.
మా బెజవాడ ఘోష!
….. ( – అనంతనేని రవి కుమార్ )
====================
“Drones, AI, CCTV Cameras.. etc etc” లాంటి ‘గంభీరమైనవేవీ” లేక ముందే…. అంటే, సుమారు 35 సంవత్సరాల క్రితమే మా బెజవాడ చాలా డీసెంట్ గా ఉండేది!
దాదాపు ప్రతి ముఖ్యమైన కూడలిలో “ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్, ట్రాఫిక్ పోలీసులు” ఉండేవారు, “వన్ వే” నిబంధనలు నిక్కచ్చిగా అమలయ్యేవి!
Ads
కానీ.. ఏ క్షణాన “రాజధాని” మా దగ్గరికి వచ్చిందో గానీ.. దానివల్ల మాకు కొత్తగా ఒరిగింది గుండు సున్నా! అప్పటి వరకు మా పాట్లేవో మేము పడుతూ, బాగానే బతికేస్తున్న మాకు “Capital కిరీటం” వచ్చి మీద పడగానే బయటి వారు అనుకుంటున్న ఎటువంటి “Boom” రాకపోగా సరికొత్త తలనొప్పులు, చీకాకులు పెరిగాయి!
వసతులు, సౌకర్యాలు చీమ కన్నంత కూడా పెరగకపోయినా ఒక్కసారిగా వచ్చి పడిన “ప్రోటోకాల్ విన్యాసాలు, వచ్చేపోయే వేలాది వాహనాలు” మా దైనందిన జీవితాన్ని రోజురోజుకు దుర్బరం చేస్తున్నాయి! ఒక పద్ధతి లేదు, ఒక క్రమశిక్షణ లేదు!
“ట్రాఫిక్ సిగ్నల్స్” లేవు.. ఆఖరికి రాష్ట్రంలోనే పేరొందిన బెంజ్ సర్కిల్ లో కూడా ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు లేకపోగా (బహుశా మరెక్కడా మీకు కనిపించని (వినిపించని) “మైకుల్లో ట్రాఫిక్ అరుపులు, తిట్లు, కొండొకచో బూతులు!) శతాబ్దాల చరిత్ర ఉన్న మా నగర ” ప్రస్తుత విశిష్టత!”
ఇక.. ‘వన్ వే’ ల అమలన్నదే లేదు, ఎవరైనా, ఎటయినా, ఎప్పుడన్నా హాయిగా వెళ్లిపోవచ్చు, ప్రమాదాలు చేయొచ్చు, లేదా తామే ప్రమాదాల బారిన పడొచ్చు!
నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తక్కువ ఖర్చుతో, వేగంగా చేర్చుతుండిన అప్పటి అద్భుత “సిటీ బస్సు వ్యవస్థ” చూస్తుండగానే కాలగర్భంలో కలిసిపోయింది! ఆ సిటీ బస్సులకు, మాకు మధ్య పెనవేసుకుపోయిన చిక్కటి అనుబంధానికి గుర్తుగా “5, 13 రూట్, 28 నెంబర్ రూట్.. వంటివి” ఇంకా మా నోళ్ళల్లో నానుతూనే ఉన్నాయి తప్ప ఆ బస్సులన్నింటిని ఏ “మాయదారోళ్లు” ఎత్తుకెళ్లారో మరి, చూద్దామంటే కళ్ళల్లో వత్తులేసుకున్నా కనిపించడం లేదు!
ఏటా వేసవిలో పిల్లతెమ్మెర లా వచ్చే “Exhibition” లేదు, చిన్నపాటి బహిరంగ సభలు కూడా జరుపుకోగలిగిన మైదానాల్లేవు, అంతెందుకు.. నలుగురు మిత్రులు కలుసుకుని కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుందామంటే ఆ మాత్రపు ఖాళీ స్థలాలూ లేవు! ఆహ్లాదాన్ని పంచే ఎటువంటి ఇతర వసతులూ లేవు!
“రౌడీయిజానికి” ఒకప్పుడు పేరొందిన మా బెజవాడ లో సాహిత్యం, పఠనాభిలాష అంతకంటే ఎక్కువేనని ప్రపంచానికి ఘనంగా చాటుతూ వస్తున్న “విజయవాడ పుస్తక మహోత్సవానికి” తాజా ప్రభువుల నిర్వాకంతో “నిలువ నీడ” లేకుండా పోయింది!
ఇంకా.. ఎప్పటెప్పటి “గాంధీ హిల్, రాజీవ్ గాంధీ పార్క్, కాలువల ఒడ్డున పార్క్స్ లేవు, PWD Ground లేదు, ఎంతో చరిత్ర కలిగిన ‘కెనాల్ గెస్ట్ హౌస్’ (బాబు గారు గోకరాజు గంగరాజు గారికి ‘టూరిజం పాలసీ’ కింద ధారాదత్తం చేశారు!).. ఇలా ఎన్నో.. అయితే నామమాత్రంగా మిగిలాయి, లేదా కనుమరుగయ్యాయి!
- ఇవన్నీ చాలనట్లు.. CBN గారు ‘పాత బస్టాండ్ స్థలాన్ని’ పేరు గొప్ప (హైదరాబాద్ కూకట్పల్లిలో వారు డెవలప్ చేసిన మాల్ ను చూస్తే వారి ప్రమాణాలు తెలుస్తాయి) ‘లులు’ కి ‘ కానుక ‘ గా ఇచ్చేసారు!
అప్పట్లో పదుల సంఖ్యలో ఉన్న “So called రౌడీలు” బయటికి తెలుస్తుండే వారు, జనాలు ఎందుకైనా మంచిదని వారి పక్కకే పోయేవారు కారు! కానీ.. ఇప్పుడే సందులో చూసినా “పైకి పేద్ద మనుషుల్లా కనిపిస్తూ ప్రజల, ప్రభుత్వ ఆస్తులను, ఆదాయాన్ని కొల్లగొట్టే వారే!”
ఒకడేమో.. “బీసెంట్ రోడ్డు” తనదంటాడు, ఇంకొకడు “ఈట్ స్ట్రీట్స్” నావంటాడు, మరొకడు “దుర్గ గుడి” నా సొత్తంటే, మరొకడు “పార్కింగ్ ప్లేసులన్నీ” మావేనంటాడు! ఇంకొకడేమో.. “ఇరిగేషన్, హైవేస్, కామన్ సైట్స్, కాలువ గట్లు, రోడ్డు మార్జిన్లన్నీ” మా వాళ్ళవేనంటాడు! వాళ్లకు బ్రేకులేయాల్సిన వాళ్ళు మాత్రం ఎంచక్కా కళ్ళు మూసుకుని నిద్ర నటిస్తుంటారు!
- ఇక.. కాస్తంత వర్షం పడిందంటే అప్పుడు చూడాలి మా బెజవాడ “సొగసు!” అటు కృష్ణమ్మ, ఇటు బందరు, రైవస్, ఏలూరు కాలువలు, బుడమేరుకు పోటాపోటీగా ఇంచుమించుగా నగరం మొత్తం “ఒక సరస్సు”లా మారిపోతుంది!
ఇక అప్పుడప్పుడొచ్చే (పోయినేడాది మాదిరిగా) భారీ ముంపులు మాకొక “అదనపు వరం!” ఇవన్నీ చూస్తుంటే.. “అమృత్, స్మార్ట్ సిటీస్.. ఇంకా అలాంటి ఎన్నెన్నో పథకాల” కింద వచ్చిన వందలాది కోట్ల రూపాయలు ఏమయ్యాయో, ఏ “డ్రైన్లు, కాలువల్లో” కొట్టుకుపోయాయో, ఎవరి బొక్కసాలు నిండాయో అంతు బట్టదు!
ఇవన్నీ చూస్తుంటే .. మా విజయవాడను “పూజకు పనికిరాని పువ్వు”లా, “వాడుకుని వదిలేసే మనస్తత్వం”లో “ఒక్క అన్నగారు NTR, కొంతమేరకు వామపక్షాలు” తప్ప… “కాంగ్రెస్, CBN, జగన్”.. ఒకరిని మించిన వారొకరనే చెప్పాలి!
ఇన్ని చెప్పిన తర్వాత.. ఇక మా “బెజవాడకు, అక్కడ ఉండేవారికి” ఎవరు దిక్కంటే.. ఇంకెవరు, ఎప్పటిలానే “మా దుర్గమ్మ, కృష్ణవేణమ్మలే!”
“మరుగుజ్జు ఏలికలు” ఏమీ చేయకున్నా, ఆఖరికి తెలిసో తెలియకో కీడు చేస్తున్నా.. వారితో ఢీ కొనే సత్తా మాకిచ్చేది, మా మానాన మేము అభివృద్ధి చెందే శక్తిసామర్ధ్యలు మాకొసగేది శతాబ్దాలుగా మమ్మల్ని కంటికి రెప్పలా కాస్తున్న ఆ “ఇద్దరమ్మలే!”
మాకు, మా నగరానికి వారే “కొండంత అండ!”
వారి “చల్లని దీవెనలే” మాకు ఎప్పటికీ “శ్రీరామరక్ష!”
Share this Article