.
బయటపడిన పెద్ద స్కాం… ఇదొక పెద్ద నెట్‌వర్క్… పలు రాష్ట్రాల్లో విస్తరించిన ఈ నెట్‌వర్క్ దాదాపు 1000 కోట్ల దాకా జీఎస్టీకి గండికొట్టినట్టు ప్రాథమిక అంచనా… దేశవ్యాప్తంగా ఈడీ దాడుల్లో వెలుగులోకి వచ్చిన స్కాం ఇది…
ఇటీవల కాలంలో అనేక మోసాలు వెలుగులోకి వస్తున్నా, ఈ స్కామ్ మాత్రం కొత్తగా, అర్థం చేసుకోవడానికి చాలా క్లిష్టంగా ఉంది… ఈ భారీ ₹1000 కోట్ల నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మూడు రాష్ట్రాల్లోని 12 ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించింది…
ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ మోసం ₹1,200 కోట్లకు, ఇంకా అధిక స్థాయికీ చేరవచ్చని, ఇది ఇప్పటివరకు బయటపడిన అతిపెద్ద ITC మోసాలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది…
Ads
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) నిబంధనల ప్రకారం ఈ దాడులు జరిగాయి… వస్తువులు లేదా సేవలు వాస్తవంగా సరఫరా చేయకుండానే, నకిలీ సంస్థలను సృష్టించి మోసపూరితంగా ITC క్లెయిమ్ చేస్తున్న వ్యక్తులు, సంస్థలే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగాయి…
సమాచారం ప్రకారం.., మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ- NCR లలోని ప్రధాన నగరాలలో ఈ దాడులు జరిగాయి… ఈ నకిలీ ITC నెట్‌వర్క్‌లో ప్రధాన సూత్రధారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, చివరి లబ్ధిదారులపై ఈడీ దృష్టి సారించింది… నిందితులు డజన్ల కొద్దీ షెల్ కంపెనీలను సృష్టించి, నకిలీ ఇన్వాయిస్‌లను జారీ చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానా నుండి వందల కోట్ల రూపాయలను దారి మళ్ళించారని ED అనుమానిస్తోంది…
ఈ దాడులలో డిజిటల్ రికార్డులు, నేరానికి సంబంధించిన పత్రాలు, లెక్కల్లో చూపని నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం… ఈ నకిలీ క్లెయిమ్‌ల ప్రక్రియ లేదా ఆమోదంలో పాత్ర పోషించి ఉండవచ్చని భావిస్తున్న కొంతమంది ప్రభుత్వ అధికారుల పాత్రపైనా ED దర్యాప్తు చేస్తోంది… ఓ పెద్ద డొంక కదులుతోంది... అంతేకాదు, మన జీఎస్టీ విధానం అమలులో ఉన్న లోపాలనూ, లొసుగులనూ ఇది బహిర్గతం చేస్తోంది..
.
గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) అధికారులు దాఖలు చేసిన FIRల ఆధారంగా ఈ దర్యాప్తు ప్రారంభమైంది… పన్నుల వ్యవస్థలోని లొసుగులను ఉపయోగించుకోవడానికి రూపొందించబడిన నకిలీ లావాదేవీల భారీ సంక్లిష్టమైన వలయాన్ని GST అధికారులు మొదటగా గుర్తించారు.., దర్యాప్తు కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది…
Share this Article