.
దేవాదాయ కాదు… అది దేవ దాయ, ధర్మ దాయ శాఖ
దేవ- ఆదాయ రెండు పదాలు సవర్ణదీర్ఘ సంధిగా కలిస్తే దేవాదాయ అవుతుంది అని అనుకుంటారు. వ్యాకరణంలో సంధి పని ముగిసిన చోట సమాసం పని మొదలవుతుంది. దేవాదాయ అంటే దేవుడికి ఆదాయం అని అనుకుంటారు. దేవుడి వల్ల ఆదాయం, దేవుడి పేరుతో ఆదాయం అని విభక్తులను భక్తి నుండి వేరుచేసి అర్థం చేసుకుంది లోకం.
Ads
“శివాయ విష్ణు “రూపాయ”
శివ “రూపాయ” విష్ణవే”
అంటే శివుడు- విష్ణువు ఒకటే అని అర్థం. శివుడు డబ్బుకు విలువ ఇవ్వడు కానీ- విష్ణువు “రూపాయ”కు బాగా విలువిస్తాడు అందుకే నయా పైసా లేకపోతే శివాలయం; ధనం సమృద్ధిగా ఉంటే విష్ణ్వాలయం అన్నారని- విష్ణు”రూపాయ”కు లేని అర్థాన్ని ఆవిష్కరించారు!
విష్ణువు రూపాయ విష్ణువుకే ; శివుడి రూపాయ కూడా విష్ణువుకే అన్నది దీని ఆర్థికశాస్త్ర అర్థమని మరి కొందరు వాదించారు! శివుడి రూపాయ అయినా, విష్ణువు రూపాయ అయినా, సకల దేవతల రూపాయలయినా దేవ దాయ శాఖదే అన్నది కలి ధర్మం!
దేవాలయ శాఖ అని పేరు పెట్టకుండా దేవాదాయ శాఖ అని దేవుడి ఆదాయం మీద దృష్టి కేంద్రీకరించి పేరు పెట్టడంలోనే ఆ శాఖ ముందు చూపు స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడి పేరిట ఆదాయ మార్గాలు, వాటి స్వరూప స్వభావాల చర్చ ఇక్కడ అనవసరం.
దేవాదాయం ఏదయినా ధర్మాదాయమే అని లోకం స్థూలంగా అనుకుంటోంది. మన తెలుగు భాషకు పట్టిన తెగులును దేవుడే దిగివచ్చినా బాగు చేయలేడు అనడానికి దేవాదాయ- ధర్మాదాయ మాటలే పెద్ద ఉదాహరణలు. తెలుగులో దాయం అంటే భాగం. రాయలసీమలో పాచికలాటను ఇప్పటికీ దాయాలాట అనే అంటారు.
దేవ దాయం – అంటే దేవుడి భాగం;
ధర్మ దాయం- అంటే ధర్మ భాగం అని అర్థం. ఈ మాట ప్రకారం-
దేవదాయ శాఖ; ధర్మదాయ శాఖ అనే అనాలి తప్ప- దేవాదాయ; ధర్మాదాయ అని అనకూడదు. అసలు అలాంటి మాటలే లేవు.
మన దృష్టి ఎప్పుడూ ఆదాయం మీదే కాబట్టి దేవుడికి, ధర్మానికి ఆదాయం అంటగట్టాము. దేవుడికి లేని అభ్యంతరం మనకెందుకు? ఇంతకంటే భాషాదోషం వల్ల సాక్షాత్తు దేవుడి శాఖకు జరిగిన అన్యాయం, అవమానం గురించి లోతుగా వెళ్లడం సభా మర్యాద కాదు.
- “మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే
గండూషాంబు నిషేచనం పురరిపో ర్దివ్యాభిషేకాయతే |
కించిద్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే
భక్తిః కిం నకరో త్యహో వనచరో భక్తావతంసాయతే”
దారంతా తొక్కిన చెప్పుకాలితో తిన్నడు లింగాన్ని శుభ్రం చేస్తే… మెత్తటి కూర్చ (బ్రష్)తో శుభ్రం చేసినట్లు;
పుక్కిట్లో స్వర్ణముఖి నీళ్ళు పట్టి లింగం మీద ఉమ్మేస్తే… దివ్యమైన అభిషేకం చేసినట్లు;
కొంచెం కొరికి ఎంగిలి మాంసం పెడితే… నవ్యమైన ప్రసాదం పెట్టినట్లు మనసారా శివుడు స్వీకరించి… అతడి భక్తికి మెచ్చి మోక్షమిచ్చాడని శివానందలహరిలో శంకరాచార్యులు పొంగిపోయి స్తోత్రం చేశాడు.
అలాంటిది ఒకానొక లేని సవర్ణదీర్ఘసంధిని సాధించి దేవుడి ఆదాయం మీద ప్రభుత్వం ఒకానొక శాఖకు నామకరణం చేస్తే ఎందుకు నొచ్చుకుంటాడు? “దేవుడి ఆదాయం” మీద ప్రభుత్వాలకు అంత శ్రద్ధ ఉన్నందుకు, ఆదాయ దృష్టి ప్రధానంగా సార్థక నామధేయం చేసినందుకు లోలోపల పొంగిపోతూ ఉంటాడేమో! ఏమో!!
కొస మెరుపు
:- తమ సొంత భాష విషయంలో చాలా తాదాత్మ్యంగా, పట్టుదలగా, నిక్కచ్చిగా ఉండే తమిళనాడులో దేవ దాయ శాఖకు “హిందూ సమయ అరనిలైయత్తురై (హిందూ రిలిజియస్ చారిటబుల్ ఎండోమెంట్స్ డిపార్ట్ మెంట్)” అని ఎందుకు పెట్టుకున్నారో మనకెందుకు? భక్తుల డబ్బు దేవుడి హుండీలో పడాలి. హుండీలో డబ్బుపై ప్రభుత్వానికి అధికారం ఉండాలి- అంతే.
దిక్కులేనివారికి దేవుడే దిక్కు!
దేవుడికే దిక్కులేకపోతే?
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article