Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సంతానసాఫల్యం… ఈ వ్యాపారం అనేక మార్గాలు… ఎన్నెన్నో మోసాలు…

July 29, 2025 by M S R

.

సంతానభాగ్యం…! గొడ్రాలు…! మాతృత్వం కోసం ఆశ, ఓ తపస్సు… గొడ్రాలు అనే ఆ పదం వినిపించకుండా ఉండటం కోసం… పిల్లల్లేనివాళ్లు ఎన్నెన్నో మార్గాలు వెతుకుతారు… ఎవరేం చెప్పినా వింటారు… ఆచరిస్తారు… ఆశ, ఆశ, ఆశ…

అదే చాలామందికి సంపాదన మార్గం… ఇప్పుడు ఓ డాక్టరమ్మ సరోగసీ అని నమ్మించి, 35 లక్షలు మింగి, చివరకు 90 వేలకు కొన్న ఓ శిశువును చేతులో పెట్టిన ‘సృష్టి’ మోసం గురించి చదువుతున్నాం కదా… అలాంటివి బోలెడు… ఇప్పుడిది బయటపడింది, అంతే… పైగా మీ వీర్యమే, మీ అండమే, వెరసి మీ జెనెటిక్ సంతానమే అని నమ్మబలకడం…

Ads

డాక్టర్ నమ్రతకు హైదరాబాదులోనే కాదు, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాల్లో కూడా ఈ క్లినిక్కులున్నాయనీ, పలు కేసులు కూడా నమోదై ఉన్నాయనీ వార్తలొస్తున్నాయి… నెట్‌లో చెక్ చేస్తుంటే ఇతర రాష్ట్రాల్లోనూ ఈమెకు క్లినిక్కులు ఉన్నాయట… గతంలో కేసులు నమోదైనా సరే యథేచ్చగా ఆమె అండపిండ వ్యాపారం నిరాటంకంగా నడుస్తున్న తీరు మొత్తం వ్యవస్థకే సిగ్గుచేటు…

చివరకు బీరు తాగించి, బిర్యానీ తినిపించి, బ్లూ వీడియోలు చూపించి, వీర్యం సేకరించి… దాన్నీ అమ్ముకునే మోసాలూ చదువుతున్నాం కదా… ఇది ఎన్నేళ్లుగానో ఉంది… రిక్షావాళ్లు, అడ్డా కూలీల నుంచి అప్పటికప్పుడు వీర్యం సేకరించి, మహిళలకు ఇంజక్ట్ చేసిన ఉదాహరణలూ పాతికేళ్ల క్రితమే చదివినట్టు గుర్తు…

పూజలు చేయిస్తారు, ఆశ్రమాల్లో ఉంచుతారు… అడ్డమైన మూలికలను మింగిస్తారు… కషాయాలు తాగిపిస్తారు… ఫలానా గుడిలో ఇచ్చే విశిష్ఠ ప్రసాదంతో సంతానం గ్యారంటీ అట… ఫలానా గుడి కోనేట్లో మునుగు… ఫలానా ప్రార్థన స్థలానికి వెళ్లు… ఫలానాచోట మొక్కుకో… కడుపు పండటం పేరిట ఇలా ఎన్నో… ఎన్నెన్నో…

ఇవేవీ ఫలించక దత్తత తీసుకుందాం ఎవరినైనా అనాథల్ని అనుకుంటే… దానికీ లీగల్ ప్రొసీజర్ ఈ ఫర్టిలిటీ దందాలకన్నా సంక్లిష్టం… అందుకే శిశువుల కొనుగోళ్లు అనధికారికంగా బోలెడు… ఇవన్నీ గాకుండా, సంతానం కోసం కళ్లుమూసుకుని, అన్నీ చంపుకుని, అనైతిక వక్రమార్గాలు సైతం… సంతానం లేని ఆడది అందరికీ అలుసు… ఛ… ఇవన్నీ ఒకెత్తు అయితే మగపిల్లాడు పేరిట దందాలు అవి వేరు…

ఆరేడు రోజుల క్రితం సాక్షి సైటులో ఓ వార్త… కుళ్లాకర్ రైస్ అట… సంతాన ఔషధం అట అది… అదెక్కడిదాకా వెళ్లిందంటే… కొందరితో ఆ అన్నం (రెడ్ రైస్) తినిపిస్తే బ్రహ్మాండమైన రిజల్ట్ అట… సంతానం గ్యారంటీ అట… మొదట సిజేరియన్ అయితే రెండోసారి సహజ ప్రసవం అట… పాలు బాగా పడతాయట, చనుబాల కేంద్రాలకూ అదనపు పాలు సప్లయ్ చేసేంత..,

మట్టికుండల్లో వండుకుని తింటే మరీ శ్రేష్ఠమట… పీసీవోడీ, అబార్షన్లు, మిస్ క్యారేజీలకు ఇక చెల్లుచీటి అట… పిల్లలు కూడా ఎక్కువ ఏడవకుండా పద్ధతిగా, చురుకుగా పెరుగుతారట… దీనికి ఏదైనా శాస్త్రీయ ఆధారం ఉందా..? లేదు… గ్రోక్‌ను గోకినా, చాట్‌జీపీటీని వేధించినా దొరకలేదు…

