.
Rochish Mon
….. 2023లో వచ్చిన బలగం సినిమాలోని పాట “కోలో నా పల్లే కోడి కూతల్లే…” పాటకు జాతీయ ప్రభుత్వ పుసస్కారం వచ్చింది; సంతోషం.
(పాటను ఇంత వరకూ నేను వినకపోవడం నా తప్పు)
ఈ పాటకు జాతీయ ప్రభుత్వ పురస్కారం వచ్చింది అని తెలిసి పాటను విన్నాను. విన్నందుకు చాల సంతోషం వేసింది.
పాటకు సంగీతం భీమ్స్ సిసిరోలియో. పాట ఎంత బావుండాలో ముందుగా ఆలోచించుకుని ఆ బాగా రావడానికి ఎలా సంగీతం చెయ్యాలో అలా సంగీతం చేశారు భీమ్స్. పాటకు మంగ్లీ గానం సరైన, మేలైన గానం. పాట విజయవంతం అవడానికి ప్రధానమైన కారణం మంగ్లీ గానం అని తెలిసిపోతోంది. భీమ్స్, మంగ్లీ ఇద్దరికీ అభినందనలు. పాట చిత్రీకరణ కూడా చాలా బావుంది.
Ads
కాసర్ల శ్యాం చాల గొప్పగా రాశారు. ఒక మామూలు సాహిత్య అభిమానిగా పాట సాహిత్యం నాకు గొప్ప సాహిత్యం అనిపించింది. ఆ సాహిత్యానికి జాతీయ ప్రభుత్వ పురస్కారం రావడం సరైందే. కాసర్ల శ్యాంకు అభినందన.
ఒకసారి పాట సాహిత్యాన్ని అవలోకిద్దాం-
“ఓర్ వారి ఇంక పిండుతున్నావ్రా పాలు
ఇగెప్పుడు పోతవ్రా ఊల్లెకు నీ యక్క
ఇగ పొద్దు పొద్దున్నే మొదలుపెట్నావయా
నీ పాసుగాల”
— ఇది పాటకు ముందు భాగం…
“కోలో నా పల్లె కోడి కూతల్లే
ఒల్లిరుసుకుందే కోడె ల్యాగల్లే
యాప పుల్లల చేదు నమిలిందే
రామ రామ రామ రామ”
—- కోడి కూతల్లే, కోడి ల్యాగల్లే వంటి ఉపమలు చాల గొప్పగా ఉన్నాయి. కోడె ల్యాగు ఒళ్లు విరుచున్నట్టుగా పల్లె నిద్ర లేచింది అనడం గొప్పగా ఉంది. ‘యాప పుల్లల చేదు నమిలిందే’ అనడం కవి ప్రత్యేకత…
“తలకు పోసుకుందె నా నేల తల్లే
అలికి పూసుకుందె ముగ్గు సుక్కల్నే”
— ఈ మాటలు చాలా బావున్నాయి. ముఖ్యంగా ‘తలకు పోసుకుందె నా నేల తల్లే’ ఎంతో గొప్పగా ఉంది.
“సద్ది మూటల్నే సగ బెట్టుకుందే”
— సద్ది మూటల్ని సద్దుకుని పనులకు వెళతారు కదా? ఇక్కడ పల్లే సద్ది మూటల్ని సగబెట్టుకుంది అంటూ పల్లె పని చెయ్యడానికి ఉపక్రమించింది అని గొప్పగా చెప్పారు కవి.
- “బాయి గిరక నా పల్లే”
— ఈ మాట చాలా గొప్పగా ఉంది. బావి గిలకతో పల్లెను ఉపమించడం ప్రశస్తం.
“హే తెల్ల తెల్లాని పాల ధారలల్ల
పల్లె తెల్లారుతుంటదిరా”
— ఇవి చాలా గొప్ప మాటలు; గొప్ప భావుకత.
“గుళ్లోని గంటలు కాడెడ్ల మెడలోన
జంటగ మోగుత ఉంటయిరా”
— ఎంతో బావుంది ఈ అభివ్యక్తి.
“నాగలి భుజాన పెట్టూకుంటే
దోస్తులు చెయ్యేసినట్టేరా”
— చాలా చాలా గొప్పగా ఉంది ఈ చింతన. గొప్ప అభివ్యక్తి ఇది.
“గొడ్డు గోదా పక్కన ఉంటే
కొండంత బలగం ఉన్నట్టురా”
— ఎంత మంచి మాటలో ఇవి.
