.
జామచెట్టుకు కాస్తాయ్ జామకాయలు… అనే ఉత్కృష్టమైన సాహిత్యానికి దీటైన, దాటేసే మరింత మహోత్కృష్ట సాహిత్యం ఇక రాదనే భ్రమల్ని పటాపంచలు చేసింది ఈ పాట…
పాట పేరు ఓలె ఓలె… తెలుగు పాటే… కానీ వీథి పంపు బజారు భాష… ఆ పదాలు అలా అలా దొర్లిపోతూ… వెగటు పుట్టిస్తూ… దుర్గంధాల్ని వెదజల్లుతూ…. మన తెలుగు సినిమా పాటల మహా పంకిల ప్రస్థానానికి ఓ సంకేతంలా… కుర్చీ మరోసారి మడతపెట్టేసింది…
Ads
నిజానికి ఈ సినిమా నిర్మాత నాగవంశీ టేస్టు మీదో… రవితేజ, శ్రీలీల టేస్టు మీదో ఎవరికీ పెద్ద భ్రమలేమీ లేవు… వాళ్లు ఏ పాటకైనా, ఏ సీనుకైనా రెడీ… అత్యుత్తమ కళాభిరుచిపరులు… కానీ ఈమధ్య కొంతకాలంగా మంచి పేరు తెచ్చుకుంటున్న భీమ్స్ సిసిరోలియో ఈ పాట పాడాడు, స్వరకల్పన చేశాడు అంటేనే హాహాశ్చర్యం…
ఒకవైపు శ్యామ్ కాసర్ల ఊరిపాటకు జాతీయ గుర్తింపు వచ్చిందని ఆనందించేలోపే… ఇదుగో ఈ ఉత్తరాఖండ్ క్లౌడ్‌బరస్ట్ బురద వంటిదేదో వచ్చి తాకింది బలంగా…
ఈ పాటలో ఓచోట రాస్తాడు రచయిత… (ఫాఫం, రచయితదేముందిలే… నిర్మాత టేస్టును బట్టే కదా పాటలు పుట్టేది, అనగా రాయబడేది) బుద్ది లేదు, జ్ఞానం లేదు, సిగ్గు లేదు, శరం లేదు, మంచి లేదు, మర్యాద లేదు… నిజం… ఏవీ లేవు ఈ పాటలో… పాటకు బాధ్యుల్లో…
అంగి లేదు, లుంగి లేదు, లాగు లేదు, పంచె లేదు, తాడు లేదు, బొంగురమూ లేదు… అక్షరాలా నిజం… ఈ పాటకు అవేవీ లేవు, బరిబాతల ఉంది… (పైగా శ్రీకాకుళం పేరు చెప్పి ఆ ప్రాంతాన్ని కించపరచడం తప్ప…) సిలకా, మొలకా, గిలకా, పలకా అనే అద్భుత భావగర్భిత, అదేదో మర్మగర్భిత పదాలతో మొదలవుతుంది పాట…
నీయమ్మ, యక్క, చెల్లి, తల్లి అంటూ…. గుంటా, నీ అయ్యకాడ తింటా, నీ అమ్మకాడ తింటా, నీ ఒళ్లోకొచ్చి పంటా అంటూ… నీయమ్మని, నీయక్కని, నీతల్లిని, నీచెల్లిని పట్టుకునీ… అని కాస్త పాజ్ ఇస్తాడు, ప్రేక్షకులు, శ్రోతలు ఏదైనా అనుకునేందుకు, ఊహించుకునేందుకు చాన్స్ ఇచ్చి… తరువాత సదరు నాట్యగత్తె కమ్ హీరోయిన్ తో కూడా ‘పట్టుకుని..?’ అని అడిగించి… వినేవాళ్లను, చూసేవాళ్లను ఓసారి మూసీలో ముంచి… అప్పుడు చెబుతాడు ‘కాళ్లు మొక్కిపోతా’ అని… అందరి చెవుల్లోనూ రఫ్లీషియా పూలన్నమాట…
కొరియోగ్రఫీ జానీ మాస్టర్ అట… (ఆ జానీ మాస్టరేనా..? ఆ లైంగిక వేధింపుల కేసు బాపతేనా..?) నీ కుంకి ముక్కు రక్కీ రక్కీ కొరికేస్తానే… యాటంకి పోయినా పట్టువట్టి తడిమేస్తానే అంటుంటే ఆమె సిగ్గుతో బొంగరాలు తిరిగిపోతుంది మహా సంబురంతో… వాటిని స్టెప్పులు అనాలి కదా… వోకే వోకే…
ఆమె ఏం తక్కువ తిందా…? కట్టు లేని పిట్టను నేను… జీడిపప్పు జాడీని నేను… అంటూ తను కూడా నీ అయ్యని, నీ అబ్బని పట్టుకునీ అని రాగం తీస్తుంది… నా సిగల ముడుచుకుంటా అంటుంది… వాడి అయ్యని, వాడి అబ్బని తను సిగలో ముడుచుకోవడం ఏమిటో… వామ్మో… సినిమా పేరే అదట… మాస్ జాతర…, మనదే ఇదంతా ట్యాగ్ లైన్… ఓహో మాస్ అంటే ఇదా..!! ఫాఫం… తెలుగు సినిమా పాట..!! వానెక్క, ఏం టేస్టురా..!!
Share this Article