అండాల శీతల నిల్వ కేంద్రాలు… స్పెరమ్ బ్యాంకులు… మన దగ్గర వీర్యదాతల పేర్లు బహిర్గతం చేయరు… కానీ అదేదో దేశంలో తనెవరో 184 మందికి వీర్యదానం చేశాడట… ఎవరెవరికి వీర్యం ఇచ్చారో కూడా వివరాలు ఉన్నాయట, ఆ దేశాల్లో బహిర్గతం చేయడానికి వీలుందేమో… తన ఆస్తిని వాళ్లందరికీ పంచుతాడట… అసలు ‘సంతాన సాఫల్యం’ అనే పదం చుట్టూ భూగోళం తిరుగుతుంది… నిజం… తరతరాలుగా, ప్రపంచవ్యాప్తంగా, అన్ని జాతుల్లోనూ…

ఆమధ్య నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టిల సినిమా ఒకటి వచ్చింది… మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి… ఎంపిక చేసుకున్న లక్షణాల మగమనిషి నుంచి వీర్యం సేకరించి, కడుపు పండించుకోవడం మీద సున్నితంగా చర్చిస్తుంది సినిమా… బాగుంటుంది సినిమా… అంతకుముందు సరోగసీ మీద యశోద అని సమంత సినిమా…

1981లోనే అద్దెగర్భం మీద శోభన్‌బాబు, జయసుధ, సీమ నటించిన సంసారం సంతానం సినిమా… 1996లో జగపతిబాబు, రుచిత ప్రసాద్, మహేశ్వరి నటించిన జాబిలమ్మ పెళ్లి కూడా సరోగసీ పైనే… 2001లో 9 నెలలు అని సౌందర్య గొప్పగా నటించిన సినిమా… 2021లో మిమీ అనే హిందీ సినిమా… కృతిసనన్ నటించింది…

I am మూవీలో నందితాదాస్… 2002లో ఫిల్‌హాల్ సినిమాలో టబు, సుస్మితాసేన్… 2001లో చోరీచోరీ చుప్కే చుప్కేలో సల్మాన్, ప్రీతి జింతా, రాణి ముఖర్జీ… 1983లో దూసరీ దుల్హన్, ఇందులో షబానా ఆజ్మీ, షర్మిలా ఠాగూర్… ఇలా కొన్ని సినిమాలు కృత్రిమ గర్భధారణ, సంతాన సాఫల్యం, అద్దె గర్భం వంటివి సున్నితంగా చర్చించాయి…

ఈ ‘సృష్టి’ మోసం గురించి చదివిన తరువాత ఓ యువతి అడిగింది సోషల్ మీడియాలో… ఇప్పుడంతా డబుల్ ఇన్‌కమ్, నో కిడ్స్ (DINK) ట్రెండ్ కదా సర్, ఇంకా పిల్లల్లేకపోతే ఇంత తల్లడిల్లిపోవాలా అని… ఏమో, కొత్తతరం ‘సంతానం‘ అనే కథల్ని ఇంకెన్ని మలుపులు తిప్పనున్నారో..!!

అవును, అసలు పెళ్లి అనే జంఝాటమే లేకుండా సహజీవనం వితవుట్ కిడ్స్ అనే ధోరణి పెరుగుతోంది కదా క్రమేపీ… అనేక దేశాల్లో..!! సోవాట్..? పిల్లల్లేకపోతే అదేమైనా అపచారమా..? నేరమా..? అవలక్షణమా..? ఎందుకీ ఈ వివక్ష…!? చెబుతూ పోతే సంతానసాఫల్యం అధ్యాయం ఎప్పుడూ ఒడవదు, తెగదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సారీ రాజేష్… మన దిక్కుమాలిన న్యాయవ్యవస్థలో ఇక ఇంతే…
  • హీరోయిన్‌ను మారుద్దామని పంచాయితీ పెడితే… హీరోనే పీకిపారేశాడు…
  • మ్… తెలుగు పాటల్లో పూర్ణ అనుస్వరంపై చంద్రబోస్ సరైన వ్యాఖ్యానం…
  • టమాట రైతుకు గట్టి భరోసా… టమాటర్ పాలసీతో చైనాను దాటేయొచ్చు..!!
  • BRS లో చేరగానే… ఈ కొత్త బాస్‌పై ఆ పాత ఆరోపణలన్నీ డిలిటేనా..?
  • 70 ఏళ్ల క్రితమే ఓ సూపర్ పాన్ ఇండియా మూవీ… ఆ స్టార్ ఎవరో తెలుసా..?
  • బూతుకూ హాస్యానికీ నడుమ ఓ గీత… దానికి జంధ్యాల గౌరవం…
  • కార్పొరేట్ విద్య అంటేనే ఓ నయా మాఫియా… పిల్లలు బలి..!!
  • ఇతడు..! ఓ లేజర్ తాత గారు… ఓ హిమేశ్ బాబు… ఓ పాత స్పూఫ్…
  • సంతానసాఫల్యం… ఈ వ్యాపారం అనేక మార్గాలు… ఎన్నెన్నో మోసాలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions