.
ఫేక్ జర్నలిస్టులను చూస్తే కొట్టాలనిపిస్తుంది… ఇదే కదా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించింది… చాలామంది నాయకులు, జర్నలిస్టులు, సెలబ్రిటీలు, సొసైటీ ప్రముఖులు బయటికి అనలేదు, సీఎం బయటికి చెప్పాడు… అంతే తేడా…
కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి చేదు అనుభవాలు లేవో, లేక సీఎం ఏం చేసినా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నాడో… క్యాంపెయిన్ జర్నలిస్టులు, ప్రాపగాండా జర్నలిస్టులు, ఫేక్ జర్నలిస్టుల గురించి నిజంగానే తెలియదో గానీ… అబ్బే, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తప్పు అని ఏదో స్పందించాడు…
Ads
పిచ్చి రాతలు, ఎడ్డి కూతల జర్నలిజం తామూ చూస్తున్నారు కాబట్టి బీజేపీ ఈ విషయంలో పెద్దగా స్పందించలేదు, సంయమనంతో వ్యవహరించింది… కానీ బీఆర్ఎస్ క్యాంపు మాత్రం ఎప్పటిలాగే రంగంలోకి దిగిపోయి, జర్నలిస్టుల్ని సీఎంకు వ్యతిరేకంగా కూడగట్టే విఫల ప్రయత్నం చేసింది…
వీటన్నింటి నడుమ సోషల్ మీడియాలో అక్కడక్కడా ఓ పోస్టు ఆసక్తికరంగా అనిపించింది… అదేమిటీ అంటే..? అప్పటికి వాణిశ్రీ వర్ధమాన తార… చెన్నెైలో ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్టు ఒకరు ఆమె కలర్‌పై ఏదో కూశాడట… ఒళ్లు మండిన ఆమె హైహీల్ తీసి అక్కడే కొట్టిందట సదరు జర్నలిస్టును…
వాణిశ్రీ ఎవరో జర్నలిస్టును చెప్పుతో కొట్టిందట అనే వార్త క్షణాల్లో ఇండస్ట్రీ మొత్తం పాకింది… అరెరె, అలా బ్యాలెన్స్ కోల్పోయింది ఏమిటి..? ఇక ఇండస్ట్రీలో బతకనిస్తారా, ఉండనిస్తారా అనే వ్యాఖ్యలు… కానీ ఏమీ కాలేదు… ఆమె కెరీర్ మరింత ప్రజ్వలంగా వెలిగిపోయింది…
ఇప్పుడు సోషల్ మీడియా రాతలు, యూట్యూబ్ కూతలు, థంబ్ నెయిల్ ఇకారాలు… మీడియా మీట్లలో పేరొందిన ఫిలిమ్ జర్నలిస్టుల ప్రశ్నలకు, వెక్కిరింపులకూ కొదువ లేదు… సెలబ్రిటీలకు మండిపోతున్నా, కోపాన్ని తమాయించుకుంటారు… కానీ అప్పట్లో వాణిశ్రీ అలా స్పందించిన ఆ రోజుల్లో ఎవరో కొందరు జర్నలిస్టులు ఫీల్డులో…
ఐనా సరే… ఇండస్ట్రీలో మీడియాతో వ్యవహారం చాలా సున్నితమైందే అయినా సరే… ఆమె తన కోపాన్ని అణుచుకోలేకపోయింది… సో, కొందరు జర్నలిస్టులను చూస్తే కొట్టాలనిపిస్తుంది అనే భావన ఈరోజులది కాదు, ఒక్క రేవంత్ రెడ్డిదీ కాదు… ఎప్పటి నుంచో ఉన్నదే అన్నమాట… అది ఫిలిమ్ జర్నలిజం అయినా, పొలిటికల్ జర్నలిజం అయినా… మరే జర్నలిజం అయినా..!
అవునూ, జర్నలిస్టు అంటే ఎవరు..? మీడియా అకాడమీల పెద్దలు ఏమైనా సెలవిస్తారేమో అనుకున్నాగానీ… వాళ్లకూ క్లారిటీ లేదు కదా… సైలెంట్..!! తిరుపతిలోనో, మరెక్కడో పోలీసులు క్యూాఆర్ కోడ్‌తో ఉన్న స్టిక్కర్లను వాళ్లే పంపిణీ చేశారట, అవి వాహనాలకు అతికించుకుంటే ఆపరట, అవి గాకుండా వేరే ప్రెస్ స్టిక్కర్లు కనిపిస్తే కేసులు, జరిమానాలు తప్పవట… అంటే పోలీసుల దృష్టిలో వాళ్లు ఫేక్ జర్నలిస్టుల, సంఘవిద్రోహులు అన్నమాట…
సరే, ఎవరు జర్నలిస్టు, ఎవరు జర్నలిస్టు కాదు అని వాళ్లు ఎలా నిర్ధారించుకున్నారు..? ప్రభుత్వం ఇచ్చే అక్రెడిటేషన్లేనా ప్రామాణికం..? అంటే ఏదో ఓ అక్రెడిటేషన్ సంపాదిస్తే సరిపోతుందన్నమాట… చెలామణీ అయిపోవచ్చన్నమాట..? ఇలా ఇప్పటి జర్నలిజం అపసవ్య పోకడల మీద రాస్తూ పోతే ఒడవదు, తెగదు..!!
Share this Article