.
ఈటీవీలో పాడుతా తీయగా షోకు చాలా తక్కువ రేటింగ్స్… అంటే తక్కువ మంది చూస్తున్నారు… కారణాల అన్వేషణ, విశ్లేషణల జోలికి ఇక్కడ పోవడం లేదు… కానీ ఈరోజుకూ ఈ షోకు ప్రేమికులున్నారు…
ఓ కంపోజర్, ఓ గాయని, ఓ గీతరచయిత… జడ్జిలు ముగ్గురూ ప్రసిద్ధులే.., హోస్ట్ కూడా గాయకుడు కమ్ కంపోజర్… ఈసారి కంటెస్టెంట్లు కూడా ప్రతిభ ఉన్నవాళ్లు… కాకపోతే శ్రీలలిత, జయరాం వంటి ఆల్రెడీ పాపులర్ అయినవాళ్లకు బదులు కొత్త నీటిని తీసుకొస్తే బాగుండు… బట్ వోకే…
Ads
ముందుగా ఓ విషయం చెప్పుకుని… విషయంలోకి వెళ్దాం… ఇదే షోకు సంబంధించిన చాలా పాత వీడియోలు చూస్తుంటే ఓచోట ఎస్పీ బాలు అసహనంగా చెబుతున్నాడు…
- ‘‘నోట్స్, హైపిచ్, లోపిచ్… శ్రోతలకు పెద్దగా అక్కర్లేదు, కానీ భావయుక్తంగా ఒక పదాన్ని గాయకుడు ఉచ్చరించాడా లేదా గమనిస్తాడు… సరైన ఉచ్ఛారణకు సంగీత నియమాలు అడ్డం వస్తే, ఉచ్ఛారణ కోసం ట్యూన్లను, టోన్లను, నోట్లను మార్చుకోవాలి తప్ప మన పదాల్ని కాదు…’’ చప్పట్లు కొట్టాల్సిన సందేశం…
ఇక విషయంలోకి వద్దాం… తాజాగా ఓ ఎపిసోడ్‌లో ఓ లేడీ కంటెస్టెంట్ ఏదో పాట పాడింది… చంద్రబోస్ విలువైన మాట చెప్పాడు… సేమ్ బాలులాగే… ఉచ్ఛారణకు సంబంధించి…
కంఠం, స్వరం, మధురం, గాయం, ప్రణయం వంటి పదాల చివర ‘మ్’ అనే ఉచ్ఛారణ… పూర్తిగా దానికి ముందు అక్షరంతో కలిసిపోయి ‘మ్’ పలకాలి… చాలామంది గాయకులు, పేరున్న వాళ్లు కూడా… పదాల చివరలో పూర్ణ అనుస్వరం (అనుస్వారం) వచ్చినప్పుడు… ‘మ్’ పలకరు, పెదవులు మూస్తేనే సరైన ‘మ్’ వస్తుంది…
(తెలుగులో సున్నా అంటుంటారు గానీ లెక్కల్లో సున్నా వేరు, ఈ పూర్ణ అనుస్వరం వేరు…) దాంతో మధురౌ, మధురవ్ అన్నట్టు పలుకుతుంది మధురం అనే పదం… హై పిచ్‌లు, లో పిచ్‌లు, ల్యాండింగ్ నోట్స్, శృతి సర్దుబాటు వంటి సాంకేతిక స్వరపదాలు ఎన్ని చెప్పినా సరే, ఉచ్ఛారణే ముఖ్యం… బాలు చెప్పిందీ అదే… సరైన ఉచ్ఛారణతోనే సరైన భావప్రకటన… (ఇక్కడ అజంతాలు, మ్ హల్లు కదా వంటి చర్చలోకి వెళ్లడం లేదు…)
కొన్నిసార్లు ఉచ్చారణ సరిగ్గా లేకపోతే అర్థాలే మారిపోతాయి… ఆమధ్య సిధ్ శ్రీరాం ఉచ్ఛారణలకు సంబంధించి ఓ వివాదం కూడా నడిచింది… చాలా పాపులర్, బాగా డిమాండ్ ఉన్న గాయకుడు… తమిళ మూలాలు, అమెరికాలో పుట్టి పెరిగాడు… కర్నాటక సంగీతంలో ప్రవేశం ఉన్నట్టుంది… తెలుగును కూడా ఇంగ్లిషు లిపిలో రాసుకుని తెలుగులో పాడుతుంటాడు…
తెలుగు తెలియని, తెలుగు చదవలేని, తెలుగు రాయలేని, అన్నింటికీ మించి అచ్చమైన తెలుగు పాడలేని సిధ్ శ్రీరామ్ మీద మన సంగీత దర్శకులకు ఎందుకింత మోజు అనే చర్చ పక్కన బెడితే… తను ఉంటే కంటే వంటి పదాలు (మధ్యలో పూర్ణఅనుస్వరం) వచ్చినప్పుడు… ఉల్టే కల్టే అని వినిపించేలా పాడతాడు… అఫ్‌కోర్స్, ఇలా పలువురు ప్రసిద్ధ గాయకులు కూడా పాడారు…
సిధ్ శ్రీరామ్ అలా పాడటంలో తప్పులేదు, హైపిచ్‌లో ఆ పదాల సరైన ఉచ్ఛారణ కష్టం అని సమర్థించినవాళ్లూ ఉన్నారు… బాలు బతికి ఉంటే ఏమనేవాడో తెలియదు గానీ… తాజాగా ‘మ్’ మీద చంద్రబోస్ వ్యాఖ్యానం మాత్రం బాగున్నట్టనిపించింది… పాడుతా తీయగా వంటి షోలలో ఇదుగో ఇలాంటి సూచనలు, సలహాలు, వ్యాఖ్యానాలే అవసరం… అవసరం…
అదే కంటెస్టెంట్ పాడిన అదే పాటను మీరు పాడండి అని చంద్రబోస్ అడిగితే సునీత పాడింది… తన పాటలో ‘మ్’ సరిగ్గా పలికింది… శుభం…
Share this Article