.
“ఇంతకంటే పతనం కాలేవు అనుకున్న ప్రతిసారీ నా అంచనాలను తలకిందులు చేస్తుంటావు” అని సినిమాలో డైలాగ్ ఒకటి బాగా ప్రచారంలో ఉంది. అలా హైదరాబాద్ లో ప్రతి వర్షాకాలంలో ఇంతకంటే ఇక దారుణంగా ఉండదు అనుకున్న ప్రతిసారీ మన అంచనాలు తలకిందులు అవుతూ ఉంటాయి.
పోయిన సంవత్సరమే నయం… వర్షంలో మూడు గంటల్లో ఇల్లు చేరుకోగలిగాం… ఈసారి ఆరు గంటలు పట్టింది అని “గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్” అన్న పోలికతో మనల్ను మనం ఓదార్చుకుంటూ ఉంటాం.
Ads
వర్షాలు మొదలవగానే హైదరాబాద్ సముద్రమవుతుంది. అలలు అలలుగా కష్టాలు తీరం దాటి ఇళ్ళల్లో కాళ్ళదగ్గరికే వస్తాయి. పదును పదునుగా వర్షం కురిసే కొద్దీ నగరం రహదారులన్నీ నదుల కాలువలవుతాయి. వాతావరణ శాఖ కచ్చితంగా ఎక్కడ ఎన్ని మిల్లీమీటర్ల వర్షం పడుతుందని చెబుతుందో అక్కడే కొన్ని మీటర్ల వర్షపాతం అశనిపాతంలా పడుతూ ఉంటుంది.
నీటిలో పడవల్లా తిరగడం చేతగాని సిటీ బస్సులను విశాల ప్రజా ప్రయోజనం దృష్ట్యా పోలీసులు ఆపేయాల్సి వస్తుంది. టూ వీలర్ల సైలెన్సర్లలోకి నీళ్ళు పోవడంవల్ల ద్విచక్రవాహనం నడిపేవారికి నరకం కనపడుతూ ఉంటుంది.
కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో అన్న సమయోచిత గీతం పాడుకుంటూ ఆటోలు, కార్లు మూసీ మీదుగా, కృష్ణను చేరి… కృష్ణ మీదుగా బంగాళాఖాతం చేరడానికి తేలుతూ… తూలుతూ కొట్టుకుపోతూ ఉంటాయి. గాలికి గునపాలు ఎగిరిపోతుంటే గుండు సూది పోయిందని బాధపడకూడదు కాబట్టి… ప్రాణం మిగిలి… మిగిలినవన్నీ కళ్ళ ముందే కొట్టుకుపోతున్నా… నగరవాసి పట్టించుకోడు.
నగరమంతా రోడ్లకిరువైపులా వర్షం వస్తే ఫెళఫెళమని విరిగిపడే చెట్లను దశాబ్దాలుగా నాటడంలో ఏదో ఆంతర్యం దాగి ఉందని జి హెచ్ ఎం సి గొప్పతనాన్ని ఆ చెట్ల కింద ఇరుక్కున్న నగరవాసి అన్వేషిస్తూ ఉంటాడు. ఆ చెట్లకింద వాహనాలు ధ్వంసమైన, ప్రాణాలు పోయిన ఫోటోలను మరుసటి రోజు పేపర్లలో చూస్తూ అందులో మనం లేము కాబట్టి బతికి ఉన్నామని నగరవాసి ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు.
ఉరుములు, మెరుపులతో వర్షం విరుచుకుపడే వేళ మెరుపు వెలుగు ఉండగా కరెంట్ ఎందుకని తీసేయాల్సి వస్తుంది. తీసేయకపోతే ఆ తీగలు మీదపడి ప్రాణాలు తీస్తాయి కాబట్టి కరెంట్ లేకపోవడమే శాస్త్రీయంగా మంచిదని లోకం కూడా అంగీకరించింది.
ఊరు ఊరంతా రోడ్లమీద తేలుతూ ఉంటే అక్కడక్కడా పోలీసులు నిల్చుని ట్రాఫిక్ ను “నియంత్రిస్తూ” ఉంటారు. ఇక్కడ “నియంత్రణ” అన్న మాటకున్న వ్యుత్పత్తి అర్థాన్ని వారు ఆ వేళ దొరకని శబ్దరత్నాకరం నిఘంటువులో వెతుక్కుంటూ ఉంటారు అని అర్థం చేసుకోవాలి. సిగ్నళ్ళు ఆగిపోయి ఉంటాయి కాబట్టి… పోలీసు చేయి ఎటు ఊపితే అటుగా వాహనాలు కదులుతూ ఉంటాయి.
ఈలోపు త్వరగా వెళ్ళాల్సిన వాహనాలు ఎటు సందు దొరికితే అటు వచ్చేస్తాయి. అప్పుడు పోలీసుల మనోభావాలు సహజంగా దెబ్బతిని వారు చేతులు ఊపడం ఆపి… కనుసైగలు మెదలుపెడతారు. నోటి భాషనే అర్థం చేసుకోలేని లోకం కంటి భాషను అర్థం చేసుకోలేక ఎక్కడికక్కడ ఆగిపోతుంది.
పీకల్లోతు కష్టాల్లో తేలుతూ కార్లలో రేడియో పెట్టుకుంటే తెలుగు మాట్లాడుతున్నామనుకుంటూ ఇంగ్లీషులో మాట్లాడే రేడియో జాకీల మాటల సునామీ మొదలవుతుంది.
యూ టర్న్ ల వల్ల ట్రాఫిక్ కదలదని గ్రహించిన పోలీసులు అప్పటికప్పుడు బారికేడ్లు పెట్టడంతో అర కిలోమీటర్ ప్రయాణించాల్సినవారు ఆరు కిలోమీటర్లు ప్రయాణిస్తూ చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్న కాలము- దూరము లెక్కలు కట్టుకుంటూ యూ టర్న్ ఏ రకంగా ప్రయోజనమో తేలక గుండెలు బాదుకుంటూ ఉంటారు.
నేను ఫలానా చోట రెండు గంటలుగా ఇరుక్కున్నాను అని ఇటు ఫోన్లో చెబితే… నేను నాలుగు గంటలుగా ఇరుక్కున్నాను అని అటు ఫోన్లో సమాధానం వచ్చినప్పుడు… ఆ కిక్కే వేరప్పా! రప్పా! రప్పా!!
తీరా భవసాగరాలు, అసలు సాగరాలు ఈది ఇంటికొస్తే వర్షానికి నగరమంతా ఆగిపోయిన వార్తలు టీవీల్లో తెరలు తెరలుగా వస్తుంటాయి. అలాంటి జలోపద్రవం నుండి క్షేమంగా ఆరుగంటల్లో ఇంటికి చేరుకున్న మన ధైర్యసాహసాల మీద మనకే ముచ్చటేస్తుంది. ముద్దొస్తుంది. మనకు ఏ పరమ ధైర్య అవార్డులు ఎందుకు రావన్న ప్రశ్న ఉదయిస్తుంది.
“హైదరాబాద్ కు సముద్రాన్ని తీసుకొస్తాను” అని ఒక సినిమాలో ఒక నాయకుడు ఎన్నికల వాగ్దానం చేస్తాడు. దాన్ని అందరూ కామెడీగా తీసుకున్నారు. కానీ… అదే రాజకీయనాయకులు హైదరాబాద్ లో నీటి సహజ ప్రవాహాన్ని అడ్డుకుని, చెరువులను మింగి ఆకాశహర్మ్యాలు లేపుతూ… హైదరాబాద్ అభివృద్ధికి ఆకాశమే హద్దు అని ఎన్నికల ప్రచారం చేసుకున్నప్పుడు జనం కామెడీగా కాకుండా సీరియస్ గా తీసుకుని కోకాపేట ఎకరా వంద కోట్లతో తమ గజాలను భాగించుకుంటూ లెక్కపెట్టలేని సున్నాల విలువను ఊహించుకుంటూ మురిసిపోయారు. తీరా ఊరు మునిగిపోతుంటే తెప్పల్లో తిరుగుతూ అంతర్జాతీయ నగరమంటే ఇలా పడవల్లో ప్రయాణమేమో అని అంతర్జాతీయ నగర ప్రమాణాల తెడ్డేసుకుంటూ ఒడ్డు వెతుక్కుంటున్నారు.
అన్నట్లు- హైటెక్ సిటీ ముందు లోటెక్ అండర్ పాస్ లో నాలుగు గంటలు ఇరుక్కున్న నగరం; ఫలానా చోట అయిదు కిలోమీటర్ల మేర అయిదు గంటలుగా కదలని ట్రాఫిక్ లాంటి వార్తలు విశ్వనగరం మెడలో మణిహారాలు. వర్షానికి మునిగే కాలనీలు, కెనాల్స్ అయ్యే రోడ్లు, స్తంభించే జనజీవనం లాంటి వార్తలు విశ్వనగరం చెవిలో మారుమోగే వీనులవిందు కీర్తి గీతాలు! నినాదంలో హైదరాబాద్ ఈజ్ రైజింగ్! వర్షాకాలం విధానంలో మాత్రం సింకింగ్!!
అంకితం:- ప్రతి ఏటా వర్షానికి రోడ్డుమీద గంటలు గంటలు కదలలేక నీటిలో మునుగుతూ… తేలుతూ… ఇరుక్కుని… నరకం చూస్తున్న నా నవీన వెనిస్ నగరానికి!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article