దీలు, మెహందీలు ఎట్సెట్రా కూడా నిషేధిస్తే సగటు మధ్యతరగతి పెళ్లి కూతురు తండ్రి రక్షింపబడతాడు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సంతానసాఫల్యం… ఈ వ్యాపారం అనేక మార్గాలు… ఎన్నెన్నో మోసాలు…
  • ఓహ్… స్టార్లను తీసుకోకపోవడానికి అదా కారణం..? బాగు బాగు..!!
  • ఫుడ్ లవర్స్ జంట… నవ్వుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ…
  • కుక్కలే కదా కూస్తే కుదరదు… డాగ్స్ కేర్‌టేకర్లకు వేల కోట్ల ఉపాధి..!!
  • దుల్కర్ కొత్త మూవీ ‘కాంత’..! తమిళ తొలి సూపర్ స్టార్ బయోపిక్..!!
  • తెలంగాణ రాజకీయాలు కదా… ఎవరికైనా, ఏ పోకడకైనా ఇది ఇష్టా‘రాజ్యం’…
  • భారీ నెగెటివిటీ మోస్తున్న అనసూయ… మళ్లీ ట్రోలింగ్ షురూ…
  • రక్షించలేని ఆ అసమర్థ మొగుడికన్నా ఆ కామాంధుడే నయం.,.!!
  • మిస్టర్ కరణ్ థాపర్… మరి ఆ ఉగ్ర బాధితులకు న్యాయం మాటేమిటి..?!
  • అమ్మాయి కనిపించగానే అలా పొట్ట లోపలికి లాగి, ఊపిరి బిగబట్టి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions