.
Raghu Mandaati .....
‘‘ఉత్తరం అంటే, కలం స్నేహం అంటే ఇప్పటి తరానికి తెలియక పోవచ్చు. కాని మా అమ్మమ్మ, తాతయ్య మధ్యన జరిగిన లేఖల సంభాషణ ఎంత మధురంగా ఉండేదో… భద్రంగా దాచుకున్న ఉత్తరాలను నేను హాస్టల్ కి దొంగతనంగా తెచ్చుకొని, ఎన్ని సాయంకాలాలు వారిద్దరి కథల్లో, ప్రేమల్లో, బాధల్లో, వర్ణనలో, మురిపాల్లో మునిగిపోయానో తెలుసా…
హాస్టల్ లో గడిపినంతసేపు మిగతా స్నేహితుల సాన్నిహిత్యం చదువులు పూర్తయ్యి మరో కొత్త జీవితాల్లోకి చేరుకున్నాక గానీ, మిత్రులు దూరమైన లేమి, ఆ చిన్న ఆనందాల అర్ధాలు, వాటి విలువ తెలిసేది కాదు… మళ్ళీ వాళ్లతో కనెక్ట్ అవ్వాలంటే ఉత్తరం ఒక్కటే మార్గం…
Ads
ఎన్నెన్ని ఊసులు, ఎన్నెన్ని మాటలు, పోగేసి పోగేసి, ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క భావన తడిమి తడిమి చదువుకునే వాళ్ళం, లెటర్ ను గుండెలకు హత్తుకొని ఎప్పుడు నిద్రపోయేదాన్నో…
నీకు తెలుసా రఘూ… మా తాతయ్య పోయాక కూడా మా అమ్మమ్మ అందరిలాగ కుంగి పోలేదు. ఎంత చలాకీగా అందరితో కలివిడిగా.., సందర్భం లేకపోయినా పిలిచి పిలిచి మరి మాట కలిపేది.., ఎంత నిష్ఠగా భక్తి గురించి మాట్లాడేదో, అంతే నిబద్ధతగా కొత్తగా పెళ్ళైన పెళ్లికూతురుతో నిర్మొహమాటంగా సంభోగం గురించి మాట్లాడేది. అమ్మమ్మ మాటలకి అక్కడున్న అమ్మ, చిన్నమ్మలు, అత్తయ్యలు సిగ్గుతో కొంగు మూతికి అడ్డం పెట్టుకొని ముసి ముసిగా నవ్వుకుంటూ అక్కడినుండి పారిపోతుంటే కొత్త పెళ్లి కూతురుకి ఏం చెయ్యాలో తెలీక దిక్కులు చూసేది…
అమ్మమ్మ తుంటి విరిగి మంచాన పడితే కూతుర్లు కోడళ్ళు అందరు ఉన్నా.. నేనే తనని గొడవ పెట్టుకొని మరీ నా దగ్గరికి తెచ్చుకొని పెట్టుకున్నా… నాకు మా అమ్మమ్మ అంటే ఎందుకు అంతా ప్రేమో తెలీదు. లెటర్ లో తన భావాలంటే ఇష్టమా, లేదా తాను ఉండే విధానమేనేమో… కారణం ఏమైనా మంచాన పడి ఉన్నా కూడా, కళ్ళలో మెరుపు, నవ్వులో ఆప్యాయత, పలకరింపులో చమత్కారం, తీరొక్క సామెత చెప్తూ… అబ్బో ఎంత సందడో…
అమ్మమ్మని నా పిల్లలు అమ్మమ్మమ్మా… అని పిలుస్తుంటే, కాదు జేజేమ్మా అని పిలవండి అనేదాన్ని… జేజి జీజి జుజు అని చిన్న కుక్క పిల్లని పిలిచినట్టు అమ్మమ్మ బుగ్గ గిల్లుతూ పిలిచే వాళ్ళు… అది చూసి ఎంత సంబరపడేదో…
తన కాలు సరి అయ్యాక, బాల్కనీలో కూర్చొని, కమ్యూనిటీలో వాకింగ్ వెళ్లే వాళ్ళు, సెక్యూరిటీ వాళ్లు, హౌస్ కీపింగ్ వాళ్లు, గార్డెనర్స్ అందరినీ పిలిచి పిలిచి పలకరించేది…
ఎలా మాట కలిపేదో… ఒకసారి నా చేతిలో ఐదు వందలు పెట్టి, ఒక చీరే జాకీట్ ముక్క పట్టుకురా అని అంది. నాకు అర్ధం కాలేదు. ఎవరికి అమ్మమ్మ అంటే అదేనే సీత బిడ్డకు… సీత ఎవరు అమ్మమ్మా అంటే అదేనే కింద గోడపొంటి ఉన్న మొక్కల్ని చూసుకుంటాడు చూడు, ఐలయ్య, అయన భార్య పేరు సీత, నీ భార్య ఎందుకు రాలేదు అంటే… బిడ్డ పెద్ద మనిషి అయ్యింది అమ్మా అన్నాడు… తనకి తోడుగా ఉంది అంట అందుకే రాలేదంట.. పో పోయి మంచి చీరే జాకీట్ తీసుకు రాపో బిడ్డకు ఒళ్ళో పెట్టాలి కదా.. ఆ మాటకు నాకు నోట మాట రాలేదు…
ఎంతో ముందుకు దూసుకెళ్తున్నాం. కోట్ల విలువ చేసే గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ లో నివాసం ఉండబట్టి, నాలుగేళ్లు అయినా కూడా మహా అంటే కమ్యూనిటీ మీటింగ్ లో ఒక నలుగురు ఐదుగురు తప్ప, ఎవరినీ అంతగా పరిచయం చేసుకోలేదు ఇప్పటివరకు… కాని వారం తర్వాత నుండి. బయట నేను కనపడినా, మా సార్ కనపడినా పలకరింపుతో కూడిన నవ్వుతో ఎదురు పడుతున్నారు. నమస్తే మేడం, నమస్తే సార్ అంటున్నారు…
సీత బిడ్డ రజస్వల కార్యక్రమానికి అటెండ్ కాలేకపోయా అని ఆందోళన పడుతుంటే మరుసటి రోజు ఐలయ్యకు సీతను, వాళ్ళ బిడ్డను ఫ్లాట్ కి రమ్మన్నాను. ఐలయ్య నేను బయట ఉంటాను మేడం, నేను లోపలికి రావద్దు మేడం. స్నానం చెయ్యలేదు ముట్టుడు అవుతది అని మెట్ల దగ్గరే ఉంటే… సీత తన బిడ్డను తీసుకొని లోపలికి వచ్చింది. వారిని చూడగానే అమ్మమ్మ కళ్ళలో మెరుపును చూసాను. మంచిగా అయ్యిందా ఫంక్షన్ అని సీత బిడ్డను దగ్గరికి తీసుకోని ఏంటే సీత, బిడ్డకు సరిగా తిండి పెట్టట్లేదా? పీనుగలా తయారు చేస్తున్నావ్ అనుకుంటూ, అమ్మమ్మగా సొంత మనుమరాలికి అంటే నాకు చేసినంత హడావిడి సీత బిడ్డకు చేసి.., అమ్మమ్మ చీర జాకెట్ తో పాటు ఎదిగే అమ్మాయి, రేపో మాపో కాలేజ్ కి వెళ్తుంది కదా అని, నాలుగు జతల బట్టలు కొని ప్యాక్ చేసి ఉంచిన కవర్ ని కూడా అమ్మమ్మతోనే ఇప్పించాను. బిడ్డను ఒళ్ళోకి తీసుకుంటూ నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని బుగ్గన ముద్దు పెట్టి, సీత కళ్ళలోకి చూస్తూ బిడ్డను బాగా చదివించు, నా మనుమరాలు లెక్క తయారు చెయ్యి అని నన్ను చూస్తూ చెప్పింది. అలాగే మేడం అంటుండగా, ఇక నెల నెల నొప్పులంటాయి. శరీరానికి బలాన్నిచ్చే తిండి పెట్టు. ఎండుకొబ్బరి బెల్లం లడ్డులు, నువ్వుల ముద్ద, రాగి ముద్ద, ద్రాక్ష పండ్లు, మంచిగా ఆవాల పొడి కలిపిన వెల్లుల్లి కారం పొడితో అన్నం కలిపి రోజు రెండు ముద్దలు పెట్టు, వేడి పాలలో ఇన్ని బాదం పలుకులు వేసి ఇవ్వు, రాత్రి పూట చిటికెడు జీలకర్ర చప్పరించేలా చూడు, వారానికొక సారైనా బీరకాయ, సొరకాయ కూరలు వండు అని చెప్తుంటే నేను అలా వింటూ ఉండి పోయా…
ఉన్న రెండు నెలల్లో కమ్యూనిటిలో ఉన్న వాళ్ళందరితో వెళ్లి మాట కలిపేది, కింద గార్డెన్ ఏరియాలో పిల్లలతో కేరింతలు వేసేది. ఆమ్మో ముసల్ది మళ్ళీ ఏం అడుగుతుందో, ఏం తిడుతుందో అని తప్పించుకొని, ఎదురు పడకుండా పారిపోయే వారు కూడా కొంత తయారయ్యారు. అందరిని ప్రేమగా పిలుస్తుండడంతో జేజి మా ఇంటికిరా అంటే మా ఇంటికిరా అని పిల్లలు లాక్కెళ్ళే వారు.
తాను నా దగ్గరున్న అరేడు నెలల్లో గృహ ప్రవేశాలకు, పెళ్లిళ్ళకి, వ్రతాలకు ఇంట్లో పెద్ద మనిషి లెక్క పంతుల మంత్రాలకు వంత పాడుతూ…. ఎవరైనా బొట్టు పెడుతుంటే నన్ను పట్టుకెళ్లడం చాతకాక నా మొగుడు నా బొట్టు పట్టుకెళ్లాడు తల్లి, కానీ మీరు కానియ్యండి అని చాలా చమత్కారంగా ఒక జోక్ తో నవ్వించి కార్యక్రమం జరిపించేది.
ఎక్కువ లేడీస్ అంతా తన జోకులకు మంచి చెడు విషయాలకు ముఖ్యంగా మొగుడుతో ఎలా ఉండాలి, రాత్రిళ్ళు ఎలా గడపాలి, రోజంతా ఎలా కొంగున తిప్పుకోవాలి. చిత్త కార్తె కుక్కలాగా నలుగురు వీపుల చుట్టూ తిరగకుండా నీ చుట్టూ ఎలా తిప్పుకోవాలో అనే విషయాల మీద తెగ లెక్చర్ ఇచ్చేది అమ్మమ్మ.
నీకు తెలుసా రఘూ… కిట్టి పార్టీలంటే నాకు ఇష్టం ఉండదు. కానీ ఒక రోజు నా దగ్గరికి ప్లీజ్ ఆంటీ ప్లీజ్ ఆంటీ జేజిని బయటికి తీసుకొని వెళ్తాము, బర్త్‌డే పార్టీకి అని అమ్మాయిలంతా కలిసి అమ్మమ్మను పబ్ కి తీసుకెళ్ళారంట ఉదయం… అది విని నేను నోరెళ్ళ పెట్టాను.
ఒకరోజు అమ్మమ్మ పెళ్లి రోజు నాడు నేను దొంగిలించి దాచి పెట్టుకున్న లెటర్లని లామినేషన్ చేపించి, ఒక ఫైల్ లాగా రెడీ చేసి గిఫ్ట్ గా ఇచ్చాను. ఒసేయ్ దొంగ పీనుగా ఈ లెటర్ల కోసం ఎన్నేళ్లు వెతికి ఉంటానో, ఎన్ని సార్లు తిట్టుకొని ఉంటానో అనుకుంటూ అపురూపంగా అక్షరాలని తడుముతుంటే, ఎప్పుడు చలాకీగా ఉండే అమ్మమ్మ మెహంలో మొదటిసారి తన కంటిలో కన్నీళ్లను చూసి నా కళ్ళు చెమ్మగిల్లాయి.
బండోడు ఎప్పుడూ నా కొంగు పట్టుకొని తిరిగేటోడు. నిమిషం కనపడకపోతే అయోమయం మహారాజు. ఎంత ఆధారపడకపోతే నా చుట్టే తిరుగుతాడు. బండెడు పిల్లల్ని కన్నాను, వాళ్లకి పెళ్లిలై మనుమలు ముని మనుమలు వచ్చినా కూడా… ఎప్పడూ ఏ ఒక్క కొడుకు దగ్గరికి, ఏ బిడ్డ దగ్గరికి వెళ్లి సేవ చేయించుకోలేదు. నాకు నువ్వు ఉన్నావ్ కదనే అని నేను పని చేసుకుంటుంటే, ఎటు తిరుగుతూ ఉంటే అటు నా వెనకే తిరుగుతూ, సుతారంగా పిరుదును తడిమేవాడు.
బండోడికి నా పెళ్ళైనప్పటి నుండి ఎందుకంత ఇష్టమో ఆ పిరుదులంటే, కలిసి ఉండడం అంటే ఒకరి మీద ఒకరు మొహంతో ఉండడం, ప్రేమగా ఉండడం, అవకాశం ఉన్నన్నిసార్లు హత్తుకొని ఉండడం, ఒంటిని తడుముకోవడం, అద్వైతంగా ఉండడం, భక్తిగా ఉండడం, కలిసి మెలిసి ఆరోగ్యంగా ఉండడం, ఈ జన్మ కు సాకారం ఏంటో తెలుసా అమ్ములు… ఇరువురు ఒకరికి ఒకరు తోడై ఉన్నంత వరకు ఉండి, తిరిగి, పరమాత్మలో లీనం అవ్వడమే కదా దాంపత్యం అంటే… నిజమే కదా అనుకునేదాన్ని…
చాలా రోజులు ఆ ఉత్తరాల ఫైల్ ను పక్కనే పెట్టుకొని పడుకునేది. టైం దొరికినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ చదువుకొని ముసి ముసిగా నవ్వుకునేది. అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు కాల్ చేస్తే రెండు నిమిషాలు మాట్లాడి మంచిగా ఉండండి అని పెట్టేసేది. ఫోన్ మాట్లాడడం, టీవీ చూడడం అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడూ మనుషులు కావాలి. వాళ్ళతో ప్రేమగా చేతిలో చెయ్యేసి ఆప్యాయంగా మాట్లాడడం కావాలి. తాను ఉన్న అర్నేళ్లలో మూడు నాలుగు వందల రకాల వంటలను కొత్తగా నేర్చుకున్నాను. పూజలు పద్ధతులు తెలియకనే తెలిసాయి. రేపో మాపో నా పిల్లలకి చెప్తే నన్ను కూడా చాదస్తురాలు అని పిలుస్తారేమో రఘూ…
- జేజి జేజి అని పిలుస్తూ పిల్లలు రూమ్ లోకి వెళ్తే, అందరికన్నా ముందే లేచి తన మంత్రాలతో తులసి నీళ్లతో సూర్యుడికి సైతం అలారం పెట్టి లేపే జేజి ఆ రోజు ఎంత లేపినా లేవలేదు.. చాలా ప్రశాంతంగా ముగ్ధ మనోహరంగా ముద్దుగా పసిపాపలా పడుకొని ఉంది. ఎందుకో కన్నీళ్లు వస్తున్నాయ్ కానీ పూర్తిగా బయటికి రావడం లేదు. అప్పటికే ఎనబై పదులు దాటిందని తెలుసు. కానీ తాను ఆ నెంబర్ ను జయించి ఎంత చలాకీగా తిరిగిందో.. అంతకు ముందు రోజు ప్రేమగా చుట్టిన సున్నుండలు బేసిన్లో ఆరుతున్నాయి. రేపు పిల్లల్ని పిలిచి పంచిపెట్టు అని చెప్పింది. అది గుర్తుకు వచ్చి తన చివరి కోరికగా అందరు పిల్లలకి తలా ఒక సున్నుండ ఇస్తూ, చప్పరిస్తూ చూస్తుండగా, అంబులెన్స్ లో అమ్మమ్మని తీసుకెళ్తుండగా, మూతికి అంటిన సున్నుండను తుడుచుకుంటూ ఆంటీ జేజి కో కహా లేకే జారే అన్న బుడ్డోడి అమాయకపు మాట వినేసరికి అప్పుడు నాకు దుఃఖం పొంగుకొచ్చింది. అంబులెన్స్ లోనే ఊరికి తీసుకెళ్ళాం…
స్వాతిముత్యం సినిమాలోలాగా వారిద్దరే ఉన్న ఇంటిలాగా అమ్మమ్మ తాతయ్య తిరిగిన ఇంట్లోకి తీసుకెళ్ళాం.
డిగ్రీ చేసే ఒక అమ్మాయి ట్యూషన్ చెప్పడానికి, తన తల్లి కంగన్ హాల్ పెట్టుకొని కుట్టు మిషన్ తో జాకెట్లు కుట్టుకోడానికి, తాతయ్య చనిపోయాక అమ్మమ్మ వాళ్ళకి రెండు గదులు ఎనిమిది వందల రూపాయలకు అద్దెకి ఇచ్చిందంట. మాకెవ్వరికి తెలీకుండా మగ దిక్కు లేని తల్లి బిడ్డను మీకేం కాదని తల్లికి కుట్టుమిషన్ కొనిచ్చి, కంగన్ హాల్ పెట్టించి బిడ్డను పదవ తరగతి నుండి అవసరం ఉన్నప్పుడల్లా యాభైయో వందో సాయం చేస్తూ వచ్చిందంట…
అమ్మమ్మను పట్టుకొని కన్న కూతురు కన్నా ఎక్కువగా గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నారు ఆ తల్లీబిడ్డలు, ఊరు ఊరంతా వచ్చింది. అమ్మ కొడుకు కూతుళ్లు అల్లుళ్ళు మనుమలు మనవరాళ్లు కొందరికి వీలు పడింది, ఇంకొందరికి వీలు పడలేదు. పక్క ఊరు నుండి కూడా వచ్చిన వాళ్లంతా అమ్మమ్మ తాతయ్యలను దైవాలుగా కొలుస్తూ ఏడుస్తుంటే ఒక మనిషి ఎందరిని కూడ పెట్టుకోవచ్చో… ఎన్ని అనుబంధాలను మూట కట్టుకోవచ్చో… ఎందరినో మన అని అక్కున చేర్చుకోవచ్చో… ఆ రోజు అర్ధమైంది రఘూ…
ఎవరు అన్నారు రఘూ మనిషి ఒంటరి వాడని. మనిషి ఎప్పుడు ఒంటరి కానే కాడు.. అన్ని కార్యక్రమలు పూర్తి చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాం. మరుసటి రోజు పిల్లలంతా కమ్యూనిటీ హల్ లో జేజితో దిగిన రెండొందలకు పైగా ఉన్న సెల్ఫీలను ప్రింట్ తీసి, ఫోటోలన్నీ తోరణాలుగా కట్టి మమ్మల్ని పిలిచారు.
హాల్ మధ్యలో కుర్చీలో… నవ్వుతున్న అమ్మమ్మ ఫోటో పెట్టి గులాబీ రేకుల దండ వేసి వరుసగా వచ్చి దండం పెట్టుకుంటున్నారు. సెక్యూరిటీ నుండి మొదలు కొని వాకింగ్ వెళ్లే వాళ్ళ దగ్గర నుండి అమ్మమను పలకరించిన ప్రతి ఒకరు ఆ హాల్లో కనపడుతున్నారు. అదేదో నివాళిలాగ కాక ఏదో కిట్టి పార్టీ, బర్త్డే పార్టీ సెలెబ్రేషన్ లాగా వయసుతో సంబంధం లేకుండా పాటలు డాన్సులు చేస్తున్నారు…
ఆనందమో… దుఃఖమో… ఎటు తెలియని సంధిగ్ధంతో బయటికి వస్తుంటే ఎదురుగా సీత నిలబడి ఏడుస్తోంది. పక్కనే సీత బిడ్డ కూడా ఏడుస్తూ వచ్చి నన్ను వాటేసుకుంది. కుండ ఒలికినట్టుగా నా కన్నీళ్లు ఆగలేదు. సీత నా దగ్గరికి వచ్చి అమ్మ జేజేమ్మ పోవడానికి ముందు రోజు ఐదు వేలు చేతిలో పెట్టి బిడ్డ కాళ్లు బోసి పోయి ఉన్నాయి పట్టీలు కొని వేయి అని ఇచ్చిందమ్మా… అని ఉండగా చుట్టిన ఐదువందల నోట్లను చేతిలో పట్టుకొని ఏడుస్తోంది.
నేను కళ్ళు తుడుచుకొని ఈ డబ్బులతో పట్టీలు చేపించు అని చెప్పాను. సీత బిడ్డను చూస్తూ పట్టీలతో నువ్వు గళ్ళు గళ్ళు మని తిరుగుతుంటే జేజి నీతోనే నడుస్తున్నట్టు అని చెప్తే అమాయాకంగా ఏడుస్తూ తల ఊపింది.
ఐలయ్య నా చేతిలో దోసెడు నిండా వామాకుల కొమ్మలు పెట్టాడు. జేజేమ్మకు వామాకు నువ్వుల పచ్చడి అంటే చాలా ఇష్టం మేడం అని, చెప్తూ చెప్తూ ఏడుస్తూ ఆ ఏడుపు నేను చూడొద్దు అనుకున్నాడో ఏమో… అటు వైపుకు తిరిగి వెళ్లి పోయాడు… నేను కళ్ళు తుడుచుకొని పైకెళ్లి ఇంట్లో ఉత్తరాల ఫైల్ ని గట్టిగ హత్తుకొని పడుకున్నాను. అమ్మమ్మను పట్టుకొని పడుకున్నట్టు…
**
ఇదంతా నాతో పంచుకొని కాల్ పెట్టేసాక…
గుండె ఒక్కసారి నిశ్శబ్దంగా మోగినట్టు అనిపిస్తుంది.
జేజి అనే పేరు మాత్రమే కాదు అది..
ఒక ప్రేమ అనుభవం, ఒక ఓదార్పు గొంతు,
ఒక ఇంటి గాలి, ఆత్మ పటిమ, దయానురాగాల కలబోత.
జేజి ఒక అమ్మమ్మో ఒక వ్యక్తో కాదు మా.
తను మాట్లాడే శబ్దంలో జ్ఞాపకం ఉందని,
తన చేయి తాకిన దగ్గర ఓ పుణ్యక్షణం ఉందని,
తన వంటల రుచి మాత్రమే కాదు, మాటల దివ్యత కూడా ఇక నుండి మీ జ్ఞాపకంగా నేను నెమరేసుకుంటాను..
తన నవ్వు మధ్యాహ్నపు చలికిరణం.
తను తిడితే ముద్దుగా నిగుమ్మని జ్ఞానం.
తన కలకలపూ ఇంట్లో ఓ పాడే కోయిల గాత్రం.
జేజి ఉన్న ఆరు నెలలు కాదు మా… ఓ కాలమే…
ఓ ఇంటి గోడలపై పడిన రంగుల్నీ,
ఓ మనసుల్లో కమ్ముకున్న నిగూఢ స్మృతుల్నీ,
ఓ నీటితో చిమ్మిన తాళపు చెరుకుల మాధుర్యాన్ని మిగిల్చాయి.
పక్కనున్న వారికి మాట్లాడలేని విషయాలను,
చదువుల్లో చెప్పలేని విలువలను,
తన జోకుల మధ్యలో బుడిపెట్టిన జీవితపాఠాలుగా ఇచ్చింది. ఆమె గుండె ఓ వంటిల్లు, ఓ దేవాలయం, ఓ ప్రేమ పుస్తకం.
జేజి గుండె అంతే పెద్దది…
పెద్ద వయసు నుండి పసిపిల్లల వరకు ప్రేమను పదార్థంలా వండే చైతన్యం. తిరిగిరాని కాలాన్ని ఓ చిన్ని ముద్దుల నవ్వుగా మార్చగల పట్టు.
జేజి చెప్పిన ప్రతి చిన్న మాట. మనిషి మనిషికి తలవంచే అవకాశం. జేజి చూపిన ప్రతి చిన్న ఓపిక
తరాల తరబడి నిలిచే జీవనశైలికి పునాదిలాంటిది.
మరణం ఆమెను తాకలేదు మా..
ఆమె సున్నుండలో ఉంది.
ఆమె వామాకుల పచ్చడిలో ఉంది.
ఆమె మాట్లాడిన ప్రతి చిన్న పిలుపులో,
చిన్న పిల్లల చేతుల్లో, చిన్నారి కాళ్ళ పట్టీల్లో ఉంది.
జేజి పోలేదు… ఆమె వెళ్తూ, ప్రేమని నాటింది.
ఆమె దూరం కాదు… మన గుండె దాకా చేరిపోయింది.
జేజీ… నీవు వెళ్ళిపోయిన రోజునే నిజంగా అర్థమయ్యింది.
**
జేజి… నీకు నాదో మాట… విను…
నీ పేరు ఎవరు ఎక్కడ విన్నా, ఏవో తడి వస్తున్నట్టు అనిపిస్తుంది.. నీ మాటల కన్నా ముందుగా వినిపించేది… నీ నవ్వు వెనక దాగిన పాఠాలు.
కానీ నీవు వెళ్ళిన రోజు…
నీవు చెప్పిన ప్రతి ఒక్క మాట వెనుక ఎంత ప్రేమ ఉందో నిజంగా అర్థమయ్యింది.
నీ ఊపిరిలో వాసన ఉన్నట్టే,
నీ జోలపాటలో ఓ పూర్వ జన్మ మాధుర్యం ఉండేదిలా…
చాలా మంది బతుకుతున్నాం అనుకుంటారు…
కాని నీవు బతికించినవాళ్లలో ఒకరు జేజి.
నీ చేతిలో పెట్టిన రాగిముద్దల కన్నా,
నీ చేతిలో పెట్టిన మాటలు ఎక్కువ తినినట్టుంటుంది ఇప్పుడు. ఆపదలలో గోరింటాకు రాసినట్టుగా,
నీవు నేర్పిన జీవితం మట్టిలోకి కాదు, మా గుండెల్లోకి లీనం అయింది.
నీ లేఖల మాటల్లో,
నీ చెప్పిన సామెతల్లో,
నీ ముద్దు పెట్టిన బుగ్గ జ్ఞాపకాల్లో
ఇంకా బతికే ఉన్నావు జేజి…
ఒక్కోసారి కిటికీలోంచి వెలుగు రావడం లేదు అని అనిపించినా, నీ జ్ఞాపకం మాత్రం వెలుగై మమ్మల్ని లేపుతోంది.
నీవు లేకపోవడం వాస్తవం కావచ్చు…
కానీ నీవు లేనట్టుగా లేవు.
వాకింగ్ చెయ్యడానికి వెళ్తున్న ముసలమ్మ నవ్వులో నీవు ఉన్నావు.
పెళ్లి చూపులకు వెళ్తున్న ఆ అమ్మాయి మెడలో చీర జాకెట్ లో నీవు ఉన్నావు.
చిన్న పిల్లల బుగ్గలో సున్నుండలా నీవు ఉన్నావు.
నీతో గడిపిన ఆరు నెలలు…
ఓ కాలేజీ కన్నా, ఓ పని కన్నా, ఓ ప్రేమ కన్నా
ఎక్కువగా మనుషుల్ని మార్చిన జీవన విశ్వవిద్యాలయం.
ఇప్పుడు నిన్ను కలవకుండా నీ గురించి తెలుసుకున్న నాక్కూడా బాధగా అనిపిస్తుంది జేజి.. కనీసం నువ్వెవరో ముందే తెలిస్తే ఒక్క సెల్ఫీ అయినా దిగి గుండె గ్యాలెరీలో భద్రపరిచుకునేవాన్నిగా….
నీ పక్కన ఉండి ఒక్క మాటైనా మాట్లాడేవాన్నిగా.
ఒక్కసారి ప్రేమగా చేతి వేళ్లతో నా జుట్టును నిమురుతుంటే ఆశీర్వాదం తీసుకునేవాన్నిగా..
ఒక్కసారి “నిన్ను ప్రేమిస్తున్నా జేజి” అనే అవకాశాన్ని పొందేవాన్నిగా..
.
ఇప్పుడు నువ్వు లేవు అని కాదు…
నీ ప్రేమకి మాటలు తక్కువయ్యాయని బాధగా ఉంది.
ఇప్పుడు ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు,
నీలాగా ప్రేమగా పలకరించాలి అనిపిస్తుంది.
నీలాగా జీవించాలి అనిపిస్తుంది.
జేజి… నువ్వు వెళ్ళిపోయిన రోజునే నిజంగా అర్థమయ్యింది.
నీ అస్తిత్వం… నీ అపరిమిత ప్రేమ…
ఇక ఈ రాతల జ్ఞాపకమే నాకు ఆశ్రయంగా దీవెనగా మిగిలిపోయింది.
జేజి నువ్వెవరో తెలియక పోయిన ఇప్పుడు నేను కనుగొన్న ఈ జేజికి నా బోలెడు ముద్దులు…… రఘు మందాటి
Share this Article