Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రక్షించలేని ఆ అసమర్థ మొగుడికన్నా ఆ కామాంధుడే నయం.,.!!

July 29, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……… సుహాసిని నట జీవితంలో అద్భుతంగా నటించిన మరో సినిమా ఈ శిక్ష సినిమా . At her best . ఈ సినిమాకు కూడా ఆవిడే షీరో . చాలా విప్లవాత్మక ముగింపు . బహుశా ఆ ముగింపు ప్రేక్షకులకు మింగుడు పడి ఉండకపోవచ్చు . మింగుడు పడటం కష్టమే .

గోదావరి ఒడ్డున ఓ చిన్న గ్రామంలో ఓ కీచక , దుశ్శాసన వారసుడు కిరీటం లేని మృగాడుగా భాసిల్లుతూ ఉంటాడు . బాగా డబ్బు , మదం , కండ బలం , పరపతి ఉన్నవాడు . ఆ గ్రామానికి అతను అడింది ఆట పాడింది పాట . ఈ జార్జ్ ప్రసాద్ పాత్రను శరత్ బాబు చాలా గొప్పగా పోషించాడు .

Ads

ఆ గ్రామానికి గుడి పూజారిగా చంద్రమోహన్ భార్య సుహాసినితో వస్తాడు . మడి , ఆచారం , దేవుడు , పూజ , ఉపవాసాలతో నిష్ఠగా ఉంటుంది ఆ గృహిణి . రోజులో ఇరవై రెండు గంటలూ కట్టుకుని ఉండేది మడినేగా మొగుడిని కాదుగా అని భర్త గారు రుసరుసలాడుతుంటాడు కూడా .

అచ్చోసిన ఆంబోతు జార్జి కళ్ళు ఈ గృహిణి మీద పడతాయి . పట్టపగలు మద్యం నిషాలో పూజారి గుడికి వెళ్ళిన సమయంలో ఆమె ఇంటికే వచ్చి మానభంగం చేస్తాడు . అప్పుడే ఇంట్లోకి వచ్చిన పూజారి నిశ్చేష్టుడు అవుతాడు . భార్య ఎలాంటి తప్పు చేయలేదని తెలిసినా ఆ దుస్సంఘటనని జీర్ణించుకోలేక గౌతమ మహాముని అహల్యను బాధ్యురాలిని చేసిన చందాన ఇంటిని ఇల్లాలిని వదిలి వెళ్ళిపోతాడు .

పుట్టింటికి , మరో చోటికి వెళ్ళలేని స్థితిలో తనను ఎవరయితే నాశనం చేసాడో అతని ఇంటికే వెళుతుంది . ఈ అనూహ్య పరిణామానికి ఊరి జనం , మృగాడు కూడా బిత్తరపోతారు . తనకు తానే జైలు శిక్ష విధించుకుంటుంది . సరిదిద్దలేని తప్పు చేసిన మృగాడులో పరివర్తన వస్తుంది . మంచివాడు అవుతాడు . సుహాసినిని గౌరవిస్తాడు , సంరక్షిస్తాడు .

చేసిన పాపం ఊరకపోదు . శిక్ష అనుభవించాల్సిందే . ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది మానవుడి చేతుల్లో ఉండదు . మృగాడి కుడి కాలు , కుడి చేయి పడిపోతాయి . రోగిష్టి అయి ప్రతి క్షణం పశ్చాత్తాపంతో కుమిలి కుమిలి చనిపోతాడు . చనిపోయే ముందు ఆ ఊళ్ళోనే హెడ్ కానిస్టేబులుగా పనిచేసే సత్యనారాయణని పూజారి గారు ఎక్కడ ఉన్నా వెతికి తెమ్మని ప్రార్ధిస్తాడు .

సత్యనారాయణ పూజారిని వెతికి పట్టుకుని జరిగిన విషయాలన్నీ వివరిస్తాడు . గ్రామానికొచ్చి మృగాడిని క్షమించమని కోరుతాడు . పూజారి వచ్చే లోపే మృగాడు మరణిస్తాడు . భార్యను తనతో వచ్చేయమని అడుగుతాడు . ఇక్కడే అనూహ్యమైన మలుపు .

