.
పేపరు, పెన్ను ఇచ్చి అ ఆ ఇ ఈ, ఏ బి సి డిలు రాయమంటే రాయడం రానివారు కూడా జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారు… నిజమైన జర్నలిస్టులెవరో అసలైన జర్నలిస్టులే తేల్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచన ఆచరణలో సాధ్యమవుతుందా?
ఎవరు జర్నలిస్ట్? ఎవరు కాదు? జర్నలిస్ట్ కు ఉండాల్సిన కనీస విద్యార్హతలు, ప్రమాణాలు, విలువలు, ఆదర్శాలు ఏమిటి? అన్నది ఇప్పుడు పెద్ద చర్చ.
Ads
“పుట్టు జర్నలిస్టులు” ఇదివరకు ఉండేవారని ప్రఖ్యాత భాషాశాస్త్రవేత్త, తెలుగు జర్నలిజానికి పాఠాలు తయారుచేసిన బూదరాజు రాధాకృష్ణ అనేవారు. అంటే ఎలాంటి జర్నలిజం చదువు, శిక్షణ, సాధన అవసరం లేకుండా పుట్టుకతోనే వారిలో ఏవో రాతకోతలకు సంబంధించిన లక్షణాలు ఉండేవి… అలాంటివారు కాలక్రమంలో జర్నలిజంలోకి వచ్చేవారు అన్నది ఆయన పరిశీలన.
ఇప్పుడు పుట్టు తరువాత లోకంలో ఉన్న వాడుక మాటకు సార్థకమైనవారు జర్నలిజంలోకి రావడంవల్ల వారిచేత తప్పుల్లేకుండా నాలుగు మాటలు రాయించడానికి తలప్రాణం తోకకు వస్తోందని ముసి ముసి నవ్వులు నవ్వుతూ చమత్కరించేవారు. ఆయన తయారు చేసిన జర్నలిస్టులు దశాబ్దాలుగా తెలుగు మీడియాలో ఒక వెలుగు వెలుగుతున్నారు.
పెద్ద పెద్ద మీడియా సంస్థలు సొంతంగా జర్నలిజం స్కూల్స్ నిర్వహిస్తూ తమకు కావాల్సినట్లు జర్నలిస్టులను తయారు చేసుకుంటున్నాయి. బయట అనేక యూనివర్సిటీల్లో జర్నలిజం డిగ్రీ, పి జి కోర్సులున్నాయి.
డిజిటల్ మీడియా వచ్చాక మీడియా అంతా తలకిందులైపోయింది. మీడియా ప్రమాణాలు కూడా మారిపోయాయి. డిజిటల్ మీడియాలో వైరల్ అయ్యింది మెయిన్ స్ట్రీమ్ మీడియాకు వార్త అవుతోంది. లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వైరల్ అయ్యే వార్తల వెంటే పడుతోంది.
మాటకంటే, రాతకంటే కదలని చిత్రం (ఫోటో), కదిలే దృశ్యం (వీడియో); వాటి లైకులు, షేర్లు, వ్యూస్, థంబ్ నెయిళ్ళు; వేగం ప్రధానమయ్యాయి. అక్షర దోషాలు, ఉచ్చారణ దోషాలు, భాషా దోషాలు, అనువాద, అన్వయ దోషాలతో పనిలేదు. చివరకు తెలుగు భాషను ఇంగ్లిష్ లిపిలో వార్తగా మలిచినా చెల్లుబాటు అవుతోంది. సంప్రదాయ జర్నలిస్టులు ఈ డిజిటల్ ప్రవాహానికి ఎదురీదలేక, ఈదకుండా ఉండలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మరోపక్క “మేనేజ్మెంట్ జర్నలిజం” వచ్చింది. అంటే యాజమాని నిర్దేశించే, నిర్ణయించే జర్నలిజం అని ఒక అర్థం. ఎలాగైనా “మేనేజ్” చేసి జర్నలిస్టుగా ఉండడం అని మరో అర్థం. ఈ రెండూ నిందార్థాలే అయినా వీటికే ఇప్పుడు బాగా డిమాండు.
“మేనేజ్మెంట్ జర్నలిజం” వల్ల పాఠకులకు, ప్రేక్షకులకు “డిస్కౌంట్ జర్నలిజం” అలవాటయ్యింది. అంటే ఎందులో ఏ వార్త ఎవరు రాశారో, చెప్పారో చదివి, చూసి… అందులో ఎంత శాతం సత్యాన్ని లేదా అసత్యాన్ని మినహాయించుకోవాలో నిర్ణయించుకుంటున్నారు.
యాభై ఏళ్ళకిందట జిల్లాకు ఒక విలేఖరి ఉంటే గొప్ప. ఇప్పుడు ఊరికి పది మంది. చేతిలో కలమో, మైకో ఉన్న ప్రతివాడూ జర్నలిస్టే. ఏదో ఒక ఐడి కార్డు ఉన్న ప్రతివాడూ జర్నలిస్టే. చివరకు గ్రామీణప్రాంతాల్లో సైతం ప్రెస్ మీట్ పెట్టాలంటే అసంఖ్యాక జర్నలిస్టులకు కాఫీలు, టీలు, స్నాక్స్ ఇవ్వడానికి కూడా ఆర్థికంగా చాలట్లేదని వాట్సాప్ లో ప్రెస్ నోట్, వీడియో పంపి చేతులు దులుపుకుంటున్నారు.
అలాగని డిజిటల్ మీడియాలో అంతా చెత్తే అని పక్కన పెట్టాల్సిన పనిలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియావారికంటే గొప్పగా రాసే, మాట్లాడేవారున్నారు. కానీ తక్కువ. వీరిని జర్నలిస్టులు అనడానికి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు మనసొప్పదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మహావృక్షాల విలువ డిజిటల్ తరానికి తెలియదు. ఇద్దరికీ జాతి వైరం!
కాబట్టి ఓనమాలు రాని జర్నలిస్టులు అన్నప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియావారికి ఆనందంగా ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్త ఇరవై వేల మంది చదివి, యూ ట్యూబర్ వార్త ఇరవై లక్షల మంది చూసినప్పుడు డిజిటల్ జర్నలిస్టుకు ఆనందంగా ఉంటుంది. శతాబ్దాల జర్నలిజం ఇప్పుడు థంబ్ నెయిల్ దగ్గర చిక్కుకుని విలవిలలాడుతోంది. సకల జర్నలిజం విలువలు, ఆదర్శాలు, అనుభవాలు థంబ్ నెయిల్ దగ్గర తచ్చాడుతున్నాయి.
నిజమైన జర్నలిస్టులను జల్లెడ పట్టడానికి జల్లెడలు ఎలాంటివి, ఎక్కడ, ఎవరు తయారు చేయగలరో చెప్పగలిగినవారు లేరు. “అసలైన సీనియర్ జర్నలిస్టులే” ఆ పని చేయాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడం వరకు బాగానే ఉంది. ఆ అసలు సీనియర్ జర్నలిజం గురివింద నీతులు మాకు తెలియనివా? అంటున్న కొత్తతరం మీడియా ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోకపోవడమే లోకానికి ఆరోగ్యకరం!
“పండితులైనవారు దిగువం దగ నుండగనల్పు డొక్కడు
ద్దండత బీఠ మెక్కిన బుధప్రకరంబుల కేమి యెగ్గగున్?
గొండొకకోతి చెట్టు కొనకొమ్మల నుండగ గ్రింద గండభే
రుండమదేభ సింహనికురంబము లుండవె చేరి భాస్కరా!”
ఒకానొక చెట్టు కొమ్మల మీద కోతులు, కొండ ముచ్చులు ఉంటే ఉండవచ్చుగాక… చెట్టు కింద సింహం ఉంటే… మొదట భయంతో ఏ జంతువుకు నమస్కారం పెడతాం? అని పిల్లలను ఇదివరకు భాస్కర శతకకారుడు ప్రశ్నించేవాడు.
అలా కొండొక ఓనమాలు రాని నకిలీ జర్నలిస్టు చెట్టు కొనకొమ్మన పైన హాయిగా ఉండగా…అన్నీ చదివి, అపార అనుభవమున్న అసలు సిసలు జర్నలిస్టు నిలువ నీడలేక దిగులు దిగులుగా, అనామకుడిగా ఉండిపోతే ఆ అమర్యాద ఎవరికి? అతడికా? లోకానికా? అని తాత్వికంగా భాస్కరశతకాన్ని అన్వయించుకుని మనల్ను మనం ప్రశ్నించుకోవడం తప్ప చేయగలిగింది లేదు!
అంటే అన్నారంటారు కానీ… వైట్ అండ్ వైట్ ఖద్దరు వేసిన ప్రతివాడూ రాజకీయనాయకుడే అవుతున్నప్పుడు అసలు సిసలు రాజకీయనాయకుడెవరో తేల్చడానికి కూడా జల్లెడలు ఉండాలి కదా? అన్న ప్రశ్న ఉదయిస్తే… సమాధానం ఉంటుందా?
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article