“సల్లగాలి మోసుకొచ్చెరా
సేను సెల్కల ముచ్చట్లు”
— కవి పూర్తిగా ప్రశంసనీయుడు ఇక్కడ. చేనును చిలకలతో ఉపమించడం ప్రశస్తం.
“సెమట సుక్కల్లో తడిసిన
ఈ మట్టి గంధాల”
—- చెమట చుక్కల వల్ల తడిసిన మట్టి వాసన అనడం మేలుగా ఉంది.
“ఊరు పల్లెటూరు
దీని తీరే అమ్మ తీరు
కొంగులోన దాసిపెట్టి
కొడుకుకిచ్చె ప్రేమ వేరు”
—- చాల గొప్పగా అన్నారు కవి ఈ మాటల్ని. ఈ మాటలకు మాత్రమే కవికి వచ్చిన పురస్కారం తగినది అని మనం గ్రహించచ్చు.
‘ఊరు పల్లెటూరు
దీని తీరే కన్నకూతురు
కండ్ల ముందే ఎదుగుతున్న
సంబరాల పంటపైరు”
— ఈ మాటలూ గొప్పవే. కూతురులా కండ్ల ముందే ఎదుగుతున్న
సంబరాల పంటపైరు అనడం ఇంకా గొప్ప.
“వంద గడపల మంద నా పల్లె
గోడ కట్టని గూడు నా పల్లె
సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే
రామ రామ రామ రామ”
— ఇక్కడ ‘గోడ కట్టని గూడు నా పల్లె’ అని చాల గొప్పగా అన్నారు కవి.
“మావ అత్త బావ బాపు వరసల్లే
ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలో ఒదిగిన పూల దండల్లే
రంగుల సింగిడి పల్లే”
— ‘ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె’ అనడం బావున్నా ‘దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లే’ అనడం బావుండడం అన్నదాన్ని దాటిపోయింది.
“చేతనైన సాయం జేసే మనుషులు
మావి పూత కాసినట్టే మనుసులు
ఊరంటే రోజు ఉగాది
సచ్చేదాకా ఉంటది యాది”
—- ‘మావి పూత కాసినట్టే మనుసులు’ అనడంలో ఉపమ గొప్పగా ఉంది.
గొప్ప ఉపమలతో, గొప్ప శైలితో, గొప్ప శిల్పంతో, గొప్ప శయ్యతో కవి కాసర్ల శ్యాం చాల గొప్పగా రాసిన పాట ఇది.
- ఒక మోస్తరుగా జాతీయ, అంతర్జాతీయ కవిత్వం చదువుకున్న నేను… నాకు లేని చెడ్డతనాన్ని, ఇవాళ్టి తెలుగు కవిత్వ మేధావుల వికారాన్ని పూర్తిగా తెచ్చుకుని ప్రయత్నించినా ఈ పాటలోని కవిత్వాన్ని ప్రశంసించకుండా ఉండలేను. ఔను ఈ పాటలో అంత మేలైన కవిత్వం ఉంది.
కులవాద, మతవాద, ప్రాంతీయతా వాద వికార పేలాపన తెలుగులో కవిత్వం అయిపోయింది. తెలుగు ప్రజలు కవిత్వం అనబడుతున్న దాన్ని వెలేసి చాల కాలం అయిపోయింది. శివారెడ్డి, గోపి, అఫ్సర్ వంటి వాళ్ల ధాటికి తెలుగు కవిత్వం వికలమైపోయింది. గత కొన్ని దశాబ్దులుగా తెలుగులో కవిత్వం, మేలైన కవిత్వం సినిమా పాట నుంచే వస్తోంది.
(గుంటూరు శేషేంద్రశర్మ, సీ. నారాయణరెడ్డి, బైరాగి, దాశరథి వంటి కొందరి రచనలు మినహాయింపు) కాసర్ల శ్యాం రాసిన ఈ పాటా అందుకు ఒక ఋజువు.
“తెలుగులో కవిత్వం, మేలైన కవిత్వం ఇకపై సినిమా పాట నుంచే వస్తుంది” ఈ మాట నేను కొంత కాలంగా చెబుతూ వస్తున్న మాట; గత ఏడాది తానా సమావేశంలో నేను గట్టిగా చెప్పిన మాట. ఆ నా మాటకు ఇదిగో ఈ పాట మచ్చుతునక.
కాసర్ల శ్యాంకు మరోసారి మనసా, వాచా అభినందనలు.
రోచిష్మాన్
9444012279
Share this Article