తనకు అన్యాయం తన ప్రమేయంతో జరగనప్పుడు, రక్షించవలసిన భర్త దమయంతిని నలుడు వదిలేసినట్లు వదిలేసి పోయినందుకు గాండ్రిస్తుంది . నువ్వేం మొగుడివి , మృగాడయినా తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడి తనను సంరక్షించిన మృగాడికే విధవగా ఉంటానని తాళిని విసిరేస్తుంది .

నిజమే కదా ! మనం పెరిగిన వాతావరణంలో భార్య ఎప్పుడూ ఎదురు మాట్లాడకూడదు . కాళ్ళ మీద పడిపోతూనే ఉండాలి . భర్త కావాలని వివాహేతర సంబంధాలను పెట్టుకున్నా నువ్వే దేవదేవుడివి అంటూ భార్య భర్తని ఒగ్గేసి అంగీకరించాలి . ఎలాంటి మలినం లేనివాడు అయిపోతాడు .

తన ప్రమేయం లేకుండా ఓ మృగాడి పశు వాంఛకు బలయిన స్త్రీ మాత్రం మలినం అవుతుంది . ముట్టుకుంటానికి కూడా పనికి రాదు . ఇదీ మనం పెరిగిన సమాజం . మరి ఇలాంటి సమాజం ఇలాంటి విప్లవాత్మక ముగింపుని జీర్ణించుకోగలదా !? అదే జరిగింది ఈ సినిమాకు .

సినిమా వ్యాపార జయాజయాలు ఎలా ఉన్నా సుహాసిని నటన మాత్రం అద్భుతం . మరో గొప్ప పాత్ర సత్యనారాయణది . బాగా నటించారు . నిస్సహాయ భర్తగా , అందరు భర్తల్లాంటి భర్తగా , భార్యంటే విపరీతమైన పిచ్చి కలిగిన వ్యక్తిగా చంద్రమోహన్ కూడా బాగా నటించాడు .

1985 జూలైలో ఈ సినిమా వచ్చే టైంకే ఆనాటి ముఖ్యమంత్రి యన్టీఆర్ మునసబు కరణాల వ్యవస్థని రద్దు చేసారు . ఆ రెండు పాత్రల్లో పి యల్ నారాయణ , పద్మనాభం నటించారు . ఆ వ్యవస్థ గ్రామాలను ఎలా పాడుచేసాయో ఈ సినిమాలో చూపబడుతుంది .

అలాంటి మరో సమకాలీన పాత్ర సుత్తి వీరభద్రరావుది . ఆ పాత్ర ద్వారా రాజకీయ నాయకుల మీద కావలసినన్ని చురకలు , చెణుకులు పడతాయి . మరో మంచి పాత్ర రాళ్ళపల్లిది . మృగాడి సేవకుడి పాత్ర . బాగా నటించాడు .

1985 లోనే తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన ఆనాటి అందాల నటి రజని ఈ సినిమాలో రాజేషుకి జోడీగా నటించింది . ఇతర పాత్రల్లో ఆలీ , కాకినాడ శ్యామల , ఆనంద మోహన్ , డబ్బింగ్ జానకి , సాక్షి రంగారావు , జ్యోతిలక్ష్మి , ప్రభృతులు నటించారు .

కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో ఆత్రేయ గారి పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జేసుదాసులు మన చెవుల తుప్పు వదిలిస్తారు . విధి పగలేసిన పుత్తడి బొమ్మా అంటూ సాగే జేసుదాస్ పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది .

మరో శ్రావ్యమైన పాట పాడుతూ ఉంటాను నీ తోడుగా ఉంటాను అంటూ సాగుతుంది ఈ పాట . చిత్రీకరణ కూడా భిన్నంగా ఉంటుంది . ఒక వైపు భార్యాభర్తలు , మరో వైపు మృగాడు ఎవరికి వారు తమను ఊహించుకుంటూ ఉంటారు . ఓ డ్యూయెట్ రాజేష్ రజనిల మీద ఉంటుంది . నా వయసుకు చురకవు నీవేగా . దర్శకుడు రేలంగి నరసింహారావు అందంగా చిత్రీకరించారు ఈ పాటను .

ఈ సినిమాకు పాటలతో పాటు ఆత్రేయ గారు మాటల్నీ వ్రాసారు . చాలా పదునుగా గుచ్చుకుంటాయి . ఆయనే వ్రాసారా అనిపిస్తుంది . రాజకీయాల మీద , పోలీస్ స్టేషన్లలో అవినీతి మీద బాగా చురకలు వేసారు . మచ్చుకి ఒక డైలాగ్ . పెద్ద ఆఫీసర్ వస్తే కేసు చిన్నదవుతుంది . అచ్చు మన సిబిఐ , ఇడి లాగా . వాళ్ళు వస్తున్నారంటే కేసుని తెమల్చకుండా ఉండేందుకే అని మనం ఇప్పుడు అనుకుంటున్నట్లుగా .

హాస్య చిత్రాలకు చిరునామా అయిన రేలంగి నరసింహారావు ఇంత సీరియస్ కధను డైరెక్ట్ చేయటం గొప్పే . బాగా దర్శకత్వం వహించారు . గోదావరి అందాలను , పల్లెటూరి అందాన్ని యస్ గోపాలరెడ్డి చక్కగా చూపారు .

ఇంతటి విప్లవాత్మక ముగింపు సినిమా వెనుక ఓ స్టోరీ ఉంది . ప్రముఖ నటి లక్ష్మి కావాలని ఈ కధను సినిమాగా తీయించి ప్రధాన పాత్రలో నటించింది . ఆనంద వికటన్ పత్రికలో వచ్చిన ఓ షార్ట్ స్టోరీ తమిళ సినిమా శిరైకు ఆధారం .

శిరై అంటే జైలు . లక్ష్మి గొప్పగా నటించింది . ఆమెకు ఏమీ తీసిపోని విధంగా సుహాసిని కూడా నటించింది . ఒరిజినల్ తమిళ కధ రచయిత పేరు అనూరాధా రమణన్ .

Undoubtedly an unmissable thought- provoking , emotional , drama-filled movie . ముగింపు జీర్ణించుకోలేక పోయినా చూడతగ్గ , చూడవలసిన సినిమా . యూట్యూబులో ఉంది . సినిమా ప్రేమికులు , సుహాసిని అభిమానులు , వినూత్న ఆలోచనాపరులు తప్పక చూడాలి . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సంతానసాఫల్యం… ఈ వ్యాపారం అనేక మార్గాలు… ఎన్నెన్నో మోసాలు…
  • ఓహ్… స్టార్లను తీసుకోకపోవడానికి అదా కారణం..? బాగు బాగు..!!
  • ఫుడ్ లవర్స్ జంట… నవ్వుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ…
  • కుక్కలే కదా కూస్తే కుదరదు… డాగ్స్ కేర్‌టేకర్లకు వేల కోట్ల ఉపాధి..!!
  • దుల్కర్ కొత్త మూవీ ‘కాంత’..! తమిళ తొలి సూపర్ స్టార్ బయోపిక్..!!
  • తెలంగాణ రాజకీయాలు కదా… ఎవరికైనా, ఏ పోకడకైనా ఇది ఇష్టా‘రాజ్యం’…
  • భారీ నెగెటివిటీ మోస్తున్న అనసూయ… మళ్లీ ట్రోలింగ్ షురూ…
  • రక్షించలేని ఆ అసమర్థ మొగుడికన్నా ఆ కామాంధుడే నయం.,.!!
  • మిస్టర్ కరణ్ థాపర్… మరి ఆ ఉగ్ర బాధితులకు న్యాయం మాటేమిటి..?!
  • అమ్మాయి కనిపించగానే అలా పొట్ట లోపలికి లాగి, ఊపిరి బిగబట్టి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions